Ys jagan: జగన్‌- అదానీల జుగల్‌బందీ ఎప్పుడు.. ఎక్కడ.. ఎందుకు.. ఎలా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 22 Nov 2024 09:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

తేదీలు, వేదికలతో సహా వెల్లడించిన అమెరికా దర్యాప్తు సంస్థ
వీరి భేటీ తర్వాతే విద్యుత్‌ ఒప్పందాలు కుదిరినట్లు స్పష్టం
ఈనాడు - అమరావతి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడడంలో ఆరితేరినవారు ఒకరు.. కార్పొరేట్‌ మాయాజాలంలో అందెవేసినవారు మరొకరు.. ఇద్దరూ కలిశారు.. భారీ కుట్రకు స్కెచ్‌ వేశారు.. రూ.వేల కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. గత ముఖ్యమంత్రి జగన్(YS Jagan), అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani) ఏపీలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పేరిట చేసిన కుంభకోణమిది. ఎక్కడా అమ్ముడుపోని తన విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తే రూ.1,750 కోట్లు ఇస్తానని అదానీ ఆఫర్‌ చేశారు! ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో రూ.1.10 లక్షల కోట్ల భారం పడుతుందని, ఇది నష్టదాయకమని జగన్‌కూ తెలుసు! కానీ రూ.కోట్లు వస్తుంటే, జనం ఎలా పోతే మనకేంటి అనుకున్నారేమో! రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఆఘమేఘాలపై అదానీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్‌ కొనాలంటూ కేంద్ర సౌరవిద్యుత్‌ సంస్థ నుంచి ప్రతిపాదన రావడం, దాన్ని మంత్రివర్గం ఆమోదించడం, ఒప్పందం చేసుకోవడం అంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది.

2021 సెప్టెంబరు 12: ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీం కింద రాజస్థాన్‌లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే అదానీ సంస్థతో సెకి ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌరవిద్యుత్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో.. అదానీ సంస్థ కోట్‌ చేస్తున్న ధరకు విద్యుత్‌ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. దాంతో గౌతమ్‌ అదానీ రంగంలోకి దిగారు. తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో వారిద్దరి మధ్య ఒక ‘అంగీకారం’ కుదిరింది. 

2021 సెప్టెంబరు 15: అదానీ, జగన్‌ భేటీ అయిన మూడు రోజుల్లోనే సెకి నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాజస్థాన్‌లో ఏర్పాటవుతున్న విద్యుత్‌ సంస్థలు యూనిట్‌ రూ.2.49 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయని, పాతికేళ్లపాటు ఆ విద్యుత్‌ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్‌శాఖ కార్యదర్శికి కేంద్ర సౌర విద్యుత్‌ సంస్థ (సెకి) లేఖ రాసింది.

2021 సెప్టెంబరు 16: సాధారణంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే, దాన్ని ఆ శాఖ కార్యదర్శి, మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే, మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. కానీ సెకి ప్రతిపాదనపై జగన్‌ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సెకి నుంచి లేఖ వచ్చిన మర్నాడే.. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి, ఆమోదించారు. బహుశా, ఇటీవలి కాలంలో ఇదో రికార్డు కావొచ్చు. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దుచేసి మరీ, సెకి నుంచి విద్యుత్‌ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది. టెండర్లు, రివర్స్‌ టెండర్ల ఊసే లేదు. 

2021 డిసెంబరు: అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్‌ పవర్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది. అజూర్‌ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్‌ను కూడా అదానీ నుంచే తీసుకునేలా సెకి తర్వాత ప్రతిపాదించగా, దానికీ ఆమోదం తెలిపింది. అంటే అదానీ, అజూర్‌ పేరుకే వేర్వేరు కంపెనీలు గానీ, ఆ రెండూ ఒకటేనని అర్థమవుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెకి నుంచి యూనిట్‌ రూ.2.49కి కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే సరికే.. కొన్ని రాష్ట్రాలు ఇతర సౌరవిద్యుత్‌ సంస్థల నుంచి యూనిట్‌ రూ.1.99కి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్‌ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా లెక్కచేయకుండా సెకితో ఒప్పందం చేసుకుంది. పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది.


ఆ సమావేశాలు.. అత్యంత రహస్యం

జగన్‌ సీఎంగా ఉండగా, పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన్ను కలిసిందే అరుదు! ఎప్పుడైనా ఒకరిద్దరు వచ్చి కలిసినా, వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి! కానీ, అదానీతో భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవి. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వచ్చి సీఎంను కలిసి, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే.. సీఎంఓ ఆ సమాచారాన్ని మీడియాకు విడుదల చేస్తుంది. పెట్టుబడులు ఖాయమైతే.. విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రకటిస్తారు. అదానీ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చి సీఎంను కలిస్తే ఇంకెంత హడావుడి చేయాలి? కానీ జగన్‌ను కలిసేందుకు అదానీ ఎప్పుడొచ్చినా, అత్యంత రహస్యంగా ఉంచేవారు. చివరకు జగన్‌ సొంత పత్రిక, ఛానళ్లలో కూడా ఆ వార్తలు వచ్చేవి కాదు. 2021 నవంబరు 20న జగన్‌తో అదానీ కుటుంబసభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశం జరిగిన సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి విలేకరులకు చెప్పారు. అదానీ వచ్చి జగన్‌ను ఎప్పుడు కలిసినా తర్వాత కొద్దిరోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో, ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబరు 12 తేదీల్లో జగన్‌తో అదానీ సమావేశమై రూ.1,750 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, తర్వాతే ఏపీ ప్రభుత్వంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం వల్ల అదానీ గ్రూప్‌నకు 20 ఏళ్లలో 200 కోట్ల డాలర్ల నికర లాభం చేకూరుతుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతోంది అదానీ, జగన్‌లేనన్న మాట! విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకు అదానీ గ్రూప్‌ మొత్తంగా రూ.2,029 కోట్లు ఇవ్వజూపితే, దానిలో రూ.1,750 కోట్లు జగన్‌కే ఆఫర్‌ చేశారంటేనే.. వారి మధ్య బంధం అర్థమవుతోంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకే అదానీ సంస్థ జగన్‌కు.. రూ.1,750 కోట్లు ముట్టజెప్పడమో, హామీ ఇవ్వడమో చేస్తే.. ఇక ఐదేళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్‌ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్‌ను కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ జరుగుతోంది.

తేదీలతో సహా వెల్లడి

జగన్‌తో అదానీ ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో సమావేశమయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికల్లో తేదీలతో సహా పేర్కొన్నాయి. ఆ తేదీల్లో జగన్, అదానీ భేటీ అయ్యారా? లేదా? అని తరచి చూస్తే.. ఆ తేదీల్లో వారి భేటీ జరిగిందని తేలింది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబరు 12, నవంబరు 20 తేదీల్లో వీరిద్దరూ భేటీ అయ్యారని ఆ సంస్థలు పేర్కొన్నాయి. 2021 సెప్టెంబరు 12న అదానీ సోదరులు జగన్‌తో సమావేశమయ్యారు. అదీ రహస్యంగానే ఉంచారు. ఆ భేటీ తర్వాతే సెకి నుంచి ప్రతిపాదన వచ్చింది. నవంబరు 20 భేటీ తర్వాత ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దానికి ముందు 2021 ఆగస్టు 7న కూడా జగన్‌-అదానీ భేటీ అయ్యారని అమెరికా నివేదిక పేర్కొంది. ఆ రోజు.. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను అదానీకీ విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 


ఎంతో లోతైన దర్యాప్తు

అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంలోని సూక్ష్మమైన అంశాలనూ బట్టబయలు చేశాయి. ముడుపులు చెల్లించే క్రమంలో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎలా కలిశారు? వారిమధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో వెల్లడించాయి. అమెరికాలో కూర్చొని మరీ.. ఏపీలోని తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన భేటీల సారాంశాన్ని తమ అభియోగపత్రంలో పేర్కొన్నాయి. ఇలాంటి కేసుల్లో పరిశోధన, దర్యాప్తు ఎలా చేయాలి? ఆర్థిక నేరాల్లో అక్రమాలను ఎలా వెలుగులోకి తేవాలనేదానికి ఈ దర్యాప్తు ఒక అద్భుతమైన ఉదాహరణ. మన సీబీఐ, ఈడీ, ఏసీబీ, సీఐడీ వంటి సంస్థలు ఈ దర్యాప్తు చూసైనా నేర్చుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలవుతోంది. జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం సహా అనేక కేసులు సీఐడీకి, ఇసుక కుంభకోణం సహా మరికొన్ని కేసులను ఏసీబీకి ఇచ్చారు. ఏ ఒక్కదాంట్లోనూ ఈ తరహా దర్యాప్తు లేదు. అంతగా పురోగతీ లేదు.

Tags :
Published : 22 Nov 2024 05:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని