AP News: వైకాపావి అసత్య ప్రచారాలు.. ఇవిగో వాస్తవాలు

పీఆర్సీలో జీతభత్యాలు తగ్గడంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని.. రాజకీయ పార్టీలో.. మరొకరో తమను ప్రభావితం చేయలేదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష,

Updated : 10 Aug 2022 15:16 IST

ఉద్యోగుల్లో కడుపుమంట రగిలే ఆందోళన బాటపట్టారు

పీఆర్సీలో వేతనాలు తగ్గడంపై ఎక్కడైనా వివరిస్తాం

వైకాపా లేఖపై ఏపీటీఎఫ్‌ వివరణ

ఈనాడు, అమరావతి: పీఆర్సీలో జీతభత్యాలు తగ్గడంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని.. రాజకీయ పార్టీలో.. మరొకరో తమను ప్రభావితం చేయలేదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఆందోళనలను పక్కదారి పట్టించేలా వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖ ఉందని విమర్శించారు. అందులోనివన్నీ అసత్యాలేనంటూ ప్రశ్నల వారీగా వైకాపా వాదన.. తమ సమాధానాలను విడుదల చేశారు. వాటి సారాంశం ఇలా..

కొత్త జీతాలు మాకొద్దు.. ఇప్పుడున్నవే కొనసాగించండి

వైకాపా వాదన: కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవం.. రూ.10వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.

ఏపీటీఎఫ్‌ స్పందన:   కొత్త జీతాలు మాకొద్దు. ప్రస్తుత జీతాలు, భత్యాలు కొనసాగించాలని లక్షల మంది కలెక్టరేట్ల ముందు నినదించారు. కొత్త పీఆర్సీతో జీతభత్యాల్లో విధించిన కోతలను ఏ ప్రజావేదిక మీదైనా వివరించగలం. అబద్ధపు ప్రచారాలు ఆపండి.

కారుణ్య నియామకాల్లోనూ వివక్షేనా?

వై: కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి జూన్‌ 30లోగా నియామకాలు

ఏ: నియామకాలు అడిగింది ప్రాణాలు కోల్పోయిన అందరికీ. మీరు మరణంలోనూ వివక్ష చూపి కేవలం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అదీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తున్నారు. షరతులకు లోబడి కారుణ్య నియామకాల ఉత్తర్వులు దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయి. సంపాదనపరులు మరణించి కుటుంబాలు కకావికలం అయ్యాయి. కరుణ చూపండి, ఉత్తర్వులు వేగంగా అమలు చేయాలనే డిమాండును ఇలా కుదించారు.

రూ.20 లక్షలకు పెంచాల్సిన గ్రాట్యుటీని రూ.16 లక్షలు చేశారు

వై: గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం

ఏ: ఇది సీలింగ్‌ పరిమితి. పెంచాల్సింది రూ.20 లక్షలకు. సవరించిన వేతనాలతో ప్రతి ఉద్యోగి సగటున రూ.2-4లక్షలు పొగొట్టుకుంటున్నారు. ఈ ఉత్తర్వులను జనవరి 17 నుంచి వర్తింపచేస్తామనడం మూడున్నరేళ్లుగా పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను నష్టపర్చడమే.

పదవీ విరమణ వయస్సు పెంచి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

వై: దేశంలో ఎక్కడాలేని విధంగా పదవీవిరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం.

ఏ: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం అందించే వరంగా భావించడం లేదు.

విలీనంతో ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలెలా మెరుగుపడ్డాయి?

వై: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపాం.

ఏ: కార్పొరేషన్‌ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు, రాయితీలు వారు పొందుతున్నారా? కార్పొరేషన్‌లో ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించగలరా?

మమ్మల్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేదు

వై: ప్రతిపక్ష నాయకుడు, వారి అనుకూల పత్రికలకు అమ్ముడుపోయారు.

ఏ: ఇది నిందా ప్రచారం. రాజకీయ పక్షాలో, మరొకరో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ప్రభుత్వాన్ని విశ్వసించాం. విశ్వాసాన్ని దెబ్బతీసేలా జీతభత్యాల కోత ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవాలు గమనించండి. నిందలు ఆపండి. ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీనీ అనుమతించకూడదని, వ్యక్తిగత రాజకీయ విశ్వాసాలకు దూరంగా ఉండాలని కమిటీ చేసిన తీర్మానమే ఇందుకు నిదర్శనం.

హక్కుల్నిహరించే చర్యలనే ఎత్తిచూపుతున్నాం

వై: ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు.

ఏ: విమర్శే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల హక్కులను హరించే చర్యలను ఎత్తి చూపుతున్నాం, విమర్శిస్తున్నాం. సరిచేసుకోవాలని విన్నవిస్తున్నాం. ఇది మా బాధ్యత.

సీఎం అంటే గౌరవమే.. అన్యాయాలపైనే పోరాటం

వై: సీఎంను దూషించడం సరికాదు.

ఏ: మేం సీఎం పట్ల గౌరవభావంతో ఉన్నాం. వ్యక్తిగతంగా దూషించే కుసంస్కారులం కాదు. వ్యవస్థీకృతంగా ప్రభుత్వం చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఆ పాటి సంయమనం, విచక్షణ మేం పాటిస్తున్నాం.

నమ్మించి మోసం చేసినందుకే ఆగ్రహం

వై: సంఘాల నాయకులు ఉద్యోగులను పెడదోవ పట్టించారు.

ఏ: జీతభత్యాల్లో కోత ఒక వైపు.. ధరల పెరుగుదల మరోవైపు ఉద్యోగుల్లో కడుపు మంటను రగిల్చాయి. ప్రభుత్వం నమ్మించి మోసపూరితంగా వ్యవహరించిందనే ఆవేదన ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. కలెక్టరేట్ల దిగ్బంధంలో నాయకత్వాన్ని అరెస్టు చేసినా లక్షల మంది ఎవరికి వారుగా పోరాటంలోకి వచ్చారు. నాయకుల నుంచి ఉద్యోగులను విడదీసే మీ ఎత్తుగడలను మేం అర్థం చేసుకోగలం. ఉద్యోగులు సరైన దారిలోనే ఉన్నారు.

పీఆర్సీ ఉత్తర్వులే మంటలు రేపాయి

వై: నాయకుల మాటలు విని ఆందోళనలు చేస్తే దెబ్బతినేది ఉద్యోగులే.

ఏ: ఇది బెదిరింపు. ప్రభుత్వం ఈ నెల 17న విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులే మంటలు రేపాయి. ఆ ఉత్తర్వులను రద్దు చేసి, ఉన్న హక్కులను పునరుద్ధరించి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాల్లో తగు పెంపుదలనిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడే వారి ఆగ్రహ జ్వాలలు చల్లారతాయి. కొత్తగా దెబ్బతినేది ఏమీ ఉండదు. ఇలాంటి దుష్ప్రచారాలు సత్ఫలితాలు ఇవ్వవని మనవి చేస్తున్నాం.

ప్రభుత్వ రాబడి పెరిగిందని కాగ్‌ చెబుతోంది కదా?

వై: విభజన సమస్యలు, కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గింది.

ఏ: విభజన సమస్యలున్న కాలంలో 2015లో 43% ఫిట్‌మెంట్‌ పొందాం. ప్రస్తుతం విభజన సమస్యలన్నీ సర్దుకున్నాయి. ప్రస్తుతం ఆదాయం పెరిగిందని కాగ్‌ గణాంకాలే చెబుతున్నాయి. తాత్కాలికంగా నిధులు సర్దుబాటు కాకపోతే బకాయిలను పీఎఫ్‌లో కలపడమో, కొంత కాలానికి వాయిదా వేయడమో జరిగేది. కానీ, జీతభత్యాలు తగ్గించి, ఐఆర్‌ రూపంలో ఇచ్చిన దాన్ని డీఏల నుంచి రికవరీ చేస్తున్నారు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న మాకు ఇది గుండె కోత కాదా?

ఇళ్లస్థలాలు సంక్షేమమా? స్థిరాస్తి వ్యాపారమా?

వై: జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో 10% స్థలాలు కేటాయించాం. 20% రాయితీపై అందిస్తున్నాం.

ఏ: స్థలాల కేటాయింపు, రాయితీలను ఎవరూ అడగలేదు. ఇందులో సంక్షేమం కంటే వ్యాపారమే ప్రధానంగా ఉందనే విషయం స్పష్టం. రాయితీ రూపంలో రూ.10 లక్షల లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. స్థలం ఖరీదు 50 లక్షలా? సగటు ఉద్యోగి కొనగలరా? ఇది సంక్షేమమా? స్థిరాస్తి వ్యాపారమా? ఉద్యోగులు సొసైటీగా ఉండి కోరితే సరసమైన ధరకు స్థలాల కేటాయింపు ఏమైనట్లు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని