Andhra News: పోలవరం-బనకచర్ల అనుసంధానంతో.. తెలంగాణకు ఎలా నష్టం?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 08 Apr 2025 06:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

వరద జలాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు
డీపీఆర్‌లు ఇవ్వకుండా మీరు ప్రాజెక్టులు కట్టలేదా?
గోదావరి బోర్డు భేటీలో ఏపీ అధికారుల ప్రశ్నలు 
సర్వసభ్య సమావేశంలో వాడీవేడి చర్చ
ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ సంసిద్ధత

ఈనాడు, అమరావతి: పోలవరం- బనకచర్ల అనుసంధానం, గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తదితర అంశాలతో సోమవారం గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఏపీ అధికారులు తెలంగాణ వాదనను ప్రశ్నించారు. బోర్డు ఛైర్మన్‌ ఎ.కె.ప్రధాన్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీరు సుగుణాకరరావు, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, బోర్డు కార్యదర్శి అలగేసన్, ఇతర సభ్యులు, ఇరు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.

ఎందుకంత హడావుడి?

‘గోదావరిలో వరద జలాల ఆధారంగానే పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి అవార్డులోని నికర జలాలతో ఏ రకంగానూ దీనికి సంబంధం లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాక దిగువకు వచ్చిన వరద జలాలతోనే ఈ ప్రాజెక్టుకు నీళ్లిస్తాం. ఇక్కడ ఉపయోగించుకోకుంటే అవి సముద్రంలో కలుస్తాయి. ఇక ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టమేంటి? దీనిపై ఎందుకింత హడావుడి?’ అని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘పోలవరం- బనకచర్ల అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టేసింది. ఆ ప్రాజెక్టు వివరాలు కూడా మాకు సమర్పించలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారు. అమరావతి జల హారతి కార్పొరేషన్‌ పేరిట నిధులు సేకరిస్తోంది. ఇప్పటికే కొన్ని వందల కోట్లు ఖర్చు చేశార’ని తెలంగాణ అధికారులు రాహుల్‌ బొజ్జా, అనిల్‌కుమార్‌ తదితరులు వాదించారు.

‘ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ కూడా తయారుకాలేదు. కేవలం కాన్సెప్ట్‌ పేపర్‌ మాత్రమే సిద్ధమైంది. డీపీఆర్‌ లేకుండా, డిజైన్లు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతామ’ని ఏపీ ఈఎన్సీ ప్రశ్నించారు. ‘ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ క్యాబినెట్‌లో ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. పోలవరంలో టన్నెళ్ల సామర్థ్యం 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గుత్తేదారుకు కొంత బిల్లులు చెల్లించారు’ అంటూ ఓ ప్రజెంటేషన్‌ను చూపిస్తూ తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. మంత్రిమండలి ఆమోదించినంత మాత్రాన.. డీపీఆర్‌ లేకుండా, డిజైన్లు లేకుండా నిర్మాణం సాధ్యమేనా అని ఏపీ అధికారులు ఆక్షేపించారు. ‘అసలు తెలంగాణ రాష్ట్రం ఒక్క పేపరు లేకుండా, ఒక్క డీపీఆర్‌ లేకుండా, ఏ విషయమూ బయటకు రాకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. వాటి వల్ల దిగువనున్న ఏపీ నష్టపోతోంది. కానీ, తెలంగాణకు అసలు నష్టమే లేని, ఆ రాష్ట్రానికి దిగువన నిర్మించే వరద జలాల ఆధారిత ప్రాజెక్టుపై ఇంత రాద్ధాంతమేంటి’ అని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

బోర్డు అధికారులతోనూ వాదన

పోలవరం- బనకచర్లపై కేంద్ర జల్‌శక్తి శాఖ అడిగిన సమాచారం కోసం ఏపీ అధికారులకు లేఖ రాసిన గోదావరి బోర్డు.. ఆ లేఖ ప్రతులు తెలంగాణకు ఎందుకివ్వలేదు అని ఆ రాష్ట్ర అధికారులు బోర్డు సభ్యుడు కనోడియాను నిలదీశారు. ఆ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన బదులిచ్చారు. ఇది కేంద్ర జల్‌శక్తికి, బోర్డుకు మధ్య అంతర్గత వ్యవహారమని, పోలవరం- బనకచర్ల సమాచారమేదీ తమ వద్ద లేదని, ఆ విషయం జల్‌శక్తి శాఖకు తెలియజేశామని చెప్పారు. బోర్డు సభ్యులుగా మీరు ఈ సంగతి మాకు చెప్పకపోతే ఎలాగని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. బోర్డులో జరిగే ప్రతి చిన్న విషయమూ, వాటి కాగితాలను సభ్యులతో పంచుకోవాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. జల్‌శక్తి అధికారులకు, మంత్రికి లేఖ రాసి వారు చెప్పినట్లు చేస్తామని చెప్పారు. బోర్డు స్వతంత్రతకు ఇది భంగకరమని తెలంగాణ అధికారులు వ్యాఖ్యానించారు. బోర్డు ఛైర్మన్‌ ప్రధాన్‌ కల్పించుకొని.. అసలు గోదావరి వరద జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలా నష్టమో చెప్పకుండా కాగితాలు ఇవ్వలేదు అంటారేంటని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల అప్పగింతపై..

పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర నోటిఫికేషన్‌లో ఏపీ కొన్ని మార్పులను కోరిందని, ఆ సవరణలు చేశాకే ప్రాజెక్టుల అప్పగింతపై తాము చర్యలు తీసుకుంటామని ఏపీ అధికారులు చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. మా రాష్ట్రంలో ఉన్నవన్నీ మేం నిర్వహించుకునే ప్రాజెక్టులే. వాటిని బోర్డుకు అప్పగించాల్సిన అవసరం లేదు. ఆ మేరకు కేంద్ర నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని కోరాం. అదే సమయంలో తెలంగాణలో ఉన్నవి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటి నిర్వహణ తీరు వల్ల దిగువనున్న ఏపీ నష్టపోతుంది. అందువల్ల ఆ ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించాల్సి ఉంటుంది’ అని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

ఏపీ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగం తదితర సమాచారం బోర్డుకు సమర్పించేందుకు తాము సిద్ధమన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు గతేడాది వరదల్లో ధ్వంసమైనందున రూ.15 కోట్లతో మరమ్మతులు చేయాల్సి ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. కొందరు అధికారులు ఏపీకి వస్తే చర్చించుకుని వచ్చే రెండు నెలల్లో ఎంత మేర పనులు చేయవచ్చో తేలుద్దామని ఏపీ ప్రతినిధులు ప్రతిపాదించారు. పెద్దవాగు ప్రాజెక్టు, కాలువల ఆధునికీకరణపైనా దృష్టి పెట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టు కింద ఏపీ ఆయకట్టు ఎక్కువగా ఉందన్నారు.

Tags :
Published : 08 Apr 2025 06:13 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు