ఊరంతా హాకీ ఆటగాళ్లే!

ఆ ఊరి పెళ్లిళ్లలో మిగతా సందడంతా ఎలా ఉన్నా హాకీ పోటీలు మాత్రం తప్పనిసరి... ప్రతి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా హాకీ కర్రలు కచ్చితంగా కనిపిస్తాయి... మూడేళ్ల పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ  అందరికీ హాకీ ఆడటం వచ్చు... అంతేకాదు, జాతీయ హాకీ ఆటగాళ్లనిచ్చిన ఊరిది... ఇన్ని గొప్పలున్నాయి కాబట్టే ఆ చిన్న పల్లెకి హాకీ విలేజ్‌గా పేరు... ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో ఒక చిన్న పల్లె సౌనమరా.

Updated : 14 Apr 2024 08:05 IST

ఆ ఊరి పెళ్లిళ్లలో మిగతా సందడంతా ఎలా ఉన్నా హాకీ పోటీలు మాత్రం తప్పనిసరి... ప్రతి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా హాకీ కర్రలు కచ్చితంగా కనిపిస్తాయి... మూడేళ్ల పిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ  అందరికీ హాకీ ఆడటం వచ్చు... అంతేకాదు, జాతీయ హాకీ ఆటగాళ్లనిచ్చిన ఊరిది... ఇన్ని గొప్పలున్నాయి కాబట్టే ఆ చిన్న పల్లెకి హాకీ విలేజ్‌గా పేరు...

 ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో ఒక చిన్న పల్లె సౌనమరా. ఆ ఊరి పేరు అందరికీ తెలియకపోవచ్చు కానీ హాకీ విలేజ్‌ అంటే మాత్రం ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంచుమించు రెండువేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇంటింటా హాకీ ఆటగాళ్లు ఉంటారు. అదేదో ఆటవిడుపు కోసం ఆడుకునే వాళ్లు మాత్రమే కాదండోయ్‌... వందల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి పద్మశ్రీ అవార్డు అందుకున్న భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌, ‘హాకీ ఇండియా’ ప్రెసిడెంట్‌ దిలీప్‌ టిర్కీ, జాతీయ హాకీ ప్లేయర్‌ అమిత్‌ రోహిదాస్‌, భారత మహిళా హాకీ జట్టులో మంచి పేరు తెచ్చుకున్న సుభద్రా ప్రధాన్‌... ఇలా జాతీయస్థాయి ఆటగాళ్లెందరో ఈ ఊరివాళ్లే.

ఎలా మొదలైంది..

ఒకప్పుడు ఇది మామూలు మారుమూల గిరిజన గ్రామమే. ఈ ఊరివాళ్లకి రెండు వందల ఏళ్లక్రితం బ్రిటిషర్లు తొలిసారి హాకీని పరిచయం చేశారు. ఇక్కడి ప్రజల శక్తిసామర్థ్యాలూ, చురుకుదనం గమనించి హాకీ ఆటలో శిక్షణ ఇవ్వడం ఆరంభించారు. ఆ తర్వాత ఇక్కడ స్కూళ్లను ఏర్పాటు చేసిన క్రిస్టియన్‌ మిషనరీలు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. అలా సరదాగా మొదలైన ఆట, అప్పటి నుంచీ ఈ ఊరిలో పూర్తిగా భాగమైపోయింది. దీన్నో వారసత్వంగా మార్చుకున్న ఊరి ప్రజలు పుట్టిన పిల్లలకు మూడేళ్ల వయసు రాగానే ఈ ఆటను నేర్పించడం మొదలుపెట్టారు. ఆడామగా అని తేడా లేకుండా ఊరి పిల్లలందరూ హాకీ ఆడేస్తారు. వెదురు కర్రల్నే హాకీ స్టిక్కుల్లా వాడేస్తున్నారు. సాయంత్రం బడి నుంచి రాగానే పిల్లలంతా హాకీ స్టిక్కులతో మైదానానికి బయలుదేరుతారు. ఏ ఊరి మైదానాల్లోనైనా చిన్నారులందరూ ఎక్కువగా క్రికెట్‌లాంటి ఆటలాడుతూ కనిపిస్తే... ఇక్కడ మాత్రం దుమ్మురేగే మట్టి నేలమీదే వందలాది పిల్లలు హాకీతో గడిపేస్తుంటారు. ఆట వీళ్లలో అంతలా భాగమైపోయింది కాబట్టే ఇక్కడ జరిగే వేడుకలన్నింటిలో కూడా హాకీ పోటీలూ ఉండాల్సిందే. అంతేనా... ఏటా పెద్ద పెద్ద టోర్నమెంట్లతో పాటు వారం వారం పోటీలూ పెట్టుకుంటారు.

సోలార్ తో అదనపు ఆదాయం ఎలా పొందాలో తెలుసా?

వాటిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ప్రేక్షకులూ వస్తుంటారట. ఆట జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తే ఎవరికైనా ఆదర్శంగా ఉండదా... అందుకే దిలీప్‌ టిర్కీని చూసి ఈతరం పిల్లలూ హాకీ అంటే ప్రాణం పెడుతున్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద మంచి ఉద్యోగాలూ రావడంతో ఆటనే జీవనంగా మార్చుకుంటున్నారు. వీళ్ల ఇష్టాన్నీ హాకీ ఆటగాళ్ల ఇబ్బందుల్నీ గమనించిన ఒడిశా ప్రభుత్వం ఈమధ్యనే విశాలమైన సింథటిక్‌ టర్ఫ్‌ని ఏర్పాటు చేసింది.

మనదేశానికి ఎక్కువమంది హాకీ ఆటగాళ్లను అందించిన ఈ ఊరి నుంచి అమిత్‌ రోహిదాస్‌ ఈ ఏడాది పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో సత్తా చాటబోతున్నాడు. భవిష్యత్తులో ఇంకెంతమంది గొప్ప ఆటగాళ్లను అందిస్తుందో సౌనమరా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..