మనిషి ‘లోపలికి’ వెళ్లిరావచ్చు!

‘మీకు నచ్చిన పాట వింటున్నప్పుడు చెవిలో ఏం జరుగుతుంది... మన మెదడులో ఏమేం ఉంటాయి... గుండెను పట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది...’ ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే నెదర్లాండ్స్‌లోని కార్పస్‌ మ్యూజియానికి వెళ్లాల్సిందే. ‘జర్నీ త్రూ ద హ్యూమన్‌ బాడీ’ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనశాల భలేగా ఉంటుంది.

Published : 04 May 2024 23:48 IST

‘మీకు నచ్చిన పాట వింటున్నప్పుడు చెవిలో ఏం జరుగుతుంది... మన మెదడులో ఏమేం ఉంటాయి... గుండెను పట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది...’ ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే నెదర్లాండ్స్‌లోని కార్పస్‌ మ్యూజియానికి వెళ్లాల్సిందే. ‘జర్నీ త్రూ ద హ్యూమన్‌ బాడీ’ థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనశాల భలేగా ఉంటుంది. మోకాల్లాంటి ద్వారం నుంచి ఎస్కలేటర్‌ ద్వారా లోపలికి ప్రయాణం మొదలుపెడితే తల వరకూ అన్ని అవయవాల దగ్గరకూ వెళ్లిరావొచ్చు. సరదాగా పళ్లవరస పక్కన పోజులిస్తూ ఫొటోలూ దిగొచ్చు. మొత్తంగా రకరకాల భాషల్లో అవయవాల గురించి వింటూ, వాటిని తాకుతూ, చూస్తూ వెళ్లొచ్చన్నమాట. ఆడుతూపాడుతూనే మన శరీరంలోని ఒక్కో అవయవం గురించీ పూర్తిగా తెలుసుకునేలా ఉండే ఈ మ్యూజియంలో ‘5డీ హార్ట్‌ థియేటర్‌’ మరింత ప్రత్యేకం. దీంట్లో వర్చువల్‌ రియాలిటీతో గుండెలోపలి రక్తనాళాల్లోనూ తిరిగేయొచ్చు. లబ్‌డబ్‌ శబ్దాలు వింటూనే రక్తప్రసరణ తీరును కళ్లారా చూడొచ్చు. శరీరంలోని అవయవాల గురించి పుస్తకాల్లో చదువుకోవడం, బొమ్మల్లో చూడ్డం కన్నా నేరుగా వాటిలోపలికి వెళుతూ తెలుసుకుంటే మస్త్‌మజా ఉంటుందీ, విషయాలూ సులువుగా అర్థమవుతాయన్న వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం పిల్లలకు ఎంతగానో నచ్చేసిందంటే నచ్చదా మరి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..