ఇప్పుడు ఎలాంటి ఇళ్లు కొంటున్నారంటే..

హరిత భవనాలు..ఆధునిక జీవనశైలికి చిరునామాలు..నివాసాల నిర్మాణం దగ్గరి నుంచి అందులో జీవనం వరకు సుస్థిర విధానాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే పోకడలు..

Updated : 11 May 2024 07:22 IST

హైదరాబాద్‌లో గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టుల్లో ఏటా పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌: హరిత భవనాలు..ఆధునిక జీవనశైలికి చిరునామాలు..నివాసాల నిర్మాణం దగ్గరి నుంచి అందులో జీవనం వరకు సుస్థిర విధానాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే పోకడలు.. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేలా సహజ సిద్ధంగా గాలి, వెలుతురు ఉండేలా డిజైన్‌.. నీటిని  పొదుపుగా వాడుకునేలా పరికరాలు..వ్యర్థాల నిర్వహణ వరకు హరిత భవనాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫలితంగా గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టుల్లో ఏటా పురోగతి కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే వంద ప్రాజెక్టులు పెరిగాయని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) చెబుతోంది. దేశంలోని నగరాలతో పోలిస్తే మనం మూడో స్థానంలో ఉన్నామని తెలిపింది. ఐజీబీసీ ప్రముఖులు ఏమంటున్నారంటే...

వచ్చే పదేళ్లలో  రెండుమూడింతలు

హరిత నిర్మాణాల ఉద్యమానికి బిల్డర్‌ కమ్యూనిటీ అమూల్యమైన సహకారం అందించింది. వారి మద్దతుతో 20 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించాం. ఒకసారి ఐజీబీసీ రేటింగ్‌ పొందితే బిల్డర్లు మళ్లీ వెనక్కి తిరిగి చూడటం లేదు. తదుపరి ప్రాజెక్టులన్నీ హరిత ప్రాజెక్టులుగా చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ 60కిపైగా బిల్డర్లు హరిత ప్రాజెక్టులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే ఇప్పుడున్న 11.67 బిలియన్‌ చ.అ. హరిత నిర్మాణాలు వచ్చే పదేళ్లలో రెండుమూడింతలు పెరిగే అవకాశం ఉంది. ప్రజల్లో మరింతగా అవగాహన తీసుకొచ్చేందుకు ప్రముఖులతో ప్రచారం చేయించే ఆలోచన చేస్తున్నాం. నిర్మాణ సంఘాలతోనే కలిసి పనిచేస్తున్నాం. క్రెడాయ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2030 నాటికి 4 వేల హరిత గృహ నిర్మాణ ప్రాజెక్టులు రాబోతున్నాయి.

సి.శేఖర్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, ఐజీబీసీ


పర్యావరణ స్పృహ పెరిగింది

20 ఏళ్ల కిందట హరిత నిర్మాణాలు మొదలెట్టినప్పుడు అప్పుడది ఛాయిస్‌. ఇప్పుడు తప్పదు అనే అవగాహన ప్రజల్లో వచ్చింది. భూతాపం పెరగడంతో పర్యావరణ పరంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అనుభవిస్తున్న పరిస్థితులతో.. మరింత నష్టం చేయకుండా నిర్మాణాలను డిజైన్‌ చేసుకోవాలనే స్పృహతో ఉన్నారు. అర్కిటెక్చర్ల వద్దకు వచ్చి గ్రీన్‌హోమ్‌ డిజైన్‌ చేయగలరా..? లేదా ..? అని ఆరా తీస్తున్నారు. గ్రీన్‌ ప్రాజెక్టు డిజైన్‌ కావాలని అడుగుతున్నారు. ఆరోగ్యకర జీవనశైలి కోసం పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులు, సంస్థలు వీటినే ఎంపిక చేసుకుంటున్నాయి.

శ్రీనివాసమూర్తి, కోఛైర్మన్‌, ఐజీబీసీ హైదరాబాద్‌ ఛాప్టర్‌


నిర్మాణ వ్యయం రెండు శాతమే అధికం

హరిత భవనాలు అంటే నిర్మాణ సమయంలో, ఆ తర్వాత వినియోగంలోకి వచ్చాక నీరు, విద్యుత్తు ఆదా చేయడంతో పాటూ వ్యర్థాలను తగ్గించడం ప్రాధాన్యంగా ఉంటుంది. హరిత భవనాల్లో విద్యుత్తు 20-30 శాతం దాకా, నీరు 40-50శాతం దాకా ఆదా చేసుకోవచ్చు. సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగాన్ని బట్టి వ్యక్తిగతఇల్లు మొదలు అపార్ట్‌మెంట్లు, కార్యాలయ భవనాల వరకు 32రకాల రేటింగ్‌లు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకుంటుంటే.. సిమెంట్‌, స్టీల్‌ ఇలా ప్రతిదీ హరిత ఉత్పత్తులు ఉన్నాయి. గ్రీన్‌ పో పేరుతో 9వేల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. ఈ నెల 17-19 వరకు హైటెక్స్‌లో జరిగే గ్రీన్‌ ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌లోనూ వీటి గురించి తెలుసుకోవచ్చు. సంప్రదాయ నిర్మాణాలతో పోలిస్తే హరిత నిర్మాణాల వ్యయం 2 శాతమే అధికం.

ఆనంద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐజీబీసీTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని