అమ్మే మాకు ఆదర్శం!

ఒంటరిగా పిల్లల్ని పెంచే క్రమంలో ఆడవాళ్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ బిడ్డల కోసం అవన్నీ మౌనంగా భరించి వాళ్లను ప్రయోజకుల్ని చేస్తుంటారు కొందరు మాతృమూర్తులు.

Updated : 12 May 2024 08:45 IST

ఒంటరిగా పిల్లల్ని పెంచే క్రమంలో ఆడవాళ్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ బిడ్డల కోసం అవన్నీ మౌనంగా భరించి వాళ్లను ప్రయోజకుల్ని చేస్తుంటారు కొందరు మాతృమూర్తులు. ‘మా అమ్మ కూడా మమ్మల్ని అలానే పెంచింది’ అంటున్న ఈ తారలు... తమ తల్లి గురించి ఏం చెప్పారంటే...


అయినా  నెగ్గింది

- వరలక్ష్మి

మా అమ్మ పేరు ఛాయ. నా చిన్నతనంలోనే అమ్మానాన్నలు విడిపోవడంతో నన్నూ, చెల్లినీ తీసుకుని అమ్మ బయటకు వచ్చేసింది.  మాకు మంచి భవిష్యత్తును ఇవ్వాలన్న ఆశతో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను ప్రారంభించింది. పురుషాధిపత్యం ఎక్కువగా ఉన్న ఆ రంగంలో అమ్మ నెగ్గలేదని చాలామంది వెనక్కి లాగబోయారు. పైగా మగవాళ్లతో పనులు చేయించడం ఎంతో సవాలుగా ఉండేది. అయినా అమ్మ మమ్మల్ని చూసుకుంటూనే వ్యాపార బాధ్యతల్నీ సమర్థంగా నిర్వహించేది. ఆడదాని దగ్గర పని ఎందుకు చేయాలీ అన్న వాళ్ల చేత ‘చేస్తే ఛాయా మేడమ్‌ దగ్గరే పని చేయాలి’ అనిపించుకుంది. పని విషయంలో ఆడా మగా తేడా ఉండదని అమ్మని చూసే అర్థం చేసుకున్నా.

అమ్మకు ప్రేమతో..!

నాకోసం... అలానే ఉంది

- అదితీరావ్‌

నాకు ఊహ తెలిసేసరికే అమ్మానాన్నలు విడిపోయారు. ఆ తరవాత నన్ను తీసుకుని దిల్లీ వెళ్లిపోయి- అక్కడి వ్యాపారాలు చూసుకునేది అమ్మ. నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నారుకానీ అమ్మ నాకోసం ఒంటరిగా ఉండిపోయింది. సింగిల్‌ పేరెంట్‌ అని నేను ఎక్కడా బాధపడకుండా అన్నీ అమర్చేది. ఆడవాళ్లు ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పేది. అమ్మకి చదువంటే చాలా ఇష్టం. చదువుతోపాటు అదనంగా కళలూ తెలిసుండాలని నాలుగేళ్ల వయసులోనే డాన్స్‌ స్కూల్లో చేర్పించింది. ఎమ్మే సోషియాలజీ చేశాక సినిమాల్లోకి వచ్చా. కానీ ఏడాదిపాటు ఒంటరిగా ముంబయిలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఒత్తిడితో కుంగిపోయా. కానీ అమ్మకి చెప్పుకోలేదు. కారణం.. ఒంటరి తల్లిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న అమ్మ ఏనాడూ నా ముందు బాధపడేది కాదు, నాకు చెప్పుకునేది కాదు. సంతోషాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని తన నుంచే నేర్చుకున్నా కాబట్టి హీరోయిన్‌గా సక్సెస్‌ అయ్యాకే నా బాధల్ని తనతో పంచుకున్నా.


ఇల్లిల్లూ తిరిగేది

- ఐశ్వర్యా రాజేశ్‌

తిమంచితనం అస్సలు మంచిదికాదనేది అమ్మానాన్నల్ని చూసే నేర్చుకున్నా. బాధలో ఉన్నవారికి ష్యూరిటీ ఉండి మరీ అప్పులు ఇప్పించేవారు. అనారోగ్య సమస్యతో నాన్న చనిపోయాక ఆ అప్పులన్నీ అమ్మమీదే పడటంతో- నన్నూ, ముగ్గురు అన్నయ్యల్నీ పెంచుతూ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరింది మా అమ్మ. ఎవరితోనూ మాట అనిపించుకోకూడదని ఉన్న ఫ్లాట్‌నీ అమ్మేసింది. ఇల్లిల్లూ తిరిగి పాలసీలు చేయించుకుంటూ... మమ్మల్ని మంచి స్కూళ్లలో చదివించింది. తిన్నా తినకపోయినా మాకు ఏ లోటులేకుండా చూసుకుంది. తీరా ఇద్దరన్నయ్యలూ ఉద్యోగాల్లో చేరతారు అనుకునేసరికి ప్రమాదంలో చనిపోయారు. అసలే కష్టాల్లో ఉన్న అమ్మని అన్నయ్యల మరణం మరింత కుంగదీసింది. అయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నేనూ అమ్మ నుంచి అదే నేర్చుకున్నా. వృత్తిపరంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా ముందు కెళ్లడం అలవర్చుకున్నా.


నాన్న పేరు తీసేశా

- సంయుక్త

నేను కడుపులో ఉన్నప్పుడే అమ్మానాన్నలకు విడాకులయ్యాయి. అప్పట్నుంచీ అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాం. స్కూల్లో పిల్లల్ని నాన్నలే ఇంటికి తీసుకెళుతుంటే నాకెంతో బాధేసేది. ‘నేనే నీకు నాన్నని కూడా..’ అంటూ అమ్మ శ్రీదేవి చెబుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. అది కావాలీ, ఇది కావాలీ అంటూ పేచీ పెట్టినా అన్నీ ఓర్చుకుంటూ నన్ను పెంచింది. మరోవైపు ‘అసలే ఆడపిల్ల నీకు, విడాకులు తీసుకుని తప్పు చేశావు...’ అనేవారు బంధువులు. ఆ మాటలకు అమ్మ బాధపడ్డా బయటకు వ్యక్తం చేసేది కాదు. నాకు ఊహ తెలిశాక విడిపోవడానికి కారణాలు చెప్పింది. అమ్మ తీసుకున్న నిర్ణయం సరైందని అర్థం చేసుకుని ఆ రోజు నుంచీ తనతో బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉంటున్నా. తన కష్టానికి విలువ ఉండాలనే ఉద్దేశంతో నా పేరు పక్కనున్న నాన్న ఇంటి పేరును తొలగించా.


నా వరకూ రానివ్వలా

- చిన్మయి శ్రీపాద

క్కడైనా తండ్రి తన పాత్రను మాత్రమే పోషించగలడు. అదే ఒంటరి మహిళలు తల్లిదండ్రులిద్దరి పాత్రలనూ సమర్థంగా పోషించి తన పిల్లలకు ఏ లోటూ లేకుండా పెంచగలుగుతారు. అందుకే నాకు మా అమ్మతోపాటు ఇతర మహిళలన్నా ఎంతో గౌరవం. నాన్న ఆదరణ లేకపోయినా నాకు ఏ లోటూ రానివ్వలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా తనని దాటి నా వరకూ వాటిని రానిచ్చేది కాదు. సెలవుల్లో స్నేహితులంతా అమ్మానాన్నలతో విహారయాత్రలకు వెళుతుంటే నేనుమాత్రం ఇంట్లోనే ఉండేదాన్ని. నన్నెక్కడికీ తీసుకెళ్లట్లేదని అడిగి అమ్మని బాధపెట్టేదాన్ని. సంగీతమంటే ఇష్టమని చెబితే సిలబస్‌ తక్కువున్న కాలేజీలో చేర్పించి నాకు అన్ని రకాలుగానూ వెసులుబాటు కల్పించింది. పైగా అమ్మ వద్ద డబ్బులున్నా లేకపోయినా పేదలకు సాయపడేది. అదే నాకూ నేర్పింది. తమిళనాడులోని మారుమూల ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు కళలు నేర్పించేది. అవసరంలో ఉన్నవాళ్లకి సాయపడటం తన వద్దే నేర్చుకున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..