Andhra News: ‘పోలవరం-బనకచర్ల’పై తొలి అడుగు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 24 May 2025 06:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేంద్ర జలసంఘానికి ప్రీఫీజిబిలిటీ నివేదిక సమర్పణ
మరోవైపు కేంద్ర మద్దతు కోరిన ముఖ్యమంత్రి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలసంఘానికి ప్రీఫీజిబిలిటీ నివేదిక(పీఎఫ్‌ఆర్‌) సమర్పించారు. ప్రాజెక్టు ప్రాథమిక స్వరూపం, హైడ్రాలజీ, ఎంత వ్యయం అవుతుంది? కొత్త ఆయకట్టు ఎంత? స్థిరీకరణ ఎంత? పెట్టుబడి, రాబడి నిష్పత్తి వంటి అంశాలను నివేదికలో పొందుపర్చారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి మంత్రులతో భేటీలోనూ ప్రాజెక్టుకు మద్దతు కోరారు. కేంద్ర జలసంఘం నివేదికను పరిశీలించాక రాష్ట్ర అధికారులతో చర్చించనుంది. ఆ తర్వాత కేంద్ర జలసంఘంలోని డైరెక్టర్ల సమావేశం పీఎఫ్‌ఆర్‌ను ఆమోదించనుంది.

అనంతరం పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించాల్సి ఉంటుంది. జలవనరులశాఖ జూన్‌ నెలాఖరుకు లేదా జులై ప్రారంభానికి డీపీఆర్‌ సమర్పించాలనే లక్ష్యంతో ఆ ప్రక్రియనూ ప్రారంభించింది. పోలవరం నుంచి 23 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా ప్రాజెక్టును 3 సెగ్మెంట్లుగా పీఎఫ్‌ఆర్‌లో పేర్కొన్నారు. పోలవరం జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజికి నీటిని తరలించడం, అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి చేర్చడం, ఆ తర్వాత బనకచర్ల కాంప్లెక్సుకు నీటిని మళ్లించడం ఇందులో ప్రధాన భాగాలు.

  • సెగ్మెంట్‌1: పోలవరం- ప్రకాశం బ్యారేజి
  • ప్రస్తుత అంచనా వ్యయం: రూ.13,800 కోట్లు 
  • సేకరించాల్సిన భూమి: 1,401 ఎకరాలు

పోలవరం జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీళ్లు తరలిస్తారు. కుడి కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, వరద కాలువ నుంచి 18 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఈ దశలో లిఫ్టులు అవసరం లేదు. తాడిపూడి ఎత్తిపోతల కాలువను విస్తరించి వరద కాలువగా మారుస్తారు. మొత్తం 175.40 కి.మీ. మేర ఉండే కాలువలు ప్రస్తుత పవిత్ర సంగమ ప్రాంతానికి 4 కి.మీ. దిగువన ప్రకాశం బ్యారేజి వద్ద కలుస్తాయి. 

  • సెగ్మెంట్‌2: ప్రకాశం బ్యారేజి-బొల్లాపల్లి జలాశయం
  • అంచనా వ్యయం: రూ.35,750 కోట్లు 
  • భూమి: 13,700 ఎకరాల అటవీ, 29,500 ఎకరాల ఇతర భూమి అవసరం

ప్రకాశం బ్యారేజి వద్ద వైకుంఠపురం నుంచి నీటిని రెండో దశలో ఎత్తిపోస్తారు. 6 దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. మొత్తం 84.17కి.మీ. కాలువ ప్రవహిస్తుంది. 11.575 కి.మీ. పైపులైను ఉంటుంది. బొల్లాపల్లి వద్ద జలాశయం తవ్వి అక్కడ 173 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. డెడ్‌ స్టోరేజి 21 టీఎంసీలుగా ఉంటుంది. ఈ భాగంలో 18 ఆవాసాలు ముంపులో చిక్కుకుంటాయి. 4,800 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.

  • సెగ్మెంట్‌ 3: బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల కాంప్లెక్సు
  • అంచనా వ్యయం: రూ.32,350 కోట్లు

ఈ దశలో బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల కాంప్లెక్సుకు నీళ్లు తీసుకెళ్తారు. రోజుకు   1.5 టీఎంసీలు బనకచర్ల కాంప్లెక్సుకు, మరో 0.5 టీఎంసీలు నల్లమలసాగర్‌ జలాశయానికి తరలిస్తారు. 3 చోట్ల లిఫ్టులతో +171 మీటర్ల నుంచి +335 మీటర్ల స్థాయికి నీటిని ఎత్తిపోయాలి. 113.33 కి.మీ. కాలువ, మొత్తం 26.10 కి.మీ. పొడవున సొరంగాలు తవ్వాల్సి ఉంది. నల్లమలలో ఈ సొరంగాలు తవ్వుతున్నా ప్రధాన టన్నెల్‌ ప్రారంభం, చివరి ప్రాంతాలు అటవీ ప్రాంతంలోకి రావు. పులుల అభయారణ్యానికి బయటే ఉంటాయి.

Tags :
Published : 24 May 2025 04:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు