Amol Muzumdar - Team India: మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్‌ మజుందార్‌

Eenadu icon
By Sports News Team Published : 03 Nov 2025 08:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రతి భారతీయుడూ గర్వపడేలా మహిళా జట్టు చేసిందని ప్రధాన కోచ్ అమోల్‌ మజుందార్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది మహిళా క్రికెట్‌కు సువర్ణాధ్యాయమని వ్యాఖ్యానించాడు. రెండేళ్ల కిందట భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములను చవిచూశామని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించాడు. 

‘‘ఇప్పుడేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. భారత మహిళా క్రికెట్ అద్భుతం చేసింది. ఇప్పుడు సాధించిన ప్రతిదానికీ వారు పూర్తి అర్హులు. కఠినమైన శ్రమ, నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన జట్టుకు అభినందనలు. కోచ్‌గా వచ్చిన తొలినాళ్లలో ఓటములు ఎదురయ్యాయి. కానీ, వాటి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. చాలా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కొన్ని మ్యాచుల్లో ఇంకాస్త మెరుగ్గా ఫినిష్‌ చేయాల్సింది. చేయలేకపోయాం. కానీ, ఇప్పుడు ముగింపు మాత్రం అద్భుతం’’ అని మజుందార్‌ వెల్లడించాడు.

ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌ సూపర్

‘‘జట్టులోని ప్రతిఒక్కరూ విజయం కోసం చివరివరకూ అద్భుతంగా పోరాడారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించారు. కీలక సమయంలో వికెట్లు తీసిన షెఫాలీ వర్మ స్పెల్‌ సూపర్. ఫీల్డింగ్‌ గురించి కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చించుకున్నాం. దాని ఫలితం ఈ ఫైనల్‌లో కనిపించింది. నేను ఇంతకంటే ఎక్కువేం అడగను. సెమీస్‌, ఫైనల్‌కు స్టేడియం మొత్తం నిండిపోవడం చాలా బాగుంది. ఫైనల్‌లో పరుగులు చేయడమే కాకుండా వికెట్లు కూడా తీసిన షెఫాలీ మాయ చేసిందనే చెప్పాలి’’ అని మజుందార్‌ వ్యాఖ్యానించాడు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతోపాటు రెండు కీలక వికెట్లు తీసింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని