డయాఫ్రం వాల్‌ ఎప్పటికి నిర్మిస్తారు?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 19 Jul 2025 06:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మీరు చెప్పిన సమయానికి అవుతుందా?
నిధులున్నా ఎందుకు బిల్లుల పెండింగ్‌?
పోలవరంపై కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష

ఈనాడు, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ నిర్మాణం 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయగలరా..? ఇప్పటికే అనుకున్న ప్రకారం నిర్మాణ పనులు జరగడం లేదు.. అవి లక్ష్యానికి భిన్నంగా ఉన్నాయి. ఎప్పటికి పూర్తిచేయగలరో స్పష్టంగా చెప్పండి’ అని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఆమె దిల్లీలో శుక్రవారం సమీక్షించారు. ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పునరావాస కమిషనర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, ఇతర కేంద్ర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పనుల పరిస్థితితో పాటు ఆర్థిక షెడ్యూలు, బిల్లుల చెల్లింపు అంశాలపైనా ఆమె సమీక్షించారు. ‘2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్‌ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఈఎన్సీ తెలిపారు. ఇప్పటికే 5,000 స్వ్కేర్‌ మీటర్ల మేర పనులు వెనుకబడి ఉన్నారని, ఎప్పటికి పూర్తిచేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆమె అడిగారు. 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని, వర్షాకాలంలోనూ పనులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని ఈఎన్సీ తెలిపారు. లేనిపక్షంలో 2026 మార్చికి డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి చేయగలమని వెల్లడించారు. 

ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలు మళ్లీ స్పష్టంగా ఇవ్వండి

ప్రాజెక్టు నిర్మాణ రీషెడ్యూలు పకడ్బందీగా రూపొందించి, మళ్లీ ఇవ్వాలని దేబశ్రీ ముఖర్జీ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుకు సంబంధించి అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని 20 రోజుల్లో దాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైమావీరా సాఫ్ట్‌వేర్‌తో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆ షెడ్యూలును కేంద్ర జల సంఘానికి సమర్పిస్తే.. వారు పది రోజుల పాటు పరిశీలించి అవసరమైన మార్పులు సూచిస్తారని, నెల రోజుల్లో సమగ్ర షెడ్యూలు తన వద్దకు చేరాలని కార్యదర్శి ఆదేశించారు. గ్యాప్‌-1 ప్రధాన డ్యాం పనులు 2025 నవంబరు నుంచే ప్రారంభించాలనుకుంటున్నామని ఈఎన్సీ చెప్పారు. ఇసుక రీచ్‌లో మొదట పనులు చేస్తామని, నల్లమట్టి రీచ్‌లో డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ పూర్తయిన తర్వాత చేపడతామని వెల్లడించారు. ప్రాజెక్టు నాణ్యత మాన్యువల్‌ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. బట్రస్‌ డ్యాం నిర్మాణ పనులూ ఆలస్యం అవుతున్న వైనంపై ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరుకు బట్రస్‌ డ్యాం నిర్మాణం పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు.


పునరావాస నిధులు చెల్లించండి

పునరావాసానికి సంబంధించి కేంద్రం రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉందని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రం వద్ద రూ.2,200 కోట్ల కేంద్రం నిధులున్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని సూచించారు. పనులకు సంబంధించిన బిల్లులు ఎంత మొత్తం పెండింగులో ఉన్నాయని ప్రశ్నించగా,  రూ.300 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వాటిని చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామని దేబశ్రీ ముఖర్జీ చెప్పారు.

Tags :
Published : 19 Jul 2025 05:40 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు