Engineering Admissions: ఇంజినీరింగ్‌లో సీట్ల పరిమితి ఎత్తివేత

రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లు భారీగా పెరగనున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేయడంతో కళాశాలల యాజమాన్యాలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి.

Updated : 25 May 2024 08:06 IST

ఇప్పటి వరకు ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 240
ఈ సీలింగ్‌ను తొలగించిన ఏఐసీటీఈ
మౌలికసదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు సెక్షన్ల మంజూరు
ఈ విద్యా సంవత్సరంలో సీట్లు పెరిగే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్‌ సీట్లు భారీగా పెరగనున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేయడంతో కళాశాలల యాజమాన్యాలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలికసదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుండటంతో చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి. కొన్ని కళాశాలలకు ఇప్పటికే అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం ఒక బ్రాంచిలో గరిష్ఠంగా 240 సీట్లకే పరిమితి ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది. స్థూల ప్రవేశాల నిష్పత్తి పెంచడం, డిమాండ్, సీట్ల మధ్య అసమతుల్యతను తగ్గించడం పేరుతో జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా ఇంజినీరింగ్‌లో అదనపు సీట్లకు ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. రాష్ట్రానికి చెందిన చాలా కళాశాలలు మూడు నుంచి ఆరు సెక్షన్లు పెంచుకునేందుకు దరఖాస్తులు చేశాయి. మౌలికసదుపాయాల పరిశీలనను ఏఐసీటీఈ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విధానాల్లో చేసేస్తోంది. కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) బ్రాంచికి డిమాండ్‌ అధికంగా ఉండడంతో కళాశాలలన్నీ  దాదాపుగా ఇందులోనే అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేశాయి. కొన్ని సీఎస్‌ఈతోపాటు ఈసీఈకి అనుమతులు తీసుకుంటున్నాయి.

నాణ్యతలేని కళాశాలలు మూతే..

రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్‌లో భారీగా సీట్లు ఉన్నాయి. ప్రైవేటు వర్సిటీలు ఒక్క సీఎస్‌ఈ, ఏఐ, మెషీన్‌లెర్నింగ్‌ డేటాసైన్సులాంటి వాటిల్లో 1600 నుంచి 2వేల వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. విజయవాడ సమీపంలో ఓ డీమ్డ్‌ వర్సిటీలో ఇంజినీరింగ్‌లో 3,800 సీట్లు ఉంటే ఇందులో 1,800 సీఎస్‌ఈ, ఏఐ, ఎంఎల్‌లాంటి వాటిల్లోనే ఉన్నాయి. మిగతా డీమ్డ్‌ వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వయంప్రతిపత్తి, ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ సీట్లు భారీగా పెరిగితే నాణ్యత లేని కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు మంచి కళాశాలలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. 

  • గతేడాది ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో 1,21,997 సీట్లు ఉంటే 94,407 భర్తీ అయ్యాయి. వీటికి 30% యాజమాన్య కోటా అదనంగా ఉంటుంది. ఈసారి ఏఐసీటీఈ అదనపు సెక్షన్లు ఇస్తున్నందున కన్వీనర్‌ కోటా సీట్లు మరింత పెరగనున్నాయి. 2022లో కన్వీనర్‌ కోటా కింద 1,12,696 సీట్లు ఉండగా.. 92,661మంది ప్రవేశాలు పొందారు. 
  • స్వయంప్రతిపత్తి కళాశాలలు డీమ్డ్‌ వర్సిటీలుగా మారేందుకు ఏఐసీఈటీ అనుమతులు ఇస్తోంది. ఎన్‌ఈపీ-2020 ప్రకారం కళాశాలలు స్వయంగా సర్టిఫికెట్లను ప్రదానం చేసే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో అనుమతులు విరివిగా ఇస్తోంది. రాష్ట్రం నుంచి ఇటీవల వీఆర్‌ సిద్ధార్థకు డీమ్డ్‌ టుబీ వర్సిటీ హోదా లభించింది. మరికొన్ని కళాశాలలు ఇప్పటికే దరఖాస్తు చేశాయి. వీటికి త్వరలో అనుమతులు లభించే అవకాశం ఉంది. డీమ్డ్‌ వర్సిటీలుగా మారితే మౌలికసదుపాయాల ఆధారంగా భారీగా ఇంజినీరింగ్‌ సీట్లు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. 

ఎమర్జింగ్‌ కోర్సుల్లోనూ..

ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు ఎమర్జింగ్‌ కోర్సుల్లోనూ సీట్లు పెంచుకుంటున్నాయి. కృత్రిమమేధ, మెషీన్‌లెర్నింగ్, డేటాసైన్సు, సైబర్‌ సెక్యూరిటీలాంటి వాటిల్లోనూ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎమర్జింగ్‌ కోర్సుల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉండటం, విద్యార్థుల నుంచి డిమాండ్‌ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు సీఎస్‌ఈలో వీటిని తీసుకొచ్చాయి. కొన్ని కళాశాలలు సీఎస్‌ఈలో కాకుండా నేరుగా కృత్రిమమేధ-మెషీన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కృత్రిమమేధ, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమమేధ- డేటాసైన్సులాంటి బ్రాంచిలను తీసుకొచ్చాయి. 

  • రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూడు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రైవేటు వర్సిటీలుగా మారేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రైవేటు వర్సిటీల నిబంధనల ప్రకారం సీట్లు భర్తీ చేయనున్నాయి. మౌలికసదుపాయాలు, విద్యార్థుల నుంచి వచ్చే డిమాండ్‌ ఆధారంగా సీట్లు పెంచుకుంటున్నాయి. కొత్తగా ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. 
  • గతంలో బీబీఏ, బీసీఏలాంటి కోర్సులు యూజీసీ పరిధిలో ఉండగా.. ఇప్పుడు వీటిని ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో చాలా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ కోర్సుల అనుమతుల కోసం సైతం దరఖాస్తు చేశాయి. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంసీఏతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల వైపు వెళ్లేందుకు అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. కొన్ని కళాశాలలు ఎంసీఏలో సెక్షన్లు పెంచుకుంటున్నాయి. 
  • ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీఏ చేసే విద్యార్థుల సంఖ్య అధికమవుతున్నందున కొన్ని కళాశాలలు ఆ సీట్లను ఈ ఏడాది పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని