Google AI Hub: గేమ్‌ ఛేంజర్‌... గూగుల్‌ ఏఐ డేటా హబ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 15 Oct 2025 06:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

గ్లోబల్‌ కనెక్టివిటీ కేంద్రంగా విశాఖ
ఇతర రంగాల్లోనూ వృద్ధికి అవకాశాలు

ఈనాడు, అమరావతి: ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయనున్న ఏఐ హబ్, డేటా సెంటర్‌ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా దూసుకెళ్లేందుకు చోదక శక్తులు కాబోతున్నాయి. రాష్ట్ర ఐటీ రంగాన్ని మేలుమలుపు తిప్పే గేమ్‌ ఛేంజర్స్‌గా నిలవనున్నాయి. విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేసేది డేటా సెంటర్‌ మాత్రమే కాదు. అక్కడ డేటా స్టోరేజీతో పాటు కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్‌ సదుపాయాల్ని సమకూర్చనుంది. ఏఐ ఆధారిత కంపెనీలు.. గూగుల్‌ ఏఐ డేటా హబ్‌కు అనుబంధంగా వచ్చే అవకాశముంది. 

ఇక్కడ ఏం చేస్తారంటే?

భారీ ఎత్తున డేటా స్టోరేజ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్‌.. డేటా సెంటర్‌ చేసే ప్రధాన విధులు. విశాఖలో ఏర్పాటుచేసే ఏఐ డేటా హబ్‌లో డేటా సెంటర్‌ ఒక భాగం మాత్రమే. మనం వాడే సాధారణ కంప్యూటర్లలో సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (సీపీయూ)లు వినియోగిస్తారు. కానీ డేటా సెంటర్లలో గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (జీపీయూ)లు, టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (టీపీయూ)లు, నాన్‌ వోలటైల్‌ మెమరీ ఎక్స్‌ప్రెస్‌ (ఎన్‌వీఎంఈ) స్టోరేజ్‌ వినియోగిస్తారు. ఒక్కో జీపీయూలో కొన్ని వేల సీపీయూలను వాడటం వల్ల సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్‌ చేసేందుకు, కంప్యూటింగ్‌కు అవకాశం ఉంటుంది. విశాఖలో నెలకొల్పే డేటా సెంటర్‌ను గూగుల్‌ సంస్థ.. గూగుల్‌ సెర్చ్, ఆండ్రాయిడ్, గూగుల్‌ ప్లే, క్రోమ్, యూట్యూబ్, గూగుల్‌ మ్యాప్స్, వర్క్‌స్పేస్, గూగుల్‌ క్లౌడ్, గూగుల్‌ ప్లేస్, గూగుల్‌ ఎర్త్, జెమినీ ఏఐ వంటి తన సేవలకు అవసరమైన డేటా స్టోరేజ్, కంప్యూటింగ్‌కు వాడుకోనుంది. అలాగే మన దేశంలో, విదేశాల్లోనూ ఉన్న ఇతర సంస్థలకు స్టోరేజ్, కంప్యూటింగ్‌ సేవల్ని అందించనుంది. 

ఎందుకు గేమ్‌ ఛేంజర్‌?

ఈ ప్రాజెక్టుపై గూగుల్‌ సంస్థ ఐదేళ్లలో సుమారు రూ.1.33 లక్షల కోట్లు వెచ్చిస్తుందని అంచనా. విశాఖ ప్రగతి ప్రస్థానంలో గూగుల్‌ రావడం సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ అమెరికాకు వెలుపల తమ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టాక.. ఐటీ రంగంలో భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. విశాఖ కూడా భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు దోహద పడనుంది. ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పెట్టుబడులకు ఐటీతో పాటు ఇతర రంగాల పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చే వాతావరణం ఏర్పడనుంది. నవంబర్‌లో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తుండగా, సరిగ్గా నెల రోజుల ముందు ఈ కీలక ఒప్పందం జరగడం విశేషం. గూగుల్‌ ప్రాజెక్టుతో విశాఖ గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా మారనుంది. సముద్రంలో వేసే కేబుళ్ల ద్వారా ఇక్కడి నుంచి 12 దేశాలతో గూగుల్‌ అనుసంధానమవుతుంది. జెమినీ ఏఐతో పాటు గూగుల్‌ ఇతర సేవలు ఈ డేటా సెంటర్‌ ద్వారా అందుతాయి. 

విద్యుత్‌ వినియోగమే ప్రాతిపదిక

సాధారణంగా కంప్యూటర్ల సామర్థ్యాన్ని స్టోరేజ్, కంప్యూటింగ్‌ సామర్థ్యం ఆధారంగా చెబుతారు. కానీ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని విద్యుత్‌ వినియోగం ఆధారంగా లెక్కిస్తారు. సాధారణ కంప్యూటర్లకు 100-200 వాట్‌ల విద్యుత్‌ అవసరమైతే, జీపీయూలు వాడే కంప్యూటర్లకు వాటి పరిమాణం, వేగాన్ని బట్టి 300-400 వాట్స్‌ అవసరమవుతాయి. డేటా సెంటర్‌లో వేల కొద్దీ జీపీయూలు ఉంటాయి కాబట్టి, భారీగా విద్యుత్‌ అవసరమవుతుంది. 

భారీ సంఖ్యలో నిపుణులు అవసరం

ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు ఇక్కడ తయారవుతారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో పాటు కీలక రంగాల నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ నిపుణులు, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు, సైబర్‌ సెక్యూరిటీ, డేటా గోప్యత నిపుణులు, డేటా సెంటర్‌ టెక్నీషియన్ల సేవలు అవసరం. సర్వర్లు, నెట్‌వర్క్‌ పరికరాలు, స్టోరేజ్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్, నిర్వహణ, ట్రబుల్‌ షూటింగ్‌.. ఇలా వివిధ విభాగాల్లో 24 గంటలూ నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు