Bhanakacherla: పోలవరం రెండో దశ తర్వాతే.. ‘బనకచర్ల’పై ఆలోచించగలం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 11 Jul 2025 05:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కేంద్ర జల సంఘానికి నివేదించిన పోలవరం అథారిటీ 

ఈనాడు, అమరావతి: ‘పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టదలచిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌లో మార్పులు చేయాలి. ప్రస్తుత డీపీఆర్‌ ఆమోదానికి భిన్నంగా ఉన్న అంశాలనూ అందులో చేర్చి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటిని నిల్వ చేసేలా కేంద్రం మంత్రిమండలి సమావేశంలో రూ.30,436.95 కోట్లకు ఆమోదించింది. ప్రాజెక్టు తొలిదశతోనే పోలవరం పూర్తి లక్ష్యాలు నెరవేరవు. ఈ ప్రాజెక్టులో +45.72 మీటర్ల స్థాయికి రెండో దశలో నీటిని నిల్వ చేశాకే పోలవరం-బనకచర్ల అనుసంధానం అంశాన్ని ఆలోచించగలం’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేర్కొంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రీ ఫీజిబులిటీ నివేదికపై అథారిటీ తన అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి తెలియజేసింది. ఈ మేరకు అథారిటీ డైరెక్టర్‌ మన్ను జి ఉపాధ్యాయ కేంద్ర జలసంఘానికి లేఖ రాశారు. 


‘బనకచర్ల’ ప్రీ ఫీజిబులిటీ నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్రానికి లేఖ

ఈనాడు, అమరావతి: పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రీ ఫీజిబులిటీ నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ తన అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి తెలియజేస్తూ లేఖ రాసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి..

2009లో అనుమతి పొందిన పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రకారం.. 449.78 టీఎంసీల నీటి వినియోగానికి ఆమోదం దక్కింది. పోలవరం కుడి ప్రధాన కాలువ 11,654 క్యూసెక్కులకు, ఎడమ ప్రధాన కాలువ 8,123 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి అనుమతిస్తే రెండు కాలువలూ 17,560 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక తాడిపూడి ఎత్తిపోతల, ఆ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పోలవరంలో భాగమవుతాయి.

ఈ నదీ పరీవాహక ప్రాంత రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా రూపొందిన 1980 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. తాజా పోలవరం-బనకచర్ల అనుసంధానం పీఎఫ్‌ఆర్‌ ప్రకారం... ప్రతి ఏటా 200 టీఎంసీల వరద జలాలు మళ్లించి 7.41 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తారు. 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తారు. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా కొత్త వరద కాలువను 18వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వుతారు. కుడి కాలువకు, ఈ వరద కాలువకు 166.50 కి.మీ. మేర ఒకే గట్టు ఉంటుంది. తాడిపూడి కాలువ 40 కి.మీ. మేర ఇందులో అనుసంధానమవుతుంది. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలు ఇవీ..

  • కొత్త అనుసంధానం ప్రాజెక్టు పోలవరం డీపీఆర్‌లో భాగం కాదు. పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపును కూలంకషంగా అధ్యయనం చేయాలి. అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని? అంతర్రాష్ట్ర వివాదాలేంటి? ట్రైబ్యునల్‌ అవార్డులను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రాజెక్టును అధ్యయనం చేయాలి. పోలవరం ప్రాజెక్టు ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు అన్నీ నెరవేరతాయా లేదా అన్నదీ పరిశీలించాలి.
  • తాడిపూడి ఎత్తిపోతల కాలువల ద్వారా 83,607 హెక్టార్ల ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లు, 130 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తాడిపూడి వ్యవస్థ అందులో అంతర్భాగమవుతుంది. ఈ నేపథ్యంలో తాడిపూడి, పోలవరం కుడి కాలువలు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేయాలి. 
  • 1980 అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్‌ షెడ్యూలు నిర్ణయించారు. తాజాగా పోలవరం నుంచి 200 టీఎంసీలు మళ్లించే క్రమంలో ఆ ఆపరేషన్‌ షెడ్యూలును తిరిగి పరిశీలించాలి.
Tags :
Published : 11 Jul 2025 05:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు