అమ్మకు ప్రేమతో..!

‘అమ్మ...!’ సృష్టి మనకిచ్చిన గొప్ప కానుక, ఆమెకు ఏమిచ్చినా తక్కువే... అయినా ‘అమ్మలరోజు’ అనగానే చిరుకానుకతోనైనా అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పిద్దామని మనసు ఉవ్విళ్లూరుతుంది...

Updated : 12 May 2024 08:43 IST

‘అమ్మ...!’ సృష్టి మనకిచ్చిన గొప్ప కానుక, ఆమెకు ఏమిచ్చినా తక్కువే... అయినా ‘అమ్మలరోజు’ అనగానే చిరుకానుకతోనైనా అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పిద్దామని మనసు ఉవ్విళ్లూరుతుంది... కానీ ఏ కొత్త వస్తువు ఇచ్చినా ‘నాకెందుకు రా’ అనే అమ్మకు ఏమిస్తాం అంటారా? అమ్మ జ్ఞాపకాల్ని ఫ్రేముకట్టి అమ్మకే అందిస్తే...  అమ్మ ముచ్చటపడి కొనుక్కున్న ఆనాటి నగలకు మోడ్రన్‌ లుక్కు తెస్తే... అమ్మ చిన్ననాటి ఆటలకు అందమైన రూపం తెప్పిస్తే... అమ్మతో మనకున్న అనుబంధాన్ని అక్షరాల్లో చూపిస్తే... అదెలాగో చూడండైతే...

ల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అని ఊరికే అనలేదు. పాత అన్న ఆ మాటలోనే ఓ మధురజ్ఞాపకం దాగి ఉంది. అందుకే గడిచిన కాలపు స్మృతుల్ని గుర్తుకు చేసే ఫొటోల్ని చూసినా, ఆ వస్తువుల్ని తాకినా... ఏదో తెలియని ఆనందం. గిర్రున మళ్లీ బాల్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈసారి అమ్మతో ముడిపడిన అలనాటి ఆ గుర్తుల్నే ఈ మాతృ దినోత్సవం రోజున బహుమతులుగా అందిద్దాం. పదిలంగా దాచుకున్న అమ్మ ఫొటోలూ, చీరలూ, నగలకు కొత్త అందాలు అద్దేస్తూనే చిన్ననాటి ఆటల జ్ఞాపకాల్ని కానుకల మూటగా చేసిద్దాం. అందుకోసం మార్కెట్లో రకరకాల ఆన్‌లైన్‌ సైట్లూ, ఆప్‌లూ, దుకాణాలూ అందుబాటులో ఉన్నాయి!

అమ్మే మాకు ఆదర్శం!

పాతవే కొత్త కానుకలైతే!

అంతులేని అమ్మప్రేమకు చిరు గుర్తుగా మొదలైన ఈరోజున ‘హ్యాపీ మదర్స్‌ డే అమ్మా!’ అంటూ అమ్మకు ప్రేమగా ముద్దుపెడుతూనే... అమ్మమ్మ పొత్తిళ్లలో పసిపాపాయిగా ఉన్న అమ్మ చిన్ననాటి ఫొటోను రంగుల చిత్రంగా మార్చి ఫ్రేమ్‌ చేసి ఇచ్చారంటే... ఆ మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటూ అమ్మ ఎంతగానో మురిసిపోదూ. ‘అరె పూర్తిగా పాడైపోయిన ఫొటో ఇలా కొత్తగా ఎలా మారింది’ అంటూ ఆశ్చర్యంగా ఆరా తీయదూ. కేవలం నలుపు-తెలుపుల నుంచి రంగుల్లోకే కాదు, అసలు ఫొటో మొత్తంగా నలిగిపోయినా దాన్ని బాగుచేయొచ్చు. ఇంకా ఫొటోల్లో లేని వ్యక్తుల చిత్రాల్నీ జత చేసి కొత్త చిత్రంగా సృష్టించొచ్చు. ‘నిజంగానే వీళ్లంతా కలిసి ఫొటో దిగారా’ అన్నంత సహజంగా ఉంటాయా చిత్రాలన్నీ కూడా. ఓల్డ్‌ ఫొటో రెస్టొరేషన్‌ పేరుతో బోలెడన్ని వెబ్‌సైట్లూ, ఆప్‌లూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పాతకాలం నాటి ఏదైనా ఫొటోను అప్‌లోడ్‌ చేసి మనకు నచ్చినట్టు రంగుల్లో చేసుకోవచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌ మార్చుకోవచ్చు. కావాల్సినట్టు ఎడిట్‌ చేసుకుంటూ రీటచ్‌తో సరికొత్త చిత్రంగా తయారుచేసుకోవచ్చన్నమాట. అరుదైన గుర్తులుగా మిగిలిన ఆ ఫొటోల్నే చక్కని చిత్రాలుగా అమ్మకు అందిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది! ‘నా పెళ్లిలో పుట్టింటివాళ్లు చేయించిన కంటె ఇది. తర్వాత ఎన్ని రకాల నగలు కొన్నా నాకు ఇదంటేనే చాలా ఇష్టం’, ‘నేను మొదటిసారి కట్టుకున్న పట్టుచీరను సెంటిమెంట్‌గా ఫీలవుతా’ అంటూ అమ్మ తను పదిలంగా పెట్టుకున్న నగలూ, చీరల గురించి చెప్పడం వినే ఉంటారు. మరి అమ్మ మనసుకు దగ్గరైన ఆ వస్తువుల్నే సరికొత్తగా మార్చి బహుమతులుగా ఇస్తే భలే ఉంటుంది కదా. కొన్నేళ్లనాటి ఆ చీరల రంగు పూర్తిగా వెలిసిపోయినా, నగల మోడల్‌ ఎంత పాతదైనా సరే, జ్ఞాపకంగా పెట్టుకునేవాళ్లెందరో ఉంటారు. అలాంటి వాటికే హంగులు అద్దుతూ మళ్లీ కొత్తవాటిలా ధగధగ మెరిపించొచ్చు. పాత చీరల్నీ, నగల్నీ అలా రీడిజైన్‌ చేసివ్వడానికి రకరకాల సంస్థలొచ్చాయి. పాడైపోయినవాటిని బాగు చేస్తూనే కావాలంటే అదనపు మెరుపుల్నీ జోడిస్తున్నారు. అమ్మ అల్మారాలోనే ఉండిపోయిన పాత పట్టుచీరకో, నగకో ఈతరపు లుక్కు తెచ్చేశారంటే... అవి అల్మారా నుంచి అమ్మ ఒంటిమీదకూ చేరిపోతాయి. ఇప్పటి కొత్తరకం చీరలూ, ఆభరణాలకు బదులు ఇవే ముచ్చటైన కానుకలవుతాయి.

ఏ గ్రూపు రక్తమైనా... ఫర్వాలేదు!

ఎన్ని జ్ఞాపకాలో..

ఇప్పుడంటే లూడో, చదరంగం, క్యారమ్స్‌... అంటూ రకరకాల ఆటలు ఆడేస్తున్నాం కానీ అప్పట్లో ఆటలు వేరు. గచ్చకాయలు, వామన గుంటలు, అష్టాచెమ్మా, పచ్చీస్‌, వైకుంఠపాళీ... అంటూ ఎన్నో ఆటలుండేవి. చిన్న గులకరాళ్లనే గచ్చకాయల్లా, చింతగింజలతో వామన గుంటలూ, నేలపైన చాక్‌పీస్‌తో గీసుకుంటూ అష్టాచెమ్మాల్లాంటివి ఆడేవాళ్లు. అమ్మ చిన్నతనంలో ఆడుకున్న ఆ ఆటలకే చక్కటి రూపం ఇచ్చి తీపి గుర్తుల్ని జ్ఞాపకం చేయొచ్చు. అదెలా అంటే... అలనాటి ఆ ఆటలన్నీ కూడా బోర్డుగేముల్లా కొత్తగా వస్తున్నాయిప్పుడు. ఇత్తడి, చెక్క... లాంటి వాటితో ఎంతో అందంగా వస్తున్న ఈ ఆటల్ని కానుకగా ఇచ్చారంటే... కచ్చితంగా అమ్మ ముఖంలో నవ్వులు పూస్తాయి. సమయం దొరికినప్పుడు సరదాగా కాసేపు ఆ ఆటల గురించి తెలుసుకుని అమ్మతో కలిసి ఆడుకున్నారంటే... తన అనుభూతుల్ని నెమరేసుకుంటూ మనతో ఆనందాన్ని పంచుకుంటుంది.వీటితోపాటూ ప్రత్యేకంగా దొరుకుతున్న నోస్టాల్జిక్‌, రెట్రో గిఫ్టుల్ని ఇవ్వొచ్చు. ఎప్పటికప్పుడు ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టు పర్సనలైజ్డ్‌ థీములతో వస్తున్న కానుకల్లో భాగంగా వచ్చినవే ఈ పాతకాలపు గిఫ్ట్‌ హ్యాంపర్లు కూడా. 60ల్లో, 70ల్లో, 80ల్లో... అంటూ ఆయా సంవత్సరాల్లో పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకున్న బొమ్మలూ, తినుబండారాల్లాంటి వాటితో ఉంటాయీ బహుమతులు. పిప్పర్‌మెంట్‌ బిళ్లల దగ్గర్నుంచి టిక్‌టాక్‌ ఆటల వరకూ విడివిడిగా తీసుకుని సొంతంగా కానుకలా చేసి ఇవ్వొచ్చు, బాల్యంలోని తీపి గుర్తుల్ని మళ్లీ కళ్లముందు చూపొచ్చు. ఈ నోస్టాల్జిక్‌ గిఫ్ట్స్‌ను అందించడానికి ఆన్‌లైన్‌ సైట్లు చాలానే ఉన్నాయి. మనల్ని లాలిస్తూ పాడే జోలపాటల దగ్గర్నుంచి పనులు చేస్తూ తీసే రాగాల వరకూ అమ్మపాడిన తీయని పాటలెన్నో. సరదాగా ఆ పాటల్ని రికార్డు చేసి సర్‌ప్రైజ్‌ చేయొచ్చు. లేదంటే అమ్మకిష్టమైన పాటలూ, మెచ్చిన భక్తిగీతాలతో కారవాన్‌ రికార్డర్‌ బాక్సుల్ని ఇచ్చారంటే హాయిగా ఆ పాతమధురగీతాల్ని వింటూ మైమరచిపోతుంది. ఇలా చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసే కానుకలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అమ్మతో మనకున్న అనుబంధాన్ని చెప్పాలన్నా, ఆమె మనకోసం చేసిన త్యాగాల్ని వర్ణించాలన్నా, తను చూపిన ప్రేమానురాగాల్ని వివరించాలన్నా వేనవేల మాటలైనా సరిపోవు కానీ మనసులోని ఆ ప్రేమను చెబుతూ చిన్న కానుక చేసి ఇవ్వొచ్చు. ‘ఐ లవ్‌ మామీ దిస్‌ మచ్‌’ అంటూ మనకిష్టమైన పేరుతో అమ్మ అంటే ఎంత ఇష్టమో చెప్పే పుస్తకాన్ని ప్రచురించొచ్చు. అందుకోసం పర్సనలైజ్డ్‌ బుక్స్‌ ఆన్‌లైన్‌ సైట్లు ఉన్నాయి. మన మాటలూ, అమ్మ ఫొటోలూ ముద్రించి ఇచ్చే ఆ కానుక తప్పకుండా అమ్మకెంతో అపురూపం అవుతుంది. అమ్మ కాదనలేని ఈ జ్ఞాపకాల బహుమతులన్నింటిలో ఇంతకీ మీకేది నచ్చింది?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..