మాటల మర్మం తెలిసింది!

మెదడు ఎప్పుడూ ఓ అంతులేని మాయా ప్రపంచం శాస్త్రవేత్తలకి. దాని రహస్యాన్ని పసిగట్టే దిశగా కొత్త ప్రయోగాలెన్నో చేస్తూనే ఉంటారు.

Published : 18 Feb 2024 00:08 IST

మెదడు ఎప్పుడూ ఓ అంతులేని మాయా ప్రపంచం శాస్త్రవేత్తలకి. దాని రహస్యాన్ని పసిగట్టే దిశగా కొత్త ప్రయోగాలెన్నో చేస్తూనే ఉంటారు. తాజాగా అందులో ఓ అపూర్వమైన ముందడుగు వేశారు అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌(ఎంజీహెచ్‌) పరిశోధకులు. మానవ మెదడులోకి ‘న్యూరోపిక్సల్స్‌’ ప్రోబ్స్‌ అనే అతి సూక్ష్మమైన రికార్డింగ్‌ పరికరాన్ని చొప్పించారు. ఇప్పటిదాకా ఏ పరికరానికీ సాధ్యం కాని రీతిలో మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్‌ల పనితీరునీ ఇవి రికార్డు చేశాయి. వాటి ద్వారా తాజాగా- మానవుల్లో మాటలకి కారణమైన ప్రి-ఫ్రంటల్‌ కార్టెక్స్‌ పనితీరుని చూసి అవాక్కయ్యారు శాస్త్రవేత్తలు. మీరు ‘నేను’ అనే పదం పలకాలనుకుందాం. అందులో ‘న్‌+ఏ+న్‌+ఉ’ అనే రీతిలో హల్లులూ, అచ్చులూ వరసగా ఉంటాయి కదా! ఆ ప్రతి హల్లుకీ అచ్చుకీ మన మెదడులో వేర్వేరు న్యూరాన్‌లు ఉన్నాయట. అవి ఆయా శబ్దాలని సృష్టించి, ఓ అర్థవంతమైన పదంగా మార్చడమే కాదు, ఆ పదం పలకడానికి అనుగుణంగా నోటిలోని ఏ భాగాలు కదలాలో కూడా ఆదేశాలు ఇచ్చేస్తున్నాయట. ఇంత పెద్ద పనిని అత్యంత వేగంగా- క్షణంలో మూడు పదాల వంతున చేయడమే ఓ అద్భుతమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ న్యూరాన్‌లని గుర్తించడం వల్ల- పక్షవాతం కారణంగానో, ప్రమాదాల వల్లో మాట కోల్పోయినవారికి అందించే చికిత్సలో విప్లవాత్మకమైన ముందడుగు పడుతుందని చెబుతున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..