Womens Team India: వన్డే ప్రపంచ కప్‌ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా

Eenadu icon
By Sports News Team Published : 03 Nov 2025 08:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్‌ఇండియా రూ.39 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ సేన ఛాంపియన్‌గా అవతరించింది. మిథాలీరాజ్‌ నాయకత్వంలో రెండుసార్లు ఫైనల్‌కు వెళ్లినా ఓటమి తప్పలేదు. ఈసారి ఎలాంటి పొరపాటు లేకుండా సఫారీ జట్టును చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బీసీసీఐ కూడా జట్టుకు భారీ నజరానా ప్రకటించడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘బీసీసీఐ కార్యదర్శిగా జైషా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి (2019-24) భారత మహిళా క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ విషయంలోనూ ప్రత్యేకంగా నిలిచారు. పురుషుల జట్టు కంటే ఎక్కువ ప్రైజ్‌మనీని అందించారు. ఇప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నుంచి రూ.51 కోట్ల నజరానా ఇస్తున్నాం. దీన్ని ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అందజేస్తాం. 1983లో కపిల్‌దేవ్‌ నాయకత్వంలో టీమ్‌ఇండియా తొలిసారి ప్రపంచ కప్‌ను నెగ్గింది. అప్పటినుంచి దేశంలో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ దక్కింది. ఇప్పుడు అమ్మాయిలు కూడా అద్భుతం చేసి చూపించారు. భవిష్యత్తులో మరింతమంది మహిళలు ఆటను ఎంచుకోవడానికి ఇదొక పునాదిగా మారుతుంది’’ అని వెల్లడించారు. 

ఎంతో స్ఫూర్తిగా నిలిచారు: జైషా

‘‘తొలిసారి ప్రపంచ కప్‌ను నెగ్గిన భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు. ధైర్యసాహసాలు, సంకల్పం, నైపుణ్యాలు దేశానికి స్ఫూర్తి ఇచ్చినప్పటికీ.. బీసీసీఐ తీసుకున్న కీలక విధాన నిర్ణయాల పాత్రను మనం గుర్తించాలి. మహిళా క్రికెట్‌లోనూ పెరిగిన పెట్టుబడులు, పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు, కోచింగ్‌ సిబ్బంది పునర్నిర్మాణం.. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’’ అని ఐసీసీ ఛైర్మన్ జైషా పోస్టు పెట్టారు.

దేశం గర్వపడేలా చేశారు: నీతా అంబానీ

‘‘ఆదివారం రాత్రి మన అమ్మాయిలు తొలిసారి ప్రపంచకప్‌ నెగ్గారు. దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా చేశారు. మీరు ఆడిన తీరు భావితరాలకు స్ఫూర్తి. ఆత్మవిశ్వాసం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగిన ఆటతీరు అద్భుతం. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని రిలయన్స్‌ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని