Pawan Kalyan: ఎవరికీ తలవంచని నైజం ప్రధానిది

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 26 May 2025 04:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆయన ఎప్పుడూ ఓట్ల కోసం ఆలోచించలేదు
ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశంలో పవన్‌కల్యాణ్‌
కులగణన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగం 

ప్రధాని మోదీతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్,

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్, నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నెఫియూరియో

ఈనాడు, దిల్లీ: హిమాలయాల్లా ఎవరికీ తలవంచని నైజం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, అందుకే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఆదివారం దిల్లీలో జరిగిన ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ను అభినందిస్తూ చేసిన తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానిపై పవన్‌ ప్రశంసలు గుప్పించారు. ‘‘ప్రధాని మోదీ నిరంతరం ప్రజల కోసం తప్పితే ఓట్ల కోసం ఆలోచించలేదు. అందుకు ప్రబల ఉదాహరణే పీఎం జన్‌మన్‌. ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2024-25లో 612 కి.మీ. పొడవైన 206 రోడ్లు మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.555 కోట్లు కేటాయించారు. ఇంత ఖర్చు ద్వారా ప్రయోజనం కలుగుతున్నది 55 వేల మంది పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌లకు మాత్రమే. ఇదే డబ్బు ఇంకోచోట ఖర్చు చేస్తే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు వీలయ్యేది. ప్రధాని ఓట్ల కోసం కాకుండా అత్యంత వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం పని చేస్తున్నారనేది దీని ద్వారా స్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నారు. 

ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాం..

కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్‌ను అభినందిస్తూ చేసిన తీర్మానాన్ని హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్‌ సైనీ ప్రతిపాదించగా, పవన్‌కల్యాణ్‌ బలపరిచారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాజీవ్‌ రంజన్‌ మిశ్ర ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసి అధ్యయనం నిర్వహించింది. అనంతరం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది’ అని పవన్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 18న జీవో జారీ చేసిన విషయాన్ని వెల్లడించారు.


దశాబ్ద కాలంలో ఎంతో పురోగతి

భారత్‌ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్‌ ప్రకటించడంతో ప్రధానమంత్రి నాయకత్వాన్ని అభినందిస్తూ పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘4.18 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ చారిత్రక విజయం ప్రధాని దార్శనిక నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల పరిపాలనను చాటి చెబుతోంది. గత దశాబ్ద కాలంలో మౌలిక వసతులు, డిజిటల్‌ రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించింది. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారత్‌ ప్రాధాన్యానికి అద్దం పడుతోంది. 2047 కల్లా వికసిత్‌ భారత్‌గా అవతరించేందుకు ఇదో పెద్ద ముందడుగు’’ అని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం ప్రధానితో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను పవన్‌ పోస్ట్‌ చేశారు. ‘‘మా ప్రియతమ నేత, ప్రధాని మోదీతో కలిసి భోజనం చేశాం. దేశంపై ఆయనకున్న నిబద్ధత, ప్రేమ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. సోమవారం అక్కడ ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించే సదస్సులో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు