Polavaram: డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో త్రీడీ చిత్రీకరణ అవసరం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 06 May 2025 06:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విదేశీ నిపుణుల బృందం సూచన
బట్రస్‌ డ్యాం పనులపై సంతృప్తి

డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న విదేశీ నిపుణులు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పోలవరం: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ నిర్మాణ నాణ్యత, ఇందుకు చేపట్టిన పరీక్షలు, వాటి ఫలితాలపై విదేశీ నిపుణుల బృందం దృష్టి సారించింది. ఈ ప్యానళ్లు దింపే క్రమంలో త్రీడీ దృశ్యాలను చిత్రీకరించే పరికరాలు వాడాలని సూచించింది. విదేశీ నిపుణులు ఛార్లెస్‌ రిచర్డ్‌ డొన్నెల్లీ, డగ్లస్‌ హించ్‌బెర్గర్, బ్రియాన్‌ పాల్, డి.సిస్కోలు సోమవారం పోలవరం వచ్చారు. వీరు తొలుత కేంద్ర జల సంఘం, జలవనరులశాఖ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత బట్రస్‌ డ్యాం, గ్యాప్‌-1లో జి-డి కొండల మధ్య చేపడుతున్న పనులు, అక్కడి ఫొటో ప్రదర్శనను పరిశీలించారు.

డయాఫ్రం వాల్‌ నిర్మాణ ప్రదేశానికి చేరుకుని, భూమి పటిష్ఠత, పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వేసిన ప్యానళ్లు, ప్రయోగశాలలో చేస్తున్న పరీక్షలు, వాటి నివేదికలను సమగ్రంగా పరిశీలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రాజెక్టు వద్దే సమావేశమయ్యారు. డయాఫ్రం వాల్‌ మెథడాలజీపై గతంలోనే వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తగా ఆయా అంశాలపై పోలవరం అధికారులు కె.నరసింహమూర్తి, ఆఫ్రి, బావర్‌ కంపెనీ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ప్యానళ్లు నిటారుగా కిందకు వెళుతున్నాయా, ఒక ప్యానల్‌కు మరో ప్యానల్‌ అనుసంధానం ఎలా ఉంది, అవి సవ్యంగా ఉన్నాయా అనే అంశాలు స్పష్టంగా తెలియాలంటే త్రీడీ నమూనాను చిత్రీకరించే యంత్రపరికరాలు వాడాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. 

కొండల జియాలజీపై చర్చ

పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద నిర్మిస్తున్న బట్రస్‌ డ్యాం నిర్మాణ పనులపై విదేశీ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్‌ పనులను పర్యవేక్షించే క్రమంలో బావర్‌ కంపెనీ అభ్యంతరాలపై కొంత చర్చ జరిగింది. రాయి తగిలిన తర్వాత ప్యానళ్లను 2 మీటర్ల లోపలకు తీసుకువెళ్లాలని సంబంధిత కేంద్ర సంస్థ నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ప్రతినిధులు మాత్రం గట్టి రాయి తగలకముందే తేలిక రాయి నుంచి 2 మీటర్లు లెక్కిస్తున్నారని అన్నారు. గ్యాప్‌ 2 ప్రధాన డ్యాం, గ్యాప్‌ ప్రధాన డ్యాం చివర్లో ఉన్న కొండల జియాలజీపై చర్చ జరిగింది. ఆ ప్రాంతాన్ని నిపుణులు పరిశీలించారు. పీపీఏ కార్యదర్శి ఎం.రఘురామ్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జలసంఘం అధికారులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

డయాఫ్రంవాల్‌ నిర్మాణంలో ఉపయోగించేందుకు జర్మనీ నుంచి తీసుకొచ్చిన విడిభాగాలతో మూడో కట్టర్‌ బిగింపు పనులను సోమవారం ప్రారంభించారు. 

Tags :
Published : 06 May 2025 04:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు