కంచం... మంచం... సర్వం కనకం!

రాజుల కాలంలో- తినే కంచం దగ్గర్నుంచి పడుకునే మంచం వరకూ అన్నీ తళతళ మెరుపుల బంగారు వస్తువులే ఉండేవని వినుంటారు కదా. ఇప్పుడా రాజసాన్ని కళ్లారా చూస్తూ, అనుభవించొచ్చు కూడా.

Published : 12 May 2024 00:31 IST

రాజుల కాలంలో- తినే కంచం దగ్గర్నుంచి పడుకునే మంచం వరకూ అన్నీ తళతళ మెరుపుల బంగారు వస్తువులే ఉండేవని వినుంటారు కదా. ఇప్పుడా రాజసాన్ని కళ్లారా చూస్తూ, అనుభవించొచ్చు కూడా. వియత్నాంలోని ‘డాల్చే హనోయ్‌ గోల్డెన్‌ లేక్‌ హోటల్‌’కి వెళ్లారంటే తినే ఆహారం మొదలు కంటికి కనిపించే భవనం దాకా ప్రతిదీ బంగారు పూతతో కాంతులీనుతుంది. లోపలికి స్వాగతం పలికే ద్వారాలూ, గదులూ, పైకప్పూ, మెట్లూ, కుర్చీలూ, బల్లలూ, మంచాలూ... ఇలా అన్నీ బంగారు తాపడంతో చేసినవే. అంతేనా... స్నానాల గదులూ, ఈతకొలనూ కూడా పసిడి వన్నెలతో ఆకట్టుకుంటాయి. తినే ప్లేట్లే కాదు, అందులో ఉంచిన ఆహారమూ బంగారు రేకులతోనే నోరూరిస్తుంది. నాలుగువందల గదులతో, ఇరవై అయిదు అంతస్తుల్లో ఉండే ఈ హోటల్‌ని నాలుగేళ్లక్రితం ప్రారంభించారు. అంతా బంగారమంటే మాటలా... అందుకే దీని నిర్మాణానికి ఇంచుమించు 1668 కోట్ల రూపాయల ఖర్చయ్యింది. పూర్తవ్వడానికి దాదాపు 11 ఏళ్లు పట్టింది. ప్రపంచంలోని స్టార్‌ హోటళ్ల న్నింటిలోనూ ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతో కట్టిన ఈ గోల్డ్‌ ప్లేటెడ్‌ హోటల్‌కి ఎప్పటికప్పుడు ప్రత్యేక సొబగులు అద్దుతూ పర్యటకుల్ని ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. ‘అంతా బాగానే ఉంది కానీ, బాబోయ్‌ ఈ బంగారు హోటల్లో బస చేసేదెవరో’ అంటారా... ఒకపూటకు రూ.25 వేల ఖరీదు పెట్టే షరాబులెవరైనా ఉండి రావొచ్చండోయ్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు