పునరావాసానికి అడుగులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 23 Jun 2025 06:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

త్వరలో ‘పోలవరం’ నిర్వాసితులకు ప్యాకేజీ
తొలిదశలో 38,060 కుటుంబాల తరలింపు
2,300 కుటుంబాలకు రూ.150 కోట్లు
పునరావాస కాలనీల కోసం టెండర్లు
భూమికి భూమి ఇచ్చేందుకు 13 వేల ఎకరాల గుర్తింపు
ఈనాడు - అమరావతి 

గోకవరం మండలం సూదికొండలో భూములను ఇటీవల నిర్వాసితులకు చూపిస్తున్న అధికారులు 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. పునరావాసం తొలిదశను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమాలపై పూర్తిగా చీకట్లు కమ్మేశాయి. ఒక్క కాలనీ కూడా నిర్మించలేదు. ఒక్క నిర్వాసిత కుటుంబానికీ నిధులు ఇవ్వలేదు. ప్యాకేజీ పెంచి చెల్లిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. ఇదే రీతిలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది జనవరిలో 5,000 నిర్వాసిత కుటుంబాలకు రూ.996.47 కోట్లు చెల్లించిన ప్రభుత్వం, మరో 2,300 కుటుంబాలకు రూ.150 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటు ప్యాకేజీ నిధులు అందించడం, భూమికి భూమి ఇవ్వడం, పునరావాస కాలనీల నిర్మాణాలు పూర్తి చేసి ఆయా కుటుంబాలను తరలించడం..ఇవన్నీ సమాంతరంగా సాగాలనే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయి. తొలిదశలో 38,060 కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు దశల్లో చేపట్టేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశల్లో చేపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం తొలిదశలోనే పూర్తి చేసినా ప్రత్యేకంగా పునరావాసం మాత్రం రెండు దశలకు విస్తరించింది. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెడతారు. ఈ క్రమంలో ఆ మేరకు ఎన్ని గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయో అంతవరకు తొలిదశ పునరావాసంగా అంచనాలు వేసి పనులు చేస్తున్నారు. నిజానికి తొలిదశలో 21,890 కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని తొలుత అంచనా వేశారు. 2022లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకముందే, కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్లే మరిన్ని గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో తొలిదశలో నీళ్లను నిలబెట్టే స్థాయికి మరో 16,170 కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని లెక్కలు సిద్ధం చేశారు. ఇప్పుడు తొలిదశ పునరావాసాన్ని రెండు భాగాలుగా చేపట్టారు. 1ఏలో 21,890 కుటుంబాలు, 1బిలో 16,170 కుటుంబాల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.

12 వేల ఎకరాల గుర్తింపు

తొలిదశలో భూ సేకరణ ప్రక్రియ ఇంకా సాగుతోంది. ఇప్పటికే 86,981 ఎకరాల భూమి సేకరించగా ఇంకా 13,117.95 ఎకరాలు సేకరించాల్సి ఉంది. నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకున్న నిర్వాసితులకు కాలనీలు నిర్మించి ఇవ్వాలి. ఇందుకు కూడా భూమి అవసరం. ఈ నేపథ్యంలో అధికారులు దాదాపు 12 వేల ఎకరాలను సేకరించేందుకు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గోదావరికి రెండువైపులా ఉన్న 60, 70 గ్రామాల్లో ఈ భూములు గుర్తించారు. నిర్వాసిత కుటుంబాలకు చెందిన పెద్దలను తీసుకువెళ్లి ఆ భూములు చూపిస్తున్నారు.

49 గ్రామాల్లో గ్రామసభలు పూర్తి

పోలవరం పునరావాసంలో భాగంగా మరో 49 గ్రామాల్లో ఈ ఏడాది కాలంలో గ్రామసభలు పూర్తి చేశారు. ప్యాకేజీ చెల్లించేందుకు వీలుగా అవార్డు సిద్ధం చేశారు. దాదాపు 2,300 కుటుంబాలకు రూ.150 కోట్లు చెల్లించనున్నారు. మరో వైపు పునరావాస కాలనీల్లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పాత గుత్తేదారులకు పెండింగులో ఉన్న రూ.200 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు చేపట్టిన కాలనీల పనుల కోసం కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలను రద్దు చేసి మళ్లీ ఆ పనుల విలువ లెక్కించి టెండర్లు ఆహ్వానిస్తారు. పోలవరం పునరావాసం కోసం 50 కాలనీల్లో 11,654 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రూ.1,618.58 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టగా ఇందులో రూ.1,190 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు తాజాగా కొత్త ధరలతో చేపట్టేందుకు రూ.920.90 కోట్లు ఖర్చవుతుంది. త్వరలో టెండర్లు పిలవనున్నారు.

Tags :
Published : 23 Jun 2025 03:27 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు