నాగుల చవితి

భారతీయ సంస్కృతిలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. హరప్పా కాలం నుంచే నాగదేవతను పూజిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నాగేంద్రుడు శివుడికి ఆభరణం, కేశవుడికి తల్పం. నాగపూజకు జైన, బౌద్ధ ధర్మాలు సైతం ప్రాముఖ్యమిచ్చాయి...

Published : 23 Oct 2017 09:54 IST

నాగుల చవితి

భారతీయ సంస్కృతిలో నాగారాధనకు సముచిత స్థానం ఉంది. హరప్పా కాలం నుంచే నాగదేవతను పూజిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. నాగేంద్రుడు శివుడికి ఆభరణం, కేశవుడికి తల్పం. నాగపూజకు జైన, బౌద్ధ ధర్మాలు సైతం ప్రాముఖ్యమిచ్చాయి. ధ్యానముద్రలో గల జినుడు, బుద్ధుల శీర్షాలపై ఫణీంద్రుడు పడగ విప్పి ఉన్న ప్రతిమలు అనేక చోట్ల లభించాయి. సర్పపూజ మొదట ఆర్య సంస్కృతికి చిహ్నంగా ఉండి, ఆ తరవాత వైదిక ముద్ర పొందిందని భావిస్తారు. ఇస్లాం మతంలోనూ ‘నాగూర్‌’ పేరిట నాగేంద్రుణ్ని గౌరవించడం మరో విశేషం.

తెలుగునేలను నాగభూమిగా వ్యవహరించేవారు. కృష్ణాతీరాన్ని పాలించిన రాజవంశీయులు నాగులు అని, వారు సర్పపూజ చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని కొందరు చెబుతారు. నాగులు మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది. నాగ శబ్దంతో మొదలయ్యే వ్యక్తి నామాలు; నాగవరం, నాగులపాడు, నాగులేరు వంటి స్థల, నదీనామాలు- తెలుగువారికి నాగజాతితో గల సంబంధాన్ని చాటుతున్నాయి.

శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా, కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా పరిగణిస్తారు. ‘భవిష్య పురాణం’ నాగదష్ట వ్రతాన్ని ప్రస్తావించింది. స్కంద పురాణం- కార్తిక శుద్ధ చవితినాటి నాగపూజను ‘శాంతి వ్రతం’గా వర్ణించింది. మత్స్యపురాణం నాగప్రతిమల లక్షణాన్ని వివరించింది.

నాగులచవితినాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి నువ్వులు, బెల్లంతో చిమ్మిలి, బియ్యం నానబెడతారు. వాటిని పిండి చేసి బెల్లం, కొబ్బరి వేసి చలిమిడి చేస్తారు. నాగేంద్రుడి పుట్ట వద్దకు వెళ్లి పసుపు, కుంకుమ, పువ్వులతో పూజచేస్తారు. పుట్టలో పాలుపోసి చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్లు నైవేద్యంగా అర్పిస్తారు. నాగరాజుకు దీపం పెట్టరు. అక్కడ వేడి వస్తువులు పనికిరావు. కొందరు ఈ చవితినాడు ఉపవాసం ఉంటారు.

కార్తిక శుద్ధ చవితి విష్ణుమూర్తి నిద్ర నుంచి లేస్తాడని భావించే ఉత్థాన ఏకాదశికి సమీపంలో ఉంది. అందువల్ల ఆ రోజు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి గోచరిస్తుందంటారు. యోగశాస్త్రంలోనూ సర్పానికి విశేష స్థానం కనిపిస్తుంది. కుండలినీ శక్తి- మూలాధారం నుంచి బయలుదేరి వెన్నుపాము ద్వారా సహస్రార కమలం చేరుతుందని, అది జీవుడికి ఆనందప్రాప్తి కలిగిస్తుందని ఆ శాస్త్రం తెలియజేస్తుంది.

సర్పాలు భూమిలో గల నిధినిక్షేపాలకు రక్షణ కల్పిస్తాయంటారు. నాగదేవతను వర్షదేవతగా భావించేవారూ ఉన్నారు. సర్పాన్ని ఈజిప్టులో సస్యదేవతకు ఓ ప్రతీకగా విశ్వసిస్తారు. ఆ దేవత తల సర్పం శిరస్సులా ఉంటుంది. పర్షియన్లు ఇంద్రధనుస్సును సర్ప దేవతగా పరిగణిస్తారు. ప్రాచీన యూదులు, అరబ్బులు పాముల్ని అధిష్ఠాన దేవతలుగా భావించేవారు. గ్రీసులో ఓ దైవానికి సర్పమే అలంకారం. నాగపూజలు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జనవ్యవహారంలో ఉంటూ వచ్చాయి. ఆ ఆరాధన ప్రకృతి పూజలో ఒక భాగం. జనమేజయుడి సర్పయాగ సందర్భం, హర్షుడి ‘నాగానంద’ నాటకం కూడా నాగారాధన ప్రశస్తిని విశదీకరించేవే!

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని