వృద్ధుల కోసం దేశంలోనే తొలిసారి..!

వృద్ధాప్యం ‘రెండో బాల్యం’ అంటారు. కానీ ఓసారి చుట్టూ చూడండి... మీది ఏ నగరమైనా సరే పిల్లల కోసం వీధికో అధునాతన ఆసుపత్రి కనిపిస్తుంటుంది.

Published : 31 Mar 2024 00:18 IST

వృద్ధాప్యం ‘రెండో బాల్యం’ అంటారు. కానీ ఓసారి చుట్టూ చూడండి... మీది ఏ నగరమైనా సరే పిల్లల కోసం వీధికో అధునాతన ఆసుపత్రి కనిపిస్తుంటుంది. మరి రెండో బాల్యంలో ఉన్న వృద్ధుల మాటేమిటి?! వాళ్ళకోసమే దేశంలోనే తొలిసారి అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిని ఇటీవల చెన్నైలో ప్రారంభించారు. రూ.151 కోట్ల ఖర్చుతో అత్యాధునిక వసతులూ, ప్రత్యేక ఏర్పాట్లతో నిర్మించిన ఈ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంతాలకతీతంగా వృద్ధులందరికీ ఉచిత సేవలందిస్తామంటోంది. ‘ధర్మాసుపత్రి’ అన్న పదానికి అసలైన భాష్యం చెబుతోంది!

వెంకమ్మది చిత్తూరు. కిడ్నీల సమస్య ముదిరి కాళ్ళు కదపలేని పరిస్థితుల్లో వాళ్ళబ్బాయి ఆమెని చెన్నై రాజీవ్‌గాంధీ జనరల్‌ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తెచ్చాక ఏమనుకున్నాడో ‘ఇప్పుడే వస్తానమ్మా’ అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రానేలేదు. వెంకమ్మకి చెన్నైలో ఎవరూ లేరు - అక్కడి భాషా రాదు. రోజంతా ఎదురు చూసినా కొడుకు రాకపోవడంతో ఒంటరిగా ఏడుస్తూ కూర్చుందామె. వెంకమ్మ దైన్యం చూసిన అక్కడి సిబ్బంది ఆమెని- ఆ నగరంలో కొత్తగా ఏర్పాటైన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’(నియా)కి తరలించారు. అక్కడ- పేరు తప్ప మరే వివరాలూ అడగకుండానే ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. పదిరోజులపాటు చికిత్స అందించారు- కంటికి రెప్పలా కాపాడారు. ఆమె మనోవేదన బాపడానికి మానసిక చికిత్సా అందించారు. వెంకమ్మ కాస్త కుదుటపడ్డాక- వైద్యులు పోలీసుల ద్వారా చిత్తూరులో వాళ్ళబ్బాయి అడ్రెస్‌ని కనుక్కున్నారు. ఆసుపత్రి సిబ్బందీ పోలీసులూ కలిసి స్వస్థలానికి తీసుకెళ్ళారు. వాళ్ళబ్బాయిని గట్టిగా మందలించి మరీ ఆమెని అప్పగించి వచ్చారు! సాధారణంగా ఏ ప్రభుత్వాసుపత్రయినా చికిత్స తర్వాత రోగి సాదకబాధకాలతో తనకు సంబంధం లేదని భావిస్తుంది. కానీ ‘నియా’లో అలాకాదు- వాళ్ళ బాగోగుల్ని పూర్తిగా పట్టించుకుంటున్నారు. రోడ్డుపైన అనాథలుగా ఉన్న వృద్ధుల్నీ ఎవరైనా తీసుకొస్తే చేర్చుకుంటున్నారు. చికిత్స తర్వాత ‘హెల్పేజ్‌ ఇండియా’ సాయంతో వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు!  

అన్ని శస్త్రచికిత్సలూ...

చెన్నై గిండీ ప్రాంతంలో కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంగణాన ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ సరికొత్త వృద్ధుల ఆసుపత్రి ‘నియా’ని ఏర్పాటుచేశారు. ఐదు అంతస్తులున్న ఆసుపత్రిలో మామూలు ప్రభుత్వ దవాఖానాల్లోని గందరగోళమేదీ కనిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే వృద్ధుల్ని పలకరించేందుకు ప్రత్యేక రిసెప్షన్‌ కనిపిస్తుంది. నిర్ణీత వేళలని లేకుండా పగటిపూట ఎప్పుడైనా సరే ఓపీ సేవల్ని అందిస్తున్నారు. అవసరాన్నిబట్టి ఇన్‌పేషెంట్స్‌గా తీసుకుంటారు. వాళ్ళ కోసం 200 పడకలున్నాయి. అదనంగా రూ.900 రోజువారి ఫీజుతో పెయిడ్‌ ఏసీ గదుల్నీ పొందొచ్చు. తమిళనాడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి వైద్య బీమా ఉన్నవాళ్ళకి వీటిని ఇస్తున్నారు. బీమాలేనివారికి వాటిని అప్పటికప్పుడు అందించేందుకూ ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈఎన్‌టీ, దంత, నేత్ర వైద్యాలూ, హృద్రోగమూ, మెదడు సంబంధిత సమస్యలూ, కీళ్ళ ఇబ్బందులూ, కిడ్నీ వ్యాధులూ... ఇలా దాదాపు అన్ని వ్యాధులకీ ఉచిత చికిత్స అందిస్తున్నారు. అత్యవసర చికిత్సా విభాగంతోపాటూ జనరల్‌ సర్జరీ, ఐ సర్జరీ, యూరాలజీ, ఆర్థో సర్జరీలకంటూ ఐదు ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాలు పనిచేస్తు న్నాయి. రోగులు ఉచిత ఫిజియోథెరపీ, డయాలసిస్‌ల కేంద్రాలనూ ఉపయోగించు కోవచ్చు. ఇన్‌ పేషెంట్‌లుగా చేరిన వృద్ధులందరికీ- అసలు చికిత్సతోపాటూ మానసిక వైద్యులతోనూ కౌన్సెలింగ్‌ తప్పనిసరిగా ఇప్పిస్తున్నారు. వృద్ధాప్యం అన్నది జీవిత చరమదశ కాదనీ- అది కూడా ఆనందించదగ్గ ఓ ప్రాయమేననీ చెప్పిస్తున్నారు. రోగుల కోసం ప్రత్యేక గ్రంథాలయమూ ఉందిక్కడ. యోగా కేంద్రం, ధ్యానమంటపాలూ పనిచేస్తున్నాయి. సాయంవేళ సేదదీరేందుకు కారమ్స్‌, చెస్‌, వామనగుంటల్లాంటివాటితో కూడిన రిక్రియేషన్‌ గదినీ ఏర్పాటుచేశారు!  

45 ఏళ్ళ కల ఇది!

చెన్నైలో ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’(నియా)ని ఏర్పాటుచేయడం వెనక ఓ వైద్యుడి 45 ఏళ్ళ కల ఉంది. ఈ నగరానికి చెందిన డాక్టర్‌ వీఎస్‌ నటరాజన్‌ తొలిసారి  వృద్ధాప్య వైద్యం(జీరియాట్రిక్స్‌)పైన లండన్‌లో స్పెషలైజేషన్‌ చేశారు. 1978లో చెన్నై జనరల్‌ ఆసుపత్రి(జీహెచ్‌)లో దేశంలోనే తొలిసారి వృద్ధుల కోసం ప్రత్యేక ‘ఓపీ’ని ప్రారంభించి, ఆ తర్వాత ఇన్‌పేషెంట్స్‌నీ చేర్చుకోసాగారు. ‘భారత జీరియాట్రిక్స్‌ పితామహుడి’గా ప్రసిద్ధిచెందారు. 1994లో ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకి ప్రతిపా దించారు. 2015కికానీ దానిపైన ప్రభుత్వాల్లో చలనం రాలేదు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే, కేంద్రం భవన నిర్మాణాన్ని చేపట్టి వసతులు కల్పించింది. వైద్య సిబ్బంది నియామకం, నిర్వహణ బాధ్యతలని తమిళనాడే తీసుకుంది. నిర్వహణ ఆ రాష్ట్రానిది అయితేనేం- ప్రాంతాలకతీతంగా ఎవరొచ్చినా వైద్య సేవలు అందిస్తామంటోంది!

గొల్లపల్లి గోపి, న్యూస్‌టుడే, టి.నగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు