నీటి యోధులు!

వేసవి వచ్చిందంటే చాలు సాగు సంగతి పక్కన పెట్టి తాగు నీటికీ నోచుకోని పల్లెలెన్నో మనదేశంలో ఉన్నాయి. అలాంటిది కొన్ని గ్రామాలు నీటికేమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా పంటలు పండించుకుంటూ ఉన్నాయంటే వాటి వెనకాల ‘వాటర్‌ వారియర్స్‌’ ఎవరో ఉన్నారని అర్థం.

Updated : 14 Apr 2024 08:01 IST

వేసవి వచ్చిందంటే చాలు సాగు సంగతి పక్కన పెట్టి తాగు నీటికీ నోచుకోని పల్లెలెన్నో మనదేశంలో ఉన్నాయి. అలాంటిది కొన్ని గ్రామాలు నీటికేమాత్రం ఇబ్బంది పడకుండా చక్కగా పంటలు పండించుకుంటూ ఉన్నాయంటే వాటి వెనకాల ‘వాటర్‌ వారియర్స్‌’ ఎవరో ఉన్నారని అర్థం.


118 చెరువుల్ని బాగుచేశాడు!

డాక్టర్‌ నిమల్‌ రాఘవన్‌ దుబాయ్‌లో మంచి ఉద్యోగం చేస్తూ 2018లో చూసిపోదామని తమిళనాడులోని తంజావూరు దగ్గరున్న సొంతూరికి వచ్చాడు. కావేరీ డెల్టాలోని ఆ ప్రాంతాన్ని అంతకు కొద్దిరోజుల ముందే ‘గజ’ తుపాను అతలా కుతలం చేసింది. 45 మంది చనిపోయారు. 90 గ్రామాల్లో లక్ష ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఇల్లు లేదు, మళ్లీ వచ్చేసరికి ఊరి ఆనవాళ్లే ఉండవేమో అనుకున్న 35 ఏళ్ల నిమల్‌కి ఊరిని అలా వదిలి వెళ్లాలనిపించలేదు. అందుకే తోటివారినందరినీ కలుపుకుంటూ సోషల్‌మీడియాలో ఒక గ్రూపును తయారుచేశాడు. ఎవరే సాయం చేయగలిగితే అది చేయమని పిలుపిచ్చాడు. దానికి మంచి స్పందన వచ్చింది. ముందుగా శ్రమదానంతో తమ ఊరి పక్కనున్న పెద్ద చెరువులో పూడిక తీశారు. దాంతో ఆరువేల ఎకరాలకు నీటి వసతి ఏర్పడింది. అది చూసి చుట్టుపక్కల గ్రామాల వారంతా అతనితో చేయి కలిపారు. విరాళాలతో తుపాను బాధితులకు పునరావాస చర్యలు చేపట్టారు. తుపాను వల్ల చెట్లన్నీ కూలిపోవడంతో ఒక ఉద్యమంలా మొక్కలు నాటారు. నిమల్‌ సైన్యం సేవలు ఒక ఊరికే పరిమితం కాలేదు. ప్రభుత్వం నుంచి ఇసుమంత సాయం తీసుకోకుండా 32లక్షల రూపాయలు వెచ్చించి కావేరీ డెల్టాలోని మొత్తం 118 చెరువుల్ని బాగుచేసి రైతులెవరూ ఊరు వదలకుండా ఆపాడు. ఇప్పుడు నిమల్‌ అంటే ఆ ప్రాంతంలో తెలియని వారుండరు. సొంతంగా ‘మెగా ఫౌండేషన్‌’ పెట్టి, పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమిళనాడు, మహారాష్ట్రల్లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్న నిమల్‌ని అక్కడివారు ‘వాటర్‌ వారియర్‌’ అని పిలుచుకుంటారు.

సోలార్ తో అదనపు ఆదాయం ఎలా పొందాలో తెలుసా?


బోరుబావుల్ని ఎండిపోనివ్వడు!

ర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన దేవరాజారెడ్డి వృత్తిరీత్యా నీటి ఆనుపానులు తెలిసిన హైడ్రాలజిస్టు. చిత్రదుర్గ వర్షాభావ ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు అంతకంతకీ అడుగంటడాన్నీ, రైతులు ఒక బోరు ఎండిపోగానే మరింత లోతుగా మరో బోరు వేస్తూ పోవడంతో పొలాల్లో లెక్కలేనన్ని బోర్లు వృథాగా ఉండడాన్నీ చూసి ఆ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. ఉద్యోగం చేస్తే తన సేవలు కొంతమందికే అందుతాయనుకున్న అతడు నీటి సంరక్షణ కన్సల్టెంటుగా మారాడు. వాననీటిని ఒడిసి పట్టడం ద్వారా బోరుబావులు ఎండిపోకుండా చూడవచ్చనీ కొత్త బోరు వేయాల్సిన పని ఉండదనీ చెబుతూ రైతుల్ని చైతన్యపరుస్తున్నాడు. ఇంకుడు గుంతలతో వాన నీరు భూమిలోకి ఇంకేలా చేసినట్లే బోరు బావుల చుట్టూ కూడా ఇంకుడు గుంతల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో శిక్షణ ఇస్తున్నాడు. అందుకోసం తానే ఒక పద్ధతిని రూపొందించాడు. రైతు పొలంలో బోరుబావి ఉన్న చోటుకు తగ్గట్టుగా ఎక్కువ వాననీటిని దాని లోపలికి పంపించేందుకు ఎలా ఇంకుడు గుంతను తవ్వాలో చెప్పి దగ్గరుండి తవ్విస్తాడు. వాటిని రాళ్లూ ఇసుకా మట్టిలాంటి వాటితో పొరలు పొరలుగా పూడ్చడం వల్ల కలిగే లాభాలను శాస్త్రీయంగా వివరిస్తాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో సేవలు అందిస్తున్న దేవరాజారెడ్డి వందలాది గ్రామాల్లో బోరుబావుల్ని ఎండిపోకుండా కాపాడాడు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కూడా ఆయన ఈ మెలకువలన్నీ నేర్పుతూ భూగర్భజలాల పరిరక్షణకు తన వంతు సేవలందిస్తున్నాడు.


బీడునేలలో నీటి చెలమలు!

వనీ మోహన్‌సింగ్‌... ఈ పేరు చెప్పగానే బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని 1550 గ్రామాల ప్రజలు- ‘మా పాలిట దేవుడు’ అంటారు. ఆయనే పూనుకోకపోతే నిజంగానే ఆ ప్రాంతం ఇప్పటికి ఓ ఎడారిగా మారి ఉండేది. వర్షాధార వ్యవసాయం చేసే ఆ ప్రాంతంలో కొన్నేళ్లుగా వానలు బాగా తగ్గిపోయాయి. దాంతో రైతులంతా పొట్ట చేతబట్టుకుని కూలీలుగా వలసపోవడం మొదలెట్టారు. వారిని ఆదుకోవడం కోసం ‘హరితిక’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాడు అవనీ మోహన్‌సింగ్‌. జువాలజీ చదివిన మోహన్‌సింగ్‌ని పర్యావరణ విద్య ఆకట్టుకుంది. దాంతో అందులో ప్రత్యేక కోర్సుచేసి పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుండగా బుందేల్‌ఖండ్‌ అతడి దృష్టిలో పడింది. అక్కడ నీరు ఒక్కటి ఉంటే సమస్యలన్నీ సర్దుకుంటాయని భావించిన అతడు కార్పొరేట్‌ సంస్థల్ని ఒప్పించి, వారి సీఎస్‌ఆర్‌ నిధులతో చెక్‌ డ్యాములూ, వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులూ నిర్మించడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏకంగా 80 బిలియన్‌ లీటర్లను నిల్వచేసే సామర్థ్యం వాటి సొంతం. దాంతో భూగర్భజలాల స్థాయి 5 మీటర్ల వరకూ పెరిగింది. 300 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఏర్పాటూ చేశాడు. ఒకనాటి బీడుభూమి ఇప్పుడు పండ్లతోటలతో అలరారుతోంది. ఈ పనులన్నిటి వల్లా దాదాపు 500 గ్రామాల్లోని ఏడు లక్షల మంది ప్రజల జీవితప్రమాణాలు మెరుగయ్యాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..