Andhra News: పోలవరం-బనకచర్ల వైపు వడివడిగా అడుగులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 17 May 2025 03:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

త్వరలోనే రూ.81,900 కోట్లతో పాలనామోదం
20 నాటికి కేంద్ర జలసంఘానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదిక 
ఒకే ప్యాకేజిగా టెండర్‌ పిలవాలని తర్జనభర్జనలు
జూన్‌లోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, అమరావతి: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిమంది అధికారులతో ఈ అంశంపై తరచూ చర్చిస్తున్నారు. మరోవైపు ఆర్థికశాఖ, జలవనరులశాఖ అధికారులు వరుస సమావేశాలతో ముందుకెళ్లే అంశాన్ని ఓ కొలిక్కి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జూన్‌లోనే టెండర్లు పిలవనున్నారు. ఇందుకు తొలుత పాలనామోదం ఇవ్వాలి. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చేందుకు జలవనరులశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి పాలనామోదం ఇచ్చేందుకు ఉన్న అవకాశాలు, ఏ ఆర్థిక నమూనాలో దీన్ని చేపట్టాలనే అంశాలపై ఆర్థికశాఖ, జలవనరులశాఖ చర్చిస్తున్నాయి. 

గోదావరి వరద జలాలను పోలవరం రిజర్వాయర్‌ నుంచి తొలుత ప్రకాశం బ్యారేజికి, అక్కడినుంచి బొల్లాపల్లి వద్ద ఏర్పాటుచేసే జలాశయానికి తరలించాలనేది ప్రణాళిక. తిరిగి బొల్లాపల్లి నుంచి బనకచర్ల కాంప్లెక్సుకు నీళ్లు తీసుకెళ్లాలనేది ఈ ప్రాజెక్టులో కీలకాంశం. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి తాజాగా మంత్రివర్గ భేటీలో వెల్లడించారు. కేంద్రం నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నందున వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టి అవసరమైన అనుమతులన్నీ తెచ్చుకుని నిధులు సమీకరించుకోవాలనే లక్ష్యంతో సీఎం ఉన్నారు. అందుకే జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు ఉత్తర్వులూ వెలువడ్డాయి. వాటిని సవరిస్తూ.. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఎండీ, సీఈఓగా నియమించారు.

రూ.62,000 కోట్ల అంచనాతో జూన్‌లో టెండర్లు 

ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు వీలుగా ఏ విభాగానికి ఎంత ఖర్చవుతుందో ఇప్పటికే లైన్‌ ఎస్టిమేట్లు సిద్ధమయ్యాయి. మొత్తం రూ.81,900 కోట్లకు పాలనామోదం ఇచ్చినా, ఇందులో జీఎస్టీ వాటానే రూ.11వేల కోట్లు ఉంటుంది. భూసేకరణ, ఇతర అంశాలకు 8,000 కోట్ల వరకు ఖర్చయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు రూ.62వేల కోట్ల పని విలువతో టెండర్లు పిలిచేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికకు కేంద్ర జలసంఘం, పర్యావరణం, అటవీ భూమి తీసుకునేందుకు సంబంధిత శాఖలు, గిరిజన వ్యవహారాలశాఖ అనుమతులు అవసరం. దీనికి తోడు టన్నెల్‌ తవ్వకానికి వన్యప్రాణి సంరక్షణ విభాగం అనుమతులూ కావాలి. జలవనరులశాఖ ఈ అనుమతులన్నీ సాధించి ప్రాజెక్టుకు టెండర్లు పిలవాలంటే ఆలస్యమవుతుంది. అందువల్ల తొలుత టెండర్లు పిలిచి ఈ అనుమతులన్నీ సాధించే బాధ్యత కూడా గుత్తేదారు సంస్థలకే అప్పగిస్తారు. ఈ అనుమతులకు జలవనరులశాఖ, రాష్ట్రంలోని ఇతర శాఖల అధికారులు కేంద్రంతో సంప్రదింపుల బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ అనుమతులు సాధించాల్సిన బాధ్యతలు పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థలకే అప్పజెప్పాలని జలవనరులశాఖ నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా అనుమతులు టెండర్ల పరిధిలోకి తీసుకొస్తేనే జూన్‌లోపు టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తిచేసి పనులు అప్పగించే ఆస్కారం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఒకే ప్యాకేజిగా మొత్తం టెండరు

మొత్తం పనిని ఒకే ప్యాకేజిగా టెండర్‌ పిలవాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇందుకు ఎంతవరకు ఆస్కారం ఉంది? ఇలా పిలిస్తే భాగస్వామ్య సంస్థలు ఉమ్మడిగా బిడ్‌ దాఖలుచేయాల్సి ఉంటుందా లేక ఆ మేరకు అర్హతలు ఉండే సంస్థలు ఏవి? ఇలా అనేకాంశాలు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కాంట్రాక్టు సంస్థ కూడా కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొంత రుణం, కొంత కేంద్రం, కొంత రాష్ట్ర ప్రభుత్వం, మరికొంత గుత్తేదారు సంస్థ పెట్టుబడి ఉంటుంది. తాజాగా ఆర్థికశాఖ జలవనరులశాఖ అధికారులతో నిధుల సమీకరణ నమూనాలపై చర్చలు చేపట్టింది.


20 నాటికి ప్రీ ఫీజిబిలిటీ నివేదిక సమర్పణ

పోలవరం-బనకచర్ల అనుసంధానానికి తొలుత ప్రీ ఫీజిబిలిటీ నివేదిక కేంద్ర జలసంఘానికి సమర్పించాలి. పర్వేశ్‌ వెబ్‌సైట్‌లో ఇది అప్‌లోడ్‌ చేయాలి. ఈ నివేదిక తయారుచేసే బాధ్యతలు వ్యాప్కోస్‌కు అప్పజెప్పారు. ఈ నెల 20న ఆ నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. తొలుత ఈ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను పరిశీలించి కేంద్రజలసంఘం అనుమతులు ఇస్తుంది. దాని ఆధారంగా టెండర్లు పిలవచ్చు. తర్వాత డీపీఆర్‌ సమర్పించాలి. జులై నాటికి పూర్తిస్థాయి డీపీఆర్‌ సమర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు