Ayyappa: ఇదీ పంబావాసుని 18 మెట్ల ప్రత్యే‘కథ’

Eenadu icon
By Features Desk Updated : 30 Oct 2025 04:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తికమాసంలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేస్తారు. 41 రోజులు కఠిన నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇరుముడితో సన్నిధానంలోని పద్దెనిమిది మెట్లెక్కి మణికంఠుణ్ణి దర్శించుకుని దీక్షను పూర్తి చేస్తారు. ఆ 18 మెట్ల విశిష్టత ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం... 

బరిగిరి అయ్యప్పస్వామి ఆలయాన్ని సన్నిధానం అని, ఇక్కడి మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ సోపానాలే కైవల్య పథమని భక్తుల విశ్వాసం. ఈ మెట్లను పరశురాముడు నిర్మింపచేశాడంటారు.. పద్దెనిమిది మెట్లే ఎందుకన్న ప్రశ్న మనలో కలగడం సహజమే. పౌరాణిక కథను అనుసరించి... ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతున్న మహిషిని సంహరించేందుకు అవతరించాడు మణికంఠుడు. ఆ రక్కసిని వధించిన అనంతరం తనను పెంచిన తండ్రి పందళం రాజుకు తాను శబరిగిరిపై కొలువు తీరనున్నట్లు తెలియజేశాడు. ఆ స్వామి ఉన్నత స్థానంలో ఆశీనుడు అయ్యేందుకు వీలుగా చతుర్వేదాలు, ఆరుశాస్త్రాలు, అష్ట దిక్పాలకులు పద్దెనిమిది మెట్లుగా అమరాయి. అయ్యప్ప వాటి మీద తన పాదాలను మోపాడు. పట్టబంధాసనంలో కూర్చుని యోగముద్రతో దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్థానమయ్యాడు.  

మెట్టుకో అధిష్ఠాన దేవత

మండలం రోజులు దీక్షచేసి ఇరుముడితో వచ్చిన భక్తులు ‘పదునెట్టాంబడి’ మెట్ల మీదుగా సన్నిధానం చేరుకుంటారు. ఈ మెట్లలో వీరమణికంఠుడు తన అస్త్రశక్తిని నిక్షిప్తం చేశాడని చెబుతారు. ఈ పరమపవిత్ర మెట్లకు- 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్య 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.కృష్ణ పింగళ 8.బేతాళ 9.నాగరాజ 10.కర్ణ 11.వైశాఖ 12.పుళిందిని 13.రేణుకాపరమేశ్వరి 14.స్వప్న వారాహి 15.ప్రత్యంగిర 16.నాగయక్షిణి 17.మహిషాసురమర్దిని 18.అన్నపూర్ణేశ్వరి మాతలు అధిష్ఠాన దేవతలు. ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లున్నాయి. అవి- 1.అణిమ 2.లఘిమ 3.మహిమ 4.ప్రాప్తి 5.ప్రాకామ్య 6.వశిత్వ 7.ఈశత్వ  8.ఇచ్ఛ 9.బుద్ధి 10.సర్వకామ 11.సర్వసంపత్కర 12.సర్వ ప్రియంకర 13.సర్వమంగళకర 14.సర్వదుఃఖవిమోచన 15.సర్వ మృత్యుప్రశమన 16.సర్వవిఘ్న నివారణ 17.సర్వాంగసుందర 18.సర్వసౌభాగ్యదాయక. 

సన్మార్గానికి సోపానాలు

ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద ఒక్కో దుర్గుణాన్ని వదిలేయాలన్నదే అయ్యప్ప దీక్ష ముఖ్య ఉద్దేశం- అని స్థలపురాణం తెలియజేస్తోంది. ఇది సాధన, క్రమశిక్షణలతోనే సాధ్యం. అందుకు తగినట్టుగా మాలధారణ నియమాలు ఉన్నాయి. సద్గుణాలను అలవరచుకోవాలనే లక్ష్యంతోనే భక్తులు పలుమార్లు శబరిగిరి యాత్ర చేస్తారు. మొదటి ఆరు మెట్లు అరిషడ్వర్గాలను వదిలేయాలని సూచిస్తాయి. 7, 8, 9 మెట్లు త్రికరణశుద్ధిని పొందమని.. 10, 11, 12, 13, 14 మెట్లు ఇంద్రియనిగ్రహం అలవరచుకోమని తెలియజెబుతాయి. 15, 16, 17 సత్వ, రజో, తమో గుణాలను త్యజించమని చెబితే.. 18వ మెట్టు అజ్ఞానాన్ని విడనాడాలనే సంకేతాన్నిస్తుంది.

ఇరుముడితోనే ప్రవేశం...

దీక్షధారులు ఇరుముడితో మాత్రమే 18 సోపానాలను అధిరోహించాలనేది నియమం. స్వామి దర్శనం చేసుకునేందుకు ఉత్తరాన ఉన్న మెట్లమీదుగా వెళ్లాలి. పడి పూజ చేసే ఆలయ అర్చకులకు మాత్రమే ఇరుముడి లేకుండా పడిని ఎక్కే అర్హత ఉంటుంది. వీరు ఇందుకోసం సుమారు ఒక సంవత్సర కాలం దీక్ష చేసి వస్తారు.      

జలకం మనోజ్‌బాబు, ఈజేఎస్‌ 


Published : 30 Oct 2025 02:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని