కలిసి తిరిగితే కలదు చైతన్యం

ప్యాషన్‌.. సాహసం.. సరదా.. ఒకప్పటి బైకర్స్‌ క్లబ్‌ల మాట. సేవ.. చేయూత.. సోదరభావం ఇప్పటి బైకర్ల బాట. ఏ సంకల్పంతో మొదలైనా... అనుభవాలు పంచుకోవడం.. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం...అసిఫా హత్యాచారంలాంటి దారుణ ఘటనల్ని నిరసిస్తూ ర్యాలీలు తీయడం... ప్రస్తుత బైకర్స్‌ క్లబ్‌లు నడుస్తున్న తీరు. ఒక్కమాటలో చెప్పాలంటే బైకింగ్‌ అంటే రేసింగ్‌ కాదు.. బాధ్యత అంటున్నారు...

Published : 21 Apr 2018 01:51 IST

బైకర్స్‌ క్లబ్‌లు..సేవకు మార్గాలు

కలిసి తిరిగితే కలదు చైతన్యం

 ప్యాషన్‌.. సాహసం.. సరదా.. ఒకప్పటి బైకర్స్‌ క్లబ్‌ల మాట. సేవ.. చేయూత.. సోదరభావం ఇప్పటి బైకర్ల బాట. ఏ సంకల్పంతో మొదలైనా... అనుభవాలు పంచుకోవడం.. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం...అసిఫా హత్యాచారంలాంటి దారుణ ఘటనల్ని నిరసిస్తూ ర్యాలీలు తీయడం... ప్రస్తుత బైకర్స్‌ క్లబ్‌లు నడుస్తున్న తీరు. ఒక్కమాటలో చెప్పాలంటే బైకింగ్‌ అంటే రేసింగ్‌ కాదు.. బాధ్యత అంటున్నారు.

దేశంలో దాదాపు పదకొండు కోట్ల ద్విచక్ర వాహనాలున్నాయి. వీటిలో ఆటోమొబైల్‌ కంపెనీ, సీసీ, ఒకే వ్యక్తిత్వం ఉన్నవారు.. ఒక్కచోటికి చేరి బైకర్స్‌ క్లబ్‌లుగా ఏర్పడ్డారు. హార్లీ డేవిడ్‌సన్స్‌ ఓనర్స్‌ గ్రూప్‌ ‘హోగ్స్‌’ అనీ.. కేటీఎం ఓనర్స్‌ గ్రూప్‌ ‘కోజ్‌’ అనీ పేరు పెట్టేసుకున్నారు. కాలేజీ కుర్రాళ్లు, కార్పొరేట్‌ ఉద్యోగులతోపాటు అమ్మాయిలు సైతం ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో కబుర్లాడుకోవడం.. వాట్సాప్‌లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం.. మీటప్స్‌ వేదికగా కలుసుకోవడం.. ఆపై టూర్లు. ఇలాంటి బైకర్స్‌ గ్రూప్‌లు దేశవ్యాప్తంగా నాలుగువందలకుపైగా ఉన్నాయి. హైదరాబాద్‌లోనే వాటి సంఖ్య ముప్పైకిపైనే ఉంది. హైదరాబాద్‌ రాయల్స్‌, హైదరాబాద్‌ బైకర్స్‌, మోటో వింగ్స్‌, కేఓజీ హైదరాబాద్‌, బీబీసీ హైదరాబాద్‌, ఇండియన్‌ బుల్‌రైడర్స్‌ ఐరన్‌ హెడ్స్‌, రాయల్‌ మావెరిక్స్‌, హిందుస్థాన్‌ బైకర్స్‌.. వాటిలో కొన్ని. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలాంటి చిన్న నగరాల్లోనూ గ్రూప్‌లున్నాయి.
వారాంతం, నిర్ణీత సమయంలో ఈ బైకర్లంతా ఎక్కడో కలుసుకుంటారు. అనుభవాలు పంచుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఏదో ప్రాంతానికి దూసుకెళ్లడం, కొత్త రుచులు ఆస్వాదించడం, మంచి ప్రకృతి దృశ్యాలుంటే కెమెరాలతో క్లిక్‌మనిపించడం, టూర్‌ సక్సెస్‌ అయ్యిందంటూ ఖుషీగా తిరిగిరావడం.. ఇది గతం. ప్రస్తుతం పర్యటనకు వెళ్లిరావడమే కాదు.. ఆ యాత్రకు ఓ మంచి లక్ష్యాన్ని జోడించడం మొదలైంది. వోల్ఫ్‌ప్యాక్‌ ఇండియా అనే క్లబ్‌ అనాథ పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతో తొలిసారి ఓ ర్యాలీ తీసింది. మరో గ్రూప్‌ నిర్భయ ఘటనను నిరసిస్తూ పెద్ద యాత్ర చేసింది. ఇవి ఇతర క్లబ్‌లు అందిపుచ్చుకున్నాయి. రైడింగ్‌లో జాగ్రత్తలు చెప్పడం, అనాథలకు సాయం, మొక్కలు నాటడం, ఎయిడ్స్‌ డే ర్యాలీలు, చెరువులు శుభ్రం చేయడం, అవినీతి వ్యతిరేక ర్యాలీలు.. ఇలా ప్రతి యాత్రకు ఓ సంకల్పం జోడించి బైక్‌ల్ని పరుగులు పెట్టిస్తున్నారు సభ్యులు. ఇలాంటి కార్యక్రమాలకు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు స్పాన్సర్‌ చేస్తున్నాయి. హార్లీ డేవిడ్‌సన్‌, కవాసాకీ, ట్రయంఫ్‌, రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, హోండాలాంటి కంపెనీలు తమ కొత్త మోడల్‌ బైక్‌ మార్కెట్లోకి విడుదల చేస్తున్నపుడు పిలిచి మరీ పర్యటనలు చేయమని కోరుతున్నాయి.

