Andhra Pradesh News: పోలీసులు కాదు.. గులాములే

వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్‌ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం   క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 18 May 2024 05:36 IST

వైకాపా నేతలు చెబితే దేనికైనా వారు సిద్ధమే
ఎన్నికల్లో అరాచకాలకు అండగా ఉన్నారు
వారిని తొలగిస్తేనే శాఖకు మంచిదంటున్న నిపుణులు

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలింగ్‌ రోజున పెట్రోలు బాంబుల దాడితో దగ్ధమవుతున్న దుకాణాలు

ఈనాడు, నరసరావుపేట: వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్‌ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. సస్పెండైన ఈ ఆరుగురు అధికారులే కాకుండా పల్నాడు జిల్లా పరిధిలో వైకాపా తొత్తుల్లా పనిచేస్తున్న అధికారులందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. పోలీసుశాఖలో పాగావేసిన ఆ వైకాపా వేళ్లనూ కూకటివేళ్లతో పెకిలిస్తేనే.. ఇక్కడ అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనే మాట బలంగా వినిపిస్తోంది.

వైకాపా దాడులకు సహకరించిన డీఎస్పీలు పల్లంరాజు, వర్మ

గురజాల డీఎస్పీ పల్లంరాజు.. ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే వైకాపా అరాచక శక్తులను బైండోవర్‌ చేయకుండా అధికార పార్టీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. పోలింగ్‌ రోజున వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నా వాటిని అడ్డుకోలేదు. గురజాల సబ్‌ డివిజన్‌ పోలీసు కార్యాలయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతుంటే ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మిన్నకుండిపోయారు. మాచర్లలో అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలిసినా నియంత్రించేందుకు చర్యలు తీసుకోలేదు. నరసరావుపేట డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ.. అధికార పార్టీ దాడులకు పాల్పడుతున్నా వాటిని నియంత్రించకుండా సహకరించారు.

కె.ప్రభాకర్‌రావు, ఈ.బాలనాగిరెడ్డి.. వీరు వైకాపా వేగులు

పల్నాడు జిల్లా స్పెషల్‌ బ్రాంచి విభాగం ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్‌రావు, ఈ.బాలనాగిరెడ్డి పూర్తిగా వైకాపా బంటుల్లా విధులు నిర్వర్తించారు. అధికార పార్టీకి వేగుల్లా పనిచేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులతో సంబంధాలు నెరుపుతూ వారి అరాచకాలు, దాడులకు అన్ని విధాలుగా సహకరించారు. ఎన్నికల సందర్భంగా మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందనే సమాచారం వచ్చినా దాన్ని వీరు ఉద్దేశపూర్వకంగానే ఎస్పీకి చేరవేయలేదు. మాచర్ల, గురజాల, నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్‌ రోజున దాడులకు ప్రణాళికలు సిద్ధం చేశారనే సమాచారం ఉన్నప్పటికీ దాన్ని ఉన్నతాధికారులకు చేరవేయలేదు. హింసను అరికట్టడానికి జిల్లా ఎస్పీ బింధుమాధవ్‌ ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికప్పుడు వైకాపా వారికి వీరు చేరవేశారు. గతంలో పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్‌రెడ్డి వీరిద్దరినీ నియమించుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని కొత్త ఎస్పీకి తెలియనివ్వలేదని వినిపిస్తోంది.

పిన్నెల్లి అండదండలతో పేట్రేగిన కారంపూడి ఎస్సై

మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో రెండేళ్లుగా ఎస్సైగా పనిచేస్తున్న ఎం.రామాంజనేయులు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అండదండలతో పేట్రేగిపోయారు. తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. పోలింగ్‌ రోజున వైకాపా శ్రేణుల దాష్టీకాలకు అన్ని విధాలా సహకరించారు. ఒప్పిచర్ల గ్రామంలో ఈవీఎంలను ధ్వంసం చేసేందుకు వైకాపా నాయకులు వెళుతున్నారని సమాచారం వచ్చినా పట్టించుకోలేదు. ఈయన కనుసన్నల్లోనే కారంపూడిలో దాడులు జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు, బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ తెదేపా శ్రేణులపై దాడులకు సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. 

పేరుకు హోంగార్డు.. హద్దు లేని అరాచకాలు

మాచర్ల పక్కనే ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తి హోంగార్డుగా ఏళ్ల తరబడి మాచర్ల సర్కిళ్ల పరిధిలోనే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డికి నమ్మిన బంటు. మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని సివిల్‌ పంచాయతీల్లో తలదూర్చడం, కేసులు నమోదు అయిన వారిని స్టేషన్‌కు పిలిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బూతులు తిడుతూ నిందితులను విచక్షణారహితంగా కొడతారనే పేరుంది. డబ్బు వసూళ్లతోపాటు, వివిధ పనులపై స్టేషన్‌కు వచ్చేవారి సమాచారం ఎమ్మెల్యే సోదరుడికి చేరవేస్తారు. మాముళ్లు వసూలు చేయడమే కాకుండా సర్కిల్‌ పరిధిలో ఎస్సైలపై ఎమ్మెల్యే సోదరుడి పేరుతో పెత్తనం చేయడం ఇతని ప్రత్యేకత. అధికారపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆర్యవైశ్య సంఘం నాయకుడి ఇంటికెళ్లి లాఠీలతో కొడుతూ దీనిని సెల్‌ఫోన్‌లో ఎమ్మెల్యే సోదరుడికి చూపిస్తూ గురుభక్తి చాటుకున్నట్లు ఆరోపణలున్నాయి.

అక్రమాలకు భరోసాగా.. 

ఏపీ సరిహద్దు పోలీస్‌స్టేషన్‌ నాగార్జునసాగర్‌లో ఎన్నికల ముందు వరకు విధులు నిర్వహించిన ఎస్సై అక్రమాలకు అంతులేదు. ఇక్కడి నుంచి ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్లి గురజాల సబ్‌డివిజన్‌ పరిధిలో సమాచార సేకరణలో కీలకమైన విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎస్సై ఎమ్మెల్యే సోదరులకు పూర్తిస్థాయిలో కొమ్ముకాశారు. ఇప్పటికీ ఎమ్మెల్యే సోదరులకు అనుకూలంగా ఏపనైనా చేస్తుంటారు. సరిహద్దు ప్రాంతం స్టేషన్‌ ఎస్సై కావడంతో అక్రమ మద్యంతోపాటు, ఇతర అక్రమ రవాణాకు సానుకూలంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు నమోదుచేయడంలో ముందుంటారు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా మాచర్ల పరిధిలో అధికారపార్టీ ఎస్సైగానే రుబాబు చేస్తున్నారు. సమాచార సేకరణలో కీలకమైన విభాగంలో ఉంటూ పోలింగ్‌ వేళ వైకాపాకు అవసరమైన సమాచారం అందించారు. 

కానిస్టేబుల్‌ అయినా ఆయనదే హవా

ఫ్యాక్షన్‌ గొడవలు, ఘర్షణలు, దాడులకు నిలయమైన ఓమండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ పనితీరు అత్యంత వివాదాస్పదం. ఎస్సైలు కూడా అతను చెప్పింది చేయాల్సిందే. పొరుగు మండలం నుంచి తాను పనిచేస్తున్న మండలానికి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు. వైకాపాకు చెందిన హత్యకేసు నిందితులకు సమీప బంధువు ఈ కానిస్టేబుల్‌. సమస్యాత్మక గ్రామాలలో తెదేపా వారిపై కేసులు బనాయించి స్వామిభక్తి చాటుకుంటున్నారు. 

ప్రతి విషయం చేరవేయడమే లక్ష్యం 

రెండేళ్లుగా మాచర్లలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై డబ్బు లేనిదే పనిచేయరు. స్టేషన్‌ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎమ్మెల్యే సోదరులకు చేరవేస్తారు. తెదేపాకు చెందిన వారు ఏ పనులపై స్టేషన్‌కు వెళ్లినా స్పందించరు. ఫిర్యాదు కూడా తీసుకోరు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నవారిని దగ్గరకు రానివ్వరు. ఏ పని చేయాలన్నా ముందు డబ్బులు చెల్లించాల్సిందే. ఎన్నికలకు ముందు పట్టణంలో గొడవలు జరిగితే అధికారపార్టీ ఆదేశాలతో తెదేపాకు చెందిన కేశవరెడ్డిపై కేసు నమోదు చేశారు. 2022 డిసెంబర్‌లో మాచర్లలో తెదేపా వారిపై వైకాపా నాయకుల దాడి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గృహదహనాలు, వాహనాల దహనం, తెదేపా కార్యాలయం తగలబెట్టి విధ్వంసం సృష్టించారు. వైకాపా వారు రహదారిపైకి మారణాయుధాలు తీసుకురావడం, గుంపులుగా చేరడాన్ని ఎస్సై గుర్తించినా సంబంధం లేదన్నట్లు వెళ్లిపోయారు.

 వైకాపా కార్యకర్తలా సీఐ

గురజాల సబ్‌డివిజన్‌ పరిధిలో పనిచేస్తున్న సీఐ ఒకరు పక్కా వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారు. పోలింగ్‌రోజున ఇరికేపల్లి గ్రామంలో వైకాపా వారు తెదేపా నేతలపై రాళ్ల దాడి చేసి, 15 ద్విచక్రవాహనాలు ధ్వంసం చేశారు. కేసానుపల్లి గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంటే అడ్డుకున్న తెదేపా నేత నెల్లూరు రామకోటయ్యపై దాడిచేసి తల పగలగొట్టారు. దాచేపల్లిలో ఓటేయడానికి వెళ్లిన రవీంద్రను ఎవరికి వేస్తున్నావని అడిగి మరీ తలపై దాడిచేశారు. తంగెడలో పోలింగ్‌ ముగిశాక, పోలింగ్‌ కేంద్రంపై పెట్రోలు బాంబులు విసురుతున్న వైకాపా నేతలను తెదేపా వర్గీయులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దుకాణాలు తగలబడ్డాయి. దాడిలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలింగ్‌ మరుసటి రోజు మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన తెదేపా వర్గీయులను ఠాణాకు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారు. 

అధికార పార్టీతో అంటకాగుతున్న ఎస్సై 

గురజాల నియోజకవర్గంలో ఎస్సై, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అధికారపార్టీతో అంటకాగుతున్నారు. పోలింగ్‌ మరుసటి రోజు కొత్తగణేశునిపాలెంలో వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్, కాసుమహేశ్‌రెడ్డి 400 మందితో దండయాత్రగా గ్రామంపైకి వచ్చినా కేసు నమోదు చేయలేదు. రాళ్లు, కర్రలతో గ్రామంలో తిరుగుతూ హల్‌చల్‌ చేసినా.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు వందలమందితో వచ్చినా.. కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. తెదేపా వారి ఇళ్లపై దాడి చేసినా పట్టించుకోలేదు. అయితే విచిత్రంగా తెదేపా వారు ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్లు విసిరారని కేసు నమోదుచేయడం పోలీసుల స్వామిభక్తికి నిదర్శనం.   

 పాత వాసనలు పోలేదు

గతంలో మాచర్ల నియోజకవర్గంలో విధులు నిర్వహించి వెళ్లిన సీఐలు, ఎస్సైలు కొందరు బందోబస్తుకు వచ్చారు. తాజాగా పోలీసుశాఖలో జరుగుతున్న పరిణామాలను కొందరు ఎమ్మెల్యే సోదరులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేకు విధేయులుగా పనిచేసిన సమయంలో ఆర్థికంగా లాభపడ్డారు. దీంతో ఎన్నికల ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేతో పని ఉంటుందని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 


స్వామిభక్తి చాటుకున్న డీవీ కొండారెడ్డి

ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్‌ ఎస్సైగా నియమితుడైన డీవీ కొండారెడ్డి  ప్రతి నిమిషం వైకాపాకు సహకరిస్తూ స్వామిభక్తి చాటుకున్నారు. మాచర్లలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లల్లో తెలంగాణ నుంచి వచ్చిన వందల మంది పాల్గొన్నట్లు పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. తెలంగాణ నుంచి వచ్చేవారిని అడ్డుకోలేకపోగా.. వారి రాకకు పరోక్షంగా కొండారెడ్డి సహకరించారు. ఈ ఎస్సై సూచనల మేరకే తెదేపా నాయకులపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశాయన్న ఫిర్యాదులున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు