ఈ వానలకు ఏమైందీ..?

వాన పాటలు... వాన మాటలు...వాన కథలు... వాన కవిత్వం...అసలు వానంటే ఎంతిష్టమో మనకి. నేలని నమ్ముకుని బతికే మనిషికిదే కదా ప్రాణాధారం. అందుకే వేసవి నాలుగు నెలలూ అందరి ఆశలూ రాబోయే రుతుపవనాల మీదే ఉంటాయి.

Updated : 06 Aug 2023 10:38 IST

వాన పాటలు... వాన మాటలు...వాన కథలు... వాన కవిత్వం...అసలు వానంటే ఎంతిష్టమో మనకి. నేలని నమ్ముకుని బతికే మనిషికిదే కదా ప్రాణాధారం. అందుకే వేసవి నాలుగు నెలలూ అందరి ఆశలూ రాబోయే రుతుపవనాల మీదే ఉంటాయి. సమయానికి వస్తాయా అని రైతులూ, వాతావరణం చల్లబడుతుందని ప్రజలూ, వానలు బాగా కురిస్తేనే అమ్మకాలూ కొనుగోళ్లూ బాగా సాగుతాయని వ్యాపారులూ... వాతావరణ శాఖ చెప్పే చల్లని కబురు కోసం ఎదురుచూస్తారు. అయితే ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూసినంతసేపు పట్టడం లేదు- ఇవేం వానలురా దేవుడా... అనుకోడానికి. జులై నెల అంతా జనానికి చుక్కలు చూపించాయి వర్షాలు.

రావు... వస్తే పోవు అన్నట్టుగా తయారైంది వానల పరిస్థితి.

రెండు మూడు వారాలు పిల్లలకు బడుల్లేవు... పెద్దలు ఆఫీసులకు వెళ్లిరావడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

రోడ్లన్నీ నాశనమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాటిన పంటలన్నీ ఊడ్చుకుపోయాయి. చెరువులు పొంగి పొరలుతూ ఊళ్లను ముంచేశాయి. రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు తెగిపోయి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జ్వరమొచ్చినా పురుడొచ్చినా ఆఖరికి చావొచ్చినా...నడుంలోతు నీళ్లలో భుజాన మోసుకెళ్లడమే దిక్కయింది.

ఏమిటీ కష్టాలు... ఏటికేడాదీ ఎందుకిలా పెరుగుతున్నాయి వానలు..?
చేసిన కష్టమంతా గంగపాలవుతుంటే కన్నీరేగా రైతుకి మిగిలేది?
ఒకప్పుడు...బొట్టుపెట్టి పిలిచినట్లుగా వేళకి వచ్చేసేవి రుతుపవనాలు.

తొలకరి జల్లులు దఫదఫాలుగా పలకరించి... నేలను పులకరింపజేసేవి. సాగు పనులకు సిద్ధం కమ్మని రైతుల భుజం తట్టేవి. ఇలా కమ్ముకువచ్చి అలా చెదిరిపోయే ఆషాఢ మేఘాలు విత్తనాలు నాటే రైతుల మదిలో ఆశల పందిళ్లు వేసేవి. వెనువెంటనే బరువుగా వచ్చే శ్రావణ మేఘాలు నిలబడి నిండుగా కురిసి నీటితో చెరువుల్నీ భవిష్యత్తు పట్ల నమ్మకంతో రైతు గుండెల్నీ నింపేవి.

అసలు వానల్లో ఎన్ని రకాలుండేవనీ..! సన్నని జల్లు కురిసి పోతే- బట్ట తడుపు వాన అనేవారు. ఇంకాస్త పెద్దగా నేలంతా కళ్లాపి చల్లినట్లు తడిస్తే అది నేల తడుపు వాన. కాస్త గట్టిగా పడి నేల మెత్తబడితే అది దుక్కి వాన. ఆపకుండా ముసురుపట్టి నీటితో మడులు నిండిపోతే మిన్నూ మన్నూ ఏకం చేసే వాన అనేవారు.
అప్పుడప్పుడూ రోజుల తరబడి మబ్బులు కమ్మేసినా అప్పుడో చినుకూ ఇప్పుడో చినుకూ మాత్రమే రాలడం చూసి ‘పిల్లి ఉచ్చబోసినట్లు ఇదేం వాన...’ అని విసుక్కునేవారు రైతులు. అటు వానా ఇటు ఎండా రెండూ లేక ఏ పనీ చేసుకోలేక సతమతమయ్యే పరిస్థితి అది.

ఇలా ప్రజల వాడుక మాటల్లోనే కాదు, వాతావరణ శాస్త్రవేత్తల లెక్కల్లోనూ వానలు చాలా రకాలున్నాయి. అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో... కక్ష కట్టినట్టు కుండపోత తప్ప మరో మాట వినిపించడం లేదు... కనిపించడం లేదు..! గంటకు రెండు సెంటీమీటర్లకు మించి వాన కురిస్తే దాన్ని కుండపోత అంటారు వాతావరణ నిపుణులు. అలాంటిది మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వాన పడడం సాధారణమైపోయింది. ఇప్పుడు కుండపోత అంటే ఏకంగా యాభై, అరవై, డెబ్భై... ఎన్ని సెంటీ మీటర్లయినా కావచ్చు!

పట్టుకుంటే రోజుల తరబడి వదలని ముసురూ, ఒకే రోజు ఆకాశానికి చిల్లు పడ్డట్టు కుమ్మరించే కుంభవృష్టీ... వానని తలచుకుంటేనే వణుకొచ్చే పరిస్థితి తెస్తున్నాయి. ‘వద్దన్నా కురిసే వాన’ ఇప్పుడు పల్లెలకూ అక్కడ పండే పంటలకే కాదు, నగరాలకూ శాపమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దాంతో అందరి నోటా ఒకటే మాట- ఈ వానలకు ఏమైందీ... అని. అది తెలియాలంటే అసలు మన వానల కథేంటో తెలుసుకోవాలి.

లక్షల ఏళ్ల చరిత్ర

భూమికీ నీటికీ మధ్య ఉన్న అనుబంధం తాలూకు పరిణామమే ఏటా ఠంచనుగా వచ్చే ఈ రుతుపవనాలు. టిబెట్‌ పీఠభూమి ఏర్పడినప్పటినుంచి మన దేశానికి నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఆ పీఠభూమికి తోడు ఇటు థార్‌ ఎడారీ దాని చుట్టుపక్కల ప్రాంతాలూ ఎత్తైన హిమాలయాలూ దేశానికి మూడుపక్కలా ఉన్న సముద్రాలూ కలిసి రుతుపవనాలు తయారవడానికికారణమవుతున్నాయి. భూమిమీద గాలి త్వరగా వేడెక్కుతుంది. అలా వేడెక్కిన గాలి పైకి వెళ్లిపోయినప్పుడు అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అదే సముద్రాల మీద గాలి చల్లగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యా తేడా బాగా ఎక్కువైనప్పుడు భూమి మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి సముద్రం మీదినుంచి గాలులు బలంగా భూమి మీదికి వీస్తాయి. అందుకే మనకి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయి చివరికి భరించలేని దశకు చేరుకునేసరికి రుతుపవనాలు వచ్చేస్తున్నాయన్న చల్లని కబురు వినిపిస్తుంది. చూస్తూ చూస్తూ ఉండగానే కేరళ దగ్గర తీరాన్ని తాకి ఒక్కో రాష్ట్రాన్ని దాటుతూ దేశమంతా కారుమేఘాలు కమ్ముకుంటాయి. చల్లని వానల్ని కురిపిస్తాయి. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల పాటు దేశమంతటా సందడి చేసి ఇవి నీరసపడే వేళకు చుట్టూ ఉన్న సముద్రాలు వేడెక్కి అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ చోటును ఆక్రమించుకోవడానికి ఇవి చేసే తిరుగుప్రయాణమే ఈశాన్య రుతుపవనాల రూపంలో మరికొన్ని ప్రాంతాలకు వర్షాన్నిస్తుంది.
మనం రుతుపవనాలకు వర్షాన్ని పర్యాయపదంగా వాడేస్తాం కానీ నిజానికి ప్రతిసారీ అవి వర్షాన్నే తేవాలన్న నియమం లేదు. వాటిల్లో తడి, పొడి రుతుపవనాలని రెండు రకాలు. తడి రుతుపవనాలు వేసవి తర్వాత వస్తాయి. అకస్మాత్తుగా వచ్చి నిదానంగా ముగుస్తాయి. ఆ తడి గాలులు వెళ్లిపోయాక మళ్లీ నేల వేడెక్కడం మొదలెడుతుంది. అప్పుడు వీచే వేేడి గాలుల వల్ల కూడా ఒకోసారి ఆకస్మిక జడివానలు కురియవచ్చు. అక్టోబరు-ఏప్రిల్‌ మధ్య వచ్చే ఇవి వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తాయి. ఈ తడి, పొడి గాలుల మధ్య
వర్షపాతంలో ఉండే తేడానే ఆయా దేశాల్లో రుతుపవనాలకు ప్రత్యేక గుర్తింపునిస్తోంది. మొత్తంగా ఆసియా ఖండమూ అందులో భారతదేశమూ బలమైన రుతుపవనాలను ఎదుర్కొంటాయి. ఇక్కడ కరవైనా, వరదలైనా వాటి పుణ్యమే. ఇతర దేశాల్లోనూ రుతుపవనాలున్నాయి కానీ అవి మన వాటంత బలమైనవీ, క్రమబద్ధమైనవీ కావు. నైరుతి రుతుపవనాల ప్రభావం చైనాలోని షింజియాంగ్‌ వరకూ ఉంటుంది. చైనాకి ఆగ్నేయ రుతుపవనాలు కూడా ఉన్నాయి. మంచినీరు ఎక్కువగా అవసరమైన వరి, తేయాకు పంటల్ని పండించడంలో చైనా, భారత్‌లు ప్రపంచంలో మొదటి రెండు స్థానాల్నీ ఆక్రమించడానికి కారణం ఈ రుతుపవనాలే.
అరబిక్‌ పదం ‘మౌసమ్‌’, డచ్‌ పదం ‘మోసన్‌’ల నుంచి పుట్టిన ఆంగ్లపదమే మాన్సూన్‌. శతాబ్దంన్నర క్రితమే ఈ పవనాల ప్రక్రియను గుర్తించి దానికి మాన్సూన్‌ అన్న పేరు పెట్టి వివరాలను రికార్డు చేయడం మొదలెట్టారు.

అన్నిటికీ అవేే ఆధారం

ఇప్పుడు మన దేశానికి అవసరమైన వర్షపాతంలో 85శాతం నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తోంది. వరి, గోధుమ, చెరకు, పప్పుధాన్యాలు, నూనెగింజలు లాంటి ప్రధాన పంటల దిగుబడిని నిర్దేశించేది ఈ వర్షపాతమే. రుతుపవనాలు బాగుంటే పంటల దిగుబడి పెరుగుతుంది. పల్లె ప్రజల చేతిలో డబ్బుంటుంది. వినియోగ వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంటాయి. అదే రుతుపవనాల వల్ల సరైన వానలు కురవకపోతే- ధాన్యమూ పప్పులూ నూనెలూ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ధరలూ ద్రవ్యోల్బణమూ పెరిగిపోతాయి. అందుకే ఏటా- వచ్చే వర్షాకాలం ఎలా ఉండబోతోందీ అన్న అంచనాలు ఏప్రిల్‌ నుంచే మొదలవుతాయి. వర్షపాతం సాధారణంగా ఉంటే పర్వాలేదు, తక్కువగా ఉంటే పంటలు పండక కరవొస్తుంది. ఎక్కువగా ఉంటే వరదలొచ్చి పంట నష్టం సంభవిస్తుంది కాబట్టి అదీ కరవుకే దారితీస్తుంది.
దేశ ఆర్థిక ప్రగతికి వెెన్నెముక అయిన ఈ రుతుపవనాలు తరచూ గతి తప్పడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఇంతకు ముందు వానాకాలం నాలుగు నెలలపాటు ఒక క్రమపద్ధతిలో వానలు పడేవి. వాటికి తగినట్లుగా పంటల్ని వేసేవారు. అల్పపీడనాలు ఏర్పడి తుపాన్లు వచ్చినప్పుడు అరుదుగా వరదలు వచ్చేవి. ఇప్పుడు ఆకాశంలో చెరువుకి గండిపడినట్లు ఒక్క పళాన కుమ్మరిస్తుంటే వానే వరదగా మారిపోతోంది. ఈ పరిస్థితులకు కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చేపట్టిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇన్నాళ్లూ వాతావరణ మార్పులకు కారణమవుతున్న భూతాపాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అనేవాళ్లు. ఇప్పుడది ‘గ్లోబల్‌ బాయిలింగ్‌’ స్థాయికి చేరిందని ఐరాస అధ్యక్షులు వ్యాఖ్యానించారు. ఎందుకంటే మనదేశం ఇలా వానల్లో తడిసి ముద్దవుతున్నప్పుడే ఉత్తరార్థ గోళంలో ఎండలు మండిపోతూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ ఏడాది ఏమైందంటే...

ఈ సంవత్సరం నిజానికి సాధారణ పర్షపాతంకన్నా తక్కువే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ...ఆలస్యంగా వచ్చి: ఋతుపవనాలు రావడమే వారం ఆలస్యంగా వచ్చాయి. వచ్చి కూడా త్వరగా వ్యాపించలేదు. తుపాను రావడంతో ముంబయిని రెండు వారాలు ఆలస్యంగా, దిల్లీని రెండు రోజులు ముందుగా ఒకే సమయంలో తాకి తమ సత్తా చూపడం మొదలెట్టాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది 4శాతం లోటు వర్షపాతం ఉండాలి. కానీ ఆ సమయానికి ఉన్న పదిశాతం లోటు నుంచి కేవలం ఎనిమిదే రోజుల్లో సాధారణం కన్నా రెండు శాతం ఎక్కువకి చేరింది వర్షపాతం. దాదాపుగా ఉత్తరాది రాష్ట్రాలన్నీ నానా అవస్థలూ పడ్డాయి. యుమున పొంగింది. ఎర్రకోటతో సహా రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. కొద్ది రోజులపాటు జనజీవనం స్తంభించింది. కోతకొచ్చిన పంటలు వరదపాలయ్యాయి.
ఎల్‌నినో పరిస్థితులూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమాన కార్చిచ్చుల వ్యాప్తీ, అరేబియా సముద్రం గత ఆర్నెల్లలోనే ఒకటిన్నర డిగ్రీలు వేడెక్కడమూ... ఈ పరిస్థితులన్నీ కలిసి అసాధారణ వానలకి కారణాలయ్యాయంటున్నారు నిపుణులు.
వారంలో తారుమారు: వానలు రాక, నీటి జాడ లేక నదులు బోసిపోయి ఉన్నాయని జులై 17వ తేదీన పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకీ సాగు, తాగు నీరు అందించే నాగార్జున సాగర్‌ అడుగంటిందనీ గతేడాది ఈ సమయానికి తుంగభద్రకు వరదొచ్చిందనీ, సుంకేశుల నుంచి లక్షన్నర క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వచ్చిందనీ ఈ ఏడాది ఇప్పటివరకూ వీటిలోకి ఇన్‌ఫ్లోనే నమోదు కాలేదనీ అవి పేర్కొన్నాయి. ఆ మరుసటి రోజే వానలు మొదలవ్వడమూ వానలొచ్చేశాయన్న ఆనందం కొద్దిరోజుల్లోనే ఆందోళనగా మారడమూ జరిగిపోయింది. మూడోరోజుకల్లా గోదావరికి భారీగా వరదనీరు వచ్చింది. వారం తిరిగేసరికి పలు జిల్లాల్లో చెరువులు నిండిపోయాయి. పంటలన్నీ నీటమునిగాయి. ఇలాంటి వానల వల్ల వ్యవసాయానికి తీరని నష్టం జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. దాంతోపాటే మరెన్నో సమస్యలు.

జనజీవితం అస్తవ్యస్తం

చలిగా ఉంటే దుప్పటి ముసుగెట్టుకు పడుకోవచ్చు. ఎండలు మండిపోతుంటే ఏ చెట్టుకిందో సేద తీరవచ్చు. కానీ వాన కష్టాలు ఒకటీ రెండూ కాదు. మొత్తంగా జనజీవనమే అల్లకల్లోలమైపోతుంది. వానకి ఒక సమయం సందర్భం ఉండవు. ఎప్పుడు వస్తుందో ఎంతసేపు పడుతుందో ఎంత పెద్దగా పడుతుందో... చెప్పలేం. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందబట్టి ఇప్పుడైనా ఓ నాలుగు రోజులు ముందునుంచీ చెబుతున్నప్పటికీ దానివల్ల కాస్త అప్రమత్తంగా ఉండడం తప్ప అసలు సమస్యలేవీ తీరట్లేదు. వరద ప్రమాదం ఉందనీ లోతట్టు ప్రాంతాలవారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలనీ అధికారులు హెచ్చరిస్తారు. కానీ ఇల్లూ సామానూ గొడ్డూ గోదా అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లి తలదాచుకోవడానికి ఎవరికీ మనసొప్పదు.
దాంతో చివరి నిమిషం వరకూ వేచిఉంటారు. వరదంటేనే ఒక్కసారిగా ఊడిపడేది. తప్పించుకునే అవకాశం ఇవ్వదు. చుట్టూ నీరు చేరాక వాళ్లను తరలించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇక నీట మునిగిన ఊళ్లలో ఆస్తినష్టం అంచనాలకు అందనిది.
పల్లెల కన్నీరు: వానాకాలం మొత్తంమీద పడాల్సిన వాన ఒక వారంలోనో కొన్నిచోట్ల ఒక్కరోజులోనో కురిసింది. దాంతో వరి, సోయాబీన్‌, మొక్కజొన్న, పసుపు, పత్తి... తదితర పంటలన్నీ కొట్టుకుపోయాయి. భూమిలోకి ఇంకడానికి సమయం లేకా, ప్రాజెక్టుల సామర్థ్యం మించిపోయీ కురిసిన వానంతా వ్యర్థంగా సముద్రాల్లోకి పోతోంది. తర్వాత మళ్లీ వానలు కురవకపోతే ఈ పరిస్థితి నీటి కరవుకి దారితీస్తుంది. అతివృష్టీ అనావృష్టీ- రెండూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. క్రాప్‌ రొటేషన్‌ దెబ్బతిని దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమవుతుంది. భారీవర్షాల ధాటికి రోడ్లూ వంతెనలూ కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పాత ఇళ్లు నీళ్లలో నాని కూలిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చెట్లూ కరెంటు స్తంభాలూ కూలిపడ్డాయి. చాలాచోట్ల కరెంటు సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనదేశంలో విభిన్న భౌగోళిక పరిస్థితుల వల్ల వర్షపాతం అన్నిచోట్లా సమంగా పడదు. ఈ గతి తప్పిన రుతుపవనాల వల్ల అది మరింత ఎక్కువవుతోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా జిల్లాలు కుండపోత వానల్ని చూస్తే కొన్ని జిల్లాల్లో అసలు వానలే కురవలేదు. 

పర్వత ప్రాంతాల్లో: కొండచరియలు

విరిగిపడిన ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రహదారులు మూసుకుపోయి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. పర్యటకులు రోజుల తరబడి ఇరుక్కుపోయారు.

నగరాల్లో: గంటకు రెండు సెం.మీ.ల వాన పడితే మాత్రమే నగరాల్లో వరద కాలువలు తట్టుకోగలుగుతాయి. ఇప్పుడు ఐదారు సెంటీమీటర్లు పడడంతో వానొచ్చినప్పుడల్లా రహదారులన్నీ నదుల్లా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగిపోతున్నాయి. నీటి ఒత్తిడి ఎక్కువైై డ్రెయిన్స్‌ దెబ్బతిని మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోంది. మంచినీటి సరఫరాకీ అంతరాయం ఏర్పడుతోంది.
పొంచి ఉన్న ప్రమాదం: ఎండ సోకకుండా రోజుల తరబడి ఇలా వర్షాలు కురవడం వల్ల జలుబులూ జ్వరాలూ డయేరియా లాంటి రకరకాల అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. దోమలు విజృంభించి డెంగీలాంటి వ్యాధుల్ని వ్యాపింపజేసే ప్రమాదమూ పొంచి ఉంది.

అడ్డుకోవాల్సిందే...

నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రుతుపవనాలు మరీ అంత ఘోరంగా ఏమీ మారలేదు. వర్షపాతంలో 5 నుంచి 10 శాతం తేడా ఉంటే వినడానికి అదేమంత పెద్ద విషయంగా అనిపించదు. కాకపోతే వైవిధ్యభరితమైన భౌగోళిక పరిస్థితులూ, జనసమ్మర్దమూ ఎక్కువున్న దేశం కాబట్టి ఆ కాస్త తేడానే వ్యవసాయ, ఆర్థిక రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహార భద్రతని ప్రశ్నార్థకం చేస్తోంది. దానికి తోడు అదుపుతప్పి కురవడం వల్ల అనేక ఇబ్బందులూ పడాల్సివస్తోంది.
వాతావరణ మార్పులూ మనుషులు చేస్తున్న పనుల వల్ల పెరుగుతున్న కాలుష్యమూ అన్నీ కలిసి రుతుపవనాలను ప్రమాదకరంగా మార్చడానికి ఎంతో కాలం పట్టదనీ, దాంతో మొత్తంగా దక్షిణాసియా ముఖచిత్రమే మారిపోతుందనీ హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని రాబోయే మార్పులకు శాంపిల్‌గా వారు అభివర్ణిస్తున్నారు. ఆ భయంకర పరిణామాలు మనకి వద్దు అనుకుంటే అత్యవసరంగా చేయాల్సింది ఉడికిపోతున్న భూగోళాన్ని చల్లబరచడం. అది ఒక్కరి చేతిలో పని కాదు. అలాగని ఒక్కరైనా నిర్లక్ష్యం చేయతగిందీ కాదు. ప్రజలూ ప్రభుత్వాలూ చేయి కలిపి గ్లోబల్‌ వార్మింగ్‌కి అడ్డుకట్ట వేస్తే రుతుపవనాలు గాడిలో పడతాయి. వానొస్తోందంటే వణికే పరిస్థితి పోయి ఆరు వానలూ మూడు పంటలతో చల్లగా బతికే రోజులొస్తాయి..!

లెక్క ఇలా..!

ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందనో, సాధారణం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఉంటుందనో ఎలా చెబుతారంటే- ఒక ప్రాంతంలో అప్పటి వాతావరణమూ చుట్టూ ఉన్న భూమీ సముద్రాల ఉష్ణోగ్రతలను బట్టి ఆ సంవత్సరం వర్షపాతం ఎంత ఉండవచ్చో వాతావరణ నిపుణులు అంచనా వేస్తారు. అదే ప్రాంతంలో ఒక సీజన్‌లో 50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని(లాంగ్‌ పీరియడ్‌ ఏవరేజ్‌) లెక్కిస్తారు. ఈ ఏడాది కురుస్తుందనుకున్న వర్షపాతం ఈ సగటులో 96-104 శాతం మధ్య ఉంటే దాన్ని సాధారణ వర్షపాతం అంటారు. 90 కన్నా తక్కువుంటే వర్షాల్లేక కరవు వస్తుంది. 110 శాతం కన్నా ఎక్కువైతే వరదల వల్ల పంటనష్టం జరిగి మళ్లీ కరవు పరిస్థితులు తలెత్తవచ్చనీ నిపుణులు అంచనా వేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..