జాగ్రత్తలూ ముఖ్యం

  సరదా, సేవ.. ఉద్దేశం ఏదైనా సభ్యుడు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలంటారు మోటోవింగ్స్‌ సహవ్యవస్థాపకుడు శ్రీధర్‌. ఎక్కువగా యువతే వీటిల్లో ఉంటుండడంతో ప్రతీ ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. 
* నూటాయాభై సీసీ దాటిన బైక్‌లతోనే పర్యటించాలి.
* ప్రతి గ్రూప్‌లో బైక్‌ని పూర్తిగా మరమ్మతులు చేయగలిగినవారుండాలి.
* పర్యటన మొదలవడానికి ముందే బండిని సర్వీస్‌ చేయించాలి. టూల్‌కిట్‌, అదనపు బ్యాటరీ అందుబాటులో ఉంచుకోవాలి.
* రైడింగ్‌లో ఉన్నపుడు ఒకర్నొకరు ఓవర్‌టేక్‌ చేయకూడదు. ఫొటోలు, సాహసాలు నిషిద్ధం. 
* హెల్మెట్‌, షూస్‌, మోకాలి ప్యాడ్స్‌, జాకెట్స్‌ తప్పనిసరి. 
* అగ్రెసివ్‌ రైడర్లకు చోటు లేదు. వారి రైడింగ్‌ తీరు, వ్యక్తిగత ప్రవర్తన ముందే పరీక్షిస్తారు.
* ఐదు, పదిమంది సభ్యులకు ఒకరు చొప్పున లీడర్లుంటారు. వీళ్లు ముందు, వెనక, మధ్యలో ఉంటారు. వీళ్ల ఆజ్ఞల్ని తప్పకుండా పాటించాల్సిందే.
* వెనక కూర్చొని ప్రయాణించేవారైనా శిరస్త్రాణం (హెల్మెట్‌) తప్పనిసరిగా ధరించాలి.
* వేగ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి.

250 టూర్లు చేశా

  ఓసారి సరదాగా సూర్యలంక బీచ్‌కి వెళ్లాలనుకున్నా. ఒంటరిగానే బైక్‌ మీదే బయల్దేరా. ‘మాతో చెబితే మేమూ వచ్చేవాళ్లం కదా’ అన్నారు స్నేహితులు. అదే మాటతో హైదరాబాద్‌ బైకర్స్‌ క్లబ్‌ ప్రారంభించా. తొలిసారి హైదరాబాద్‌ నుంచి సొంతూరు నాందేడ్‌కి లాంగ్‌టూర్‌ చేశా. ఇప్పుడు రెండువందలమంది సభ్యులయ్యారు. ఫేస్‌బుక్‌లో నాలుగువేల మంది అనుసరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లేహ్‌, లద్దాఖ్‌లాంటి ప్రాంతాలు తిరిగాం. మా క్లబ్‌లో ఏ బైక్‌ వాళ్లైనా సభ్యులుగా చేరొచ్చు. ప్రతివారం ఏదో ఒక టూర్‌కి వెళ్తుంటాం. ఏదీ కుదరనపుడు సరదాగా యాభై, అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి వస్తుంటాం. నేను హోగ్‌లో కూడా సభ్యుడిని. మొత్తం 250కిపైగా టూర్లలో పాల్గొన్నా. మా ప్రతి ర్యాలీకి ఏదో నినాదం ఉంటుంది. సేఫ్టీ ర్యాలీలు చేస్తున్నాం. సామాజిక దురాచారాల్ని నిరసిస్తూ యాత్రలు చేస్తున్నాం. 

- పునీత్‌మంత్రి, హైదరాబాద్‌ బైకర్స్‌ క్లబ్‌

ప్రతి టూర్‌కి సామాజిక చైతన్యం

మూడేళ్ల కిందట మా గ్రూప్‌ మొదలైంది. హోండా సీబీఆర్‌ బైక్‌ యజమానుల్ని ఒక్కచోటికి తీసుకురావాలనే ఉద్దేశంతో అవినాష్‌, నేను, శ్యాం, సాయి దీన్ని ప్రారంభించాం. మొదట్నుంచే మా ప్రతి టూర్‌కి ఓ పర్పస్‌ ఉండాలనే నియమం పెట్టుకున్నాం. కొత్తగా మా క్లబ్‌లో చేరినవాళ్లకి హెల్మెట్‌లు కొనిచ్చాం. చిన్నచిన్న ర్యాలీల్లో రైడింగ్‌ జాగ్రత్తల ప్రచారం నిర్వహించాం. హెల్మెట్‌, షూస్‌, ధరించకుండా మేం బయటికి వెళ్లం. గతంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ రైడింగ్‌’ అని ఒక పెద్ద కార్యక్రమం చేశాం. ప్రమాదాల బారిన పడకుండా ఎలా బైక్‌ రైడింగ్‌ చేయాలో చెప్పాం. వర్షాకాలం మొదలవుతుంటే మొక్కలు నాటుతున్నాం. విరాళాలు సేకరించి అనాథ పిల్లలకు సాయం చేశాం. లంబసింగి, లక్నవరం, అరకు, గోవా.. నుంచి లేహ్‌, లద్దాఖ్‌ సహా ఇప్పటివరకు నలభైవరకు టూర్‌లు వెళ్లాం. అసిఫా దారుణ సంఘటనని నిరసిస్తూ త్వరలో కశ్మీర్‌ టూర్‌ చేయబోతున్నాం.

- శ్రీధర్‌, మోటోవింగ్స్‌ క్లబ్‌

- శ్రీనివాస్‌ బాలె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని