let it go: వదిలేయండి బ్రో.. లేదంటే మనసు పాడవుతుంది!

Eenadu icon
By Features Team Updated : 04 Nov 2025 17:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నచ్చిన వాళ్లు వదిలేసి వెళ్లారని బాధ పడుతూ కూర్చోవద్దు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ప్రతి విషయాన్నీ పట్టించుకుంటే మనసుకి గాయాలు, ప్రశాంతత కరవు మాత్రమే మిగలుతాయి. అందుకే, మనకు నచ్చినట్టు మనం జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. అవేంటంటే..

  • ‘వెళ్లిపోవాలి అనుకున్న వాళ్లని వెళ్లనివ్వకపోతే.. ఉన్నా వెలితిగానే ఉంటుంది’ ఇది ఓ సినిమా డైలాగ్‌. నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. వదిలేసి వెళ్లిన వారిని ప్రాధేయపడి మీ జీవితంలో భాగం చేసుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్లు వదిలేసి వెళ్లిపోరు. ఒకవేళ వెళ్లిపోయారంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదనే కదా అర్థం. అలాంటి వారికోసం తాపత్రయపడొద్దు. వెళ్లిపోయే వారిని వెళ్లిపోనివ్వడమే మంచిది.
  • జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతత కోల్పోతాం. వాటిని అలాగే వదిలేయండి. ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించండి. తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలే మీ చేతుల్లో ఉంటాయి. వాటిపైనే దృష్టిపెట్టండి.
  • ఎదుటి వాళ్ల మాటలు, చేతలు మనసుకు తీసుకుంటే బాధగా ఉంటుంది. ఆఫీసులో బాస్‌ కోప్పడ్డాడా? పని విషయంలోనే అయి ఉండొచ్చు. తప్పు జరిగితే సరిదిద్దుకుంటే సరిపోతుంది. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కుటుంబసభ్యులు మీపై అరిచారా? క్షణికావేశంలో మాటలు అని ఉంటారు. వాటిని పట్టించుకోవద్దు.. వదిలేయండి. వాళ్లు కుదుటపడ్డాక శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి.
  • బస్సులోనో.. రైలులోనో ప్రయాణిస్తాం.. తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతాం. వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్లిపోతారు. బాధ పడతామా? లేదు కదా? జీవితంలో కొన్ని పరిస్థితులు, బంధాలు కూడా అంతే. అనుకోకుండా వస్తాయి.. అనుకోకుండానే పోతాయి. వాటి గురించి మదనపడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేం. ఆ ఆలోచనలను వదిలేసి.. ముందుకుసాగాలి. 

  • ఇతరులు తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేయొద్దు. ఎదుటివాళ్లని మార్చాలని చూస్తే  మీ ప్రశాంతతను, సంతోషాన్ని కోల్పోతారు. అదొక వృథా ప్రయాస. దానికి బదులుగా వారి ఇష్టాయిష్టాలను వారికే వదిలేసి.. మీరు మారేందుకు ప్రయత్నించండి. మీ ఆలోచనను మార్చుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకునేవారితో మీ భావోద్వేగాలను పంచుకోండి. 
  • ఎవరు.. ఎప్పుడు.. ఎలా మారిపోతారో చెప్పలేం. అందుకే ఎవరిపైనా అతిగా ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోవద్దు.. ఆధారపడొద్దు. ప్రతి బంధానికి హద్దులు పెట్టుకోండి. వాటిని దాటి అవమాన పడొద్దు. మనసు బాధపడేలా చేసుకోవద్దు. మీపై మీరు దృష్టిపెట్టండి. మీకోసం సమయం కేటాయించుకోండి. మీ మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Tags :
Published : 04 Nov 2025 10:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు