Polavaram: జంకులేని బొంకు ఇది!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 12 Apr 2025 06:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పోలవరం 41.15 మీటర్ల పాపం వైకాపాదే
జగన్‌ హయాంలోనే ఆ సిఫార్సులు
కేంద్ర జలశక్తి శాఖ నివేదికలో వెల్లడి
కూటమి ప్రభుత్వంలోనే జరిగిందంటూ జగన్‌ అండ్‌ కో ప్రచారం

ఈనాడు, దిల్లీ: ‘పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడాన్ని మేం అంగీకరించం. అలా చేస్తే అది బ్యారేజీలా మిగిలిపోతుంది తప్పితే రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడదు. చంద్రబాబునాయుడు అమరావతి నిధుల కోసం పోలవరాన్ని పణంగా పెట్టారు’ అంటూ వైకాపా నాయకులు, ఎంపీలు పార్లమెంటు లోపల, బయట చేస్తున్న వ్యాఖ్యలు వింటే వాస్తవాలు తెలియనివారు అవి నిజమేనేమో అనుకోవడం ఖాయం. కానీ కేంద్ర జలశక్తి శాఖ తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదికను గమనిస్తే ఈ ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది వైకాపా ప్రభుత్వమేనని స్పష్టమవుతుంది. 41.15 మీటర్ల వరకు నీటిని నిలబెట్టేందుకు వీలుగా మిగిలిన ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు రూ.10,911.15 కోట్లు కేటాయించడానికి తమకేమీ అభ్యంతరం లేదని 2023 జూన్‌ 5న కేంద్ర ఆర్థికశాఖ స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫేజ్‌-1కు (+41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు) సంబంధించి రూ.36,449.83 కోట్లతో సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సవరించిన అంచనాల నిర్ణాయక కమిటీ (రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ) సమీక్షించి 2023 మార్చి నాటికి ఉన్న ధరల ప్రకారం సవరించిన అంచనాలను రూ.30,346.95 కోట్లుగా ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది.

కేంద్ర కేబినెట్‌ ఆ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు తొలిదశగా పేర్కొంటూ 2023 జూన్‌ 5న సవరించిన అంచనాలను కేంద్రానికి పంపింది వైకాపా ప్రభుత్వమే. వాటిని కేంద్ర జలసంఘం తొలుత పరిశీలించి 2023 అక్టోబరు 13న కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదించినప్పుడూ వైకాపాయే అధికారంలో ఉంది. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి నాయకత్వంలో సవరించిన అంచనాల నిర్ణాయక కమిటీ 2023 అక్టోబరు 19న ఏర్పాటైనప్పుడు, అది 2024 ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించినప్పుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డే అధికారంలో ఉన్నారు. ఈ 41.15 మీటర్ల ప్రతిపాదనకు కర్త, కర్మ వైకాపా ప్రభుత్వమే అని జలశక్తి శాఖ నివేదిక చెబుతున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరిగినట్లుగా బొంకడానికి ఏ మాత్రం జంకడం లేదనేది వాస్తవం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు