AP Fibernet: ఫైబర్‌నెట్‌లో లెక్క తేలని అక్రమాలు

విజయవాడలోని ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్‌ చేసింది. సిబ్బందికి కూడా కార్యాలయంలోకి అనుమతి నిలిపేసింది. అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇబ్బంది లేకుండా సంబంధిత విభాగాల అధికారులకు ఆన్‌లైన్‌ విధానంలో ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇచ్చింది.

Updated : 11 Jun 2024 04:29 IST

రూ.950 కోట్లు రుణాలు తెచ్చినా.. సంస్థ అభివృద్ధికి వినియోగించని వైనం
సంస్థ ఎండీ మెయిల్, లాగిన్‌ ఫ్రీజ్‌ 
అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు?  

ఈనాడు - అమరావతి: విజయవాడలోని ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్‌ చేసింది. సిబ్బందికి కూడా కార్యాలయంలోకి అనుమతి నిలిపేసింది. అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇబ్బంది లేకుండా సంబంధిత విభాగాల అధికారులకు ఆన్‌లైన్‌ విధానంలో ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇచ్చింది. సంస్థ ఎండీ మధుసూదన్‌రెడ్డిని విధుల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు అప్పగించింది. వైకాపా ప్రభుత్వం కొత్త రుణాలు తీసుకోవడానికి, రాజకీయ నేతల సిఫారసుతో విచ్చలవిడిగా కాంట్రాక్టు సిబ్బంది నియామకాల కోసం ఫైబర్‌నెట్‌ను కేంద్రంగా చేసుకుంది. దీనివల్ల సంస్థ భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో ఫైబర్‌నెట్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఐదేళ్లలో 3.2 లక్షల కనెక్షన్ల కోత 

2019లో ఉన్న 9.7 లక్షలుగా ఉన్న ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు సుమారు 45 శాతం తగ్గాయి. వైకాపా ఐదేళ్ల పాలనలో వాటి సంఖ్య క్రమేణా తగ్గుతూ.. ప్రస్తుతం 6.5 లక్షలకు చేరింది. ఫైబర్‌నెట్‌ సేవల కోసం వినియోగించే ట్రిపుల్‌ ప్లే బాక్స్‌ల మరమ్మతుల కోసం తిరుపతి, విజయవాడ, విశాఖల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను వైకాపా ప్రభుత్వం తొలగించింది. దీంతో పాడైన బాక్సులను పక్కన పడేస్తున్నారు. ఈ కారణంగా సుమారు 3.2 లక్షల కనెక్షన్ల ద్వారా సంస్థకు ప్రతి నెలా వచ్చే ఆదాయం (బేసిక్‌ ప్యాకేజీ ప్రకారం లెక్కించినా) సుమారు రూ.11.20 కోట్ల వంతున ఏటా రూ.134.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సంస్థ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అదనంగా మరో 20 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికారులు ఐదేళ్లలో ప్రయత్నించలేదు. 10 లక్షల కొత్త బాక్సుల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధం చేశామంటూనే కాలం గడిపేశారు. కనీసం కొత్తగా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినా.. నెలకు రూ.35 కోట్ల చొప్పున ఏటా రూ.420 కోట్ల ఆదాయం అదనంగా వచ్చేది. సంస్థ ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నెలకు సుమారు రూ.5 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు.. ఫైబర్‌నెట్‌లో గత ఐదేళ్లలో ఏం జరిగిందని లోతుగా శోధిస్తున్నారు. 

అడ్డగోలుగా సిబ్బంది నియామకాలు 

ఫైబర్‌నెట్‌లో ఎండీతో కలిపి కేవలం ముగ్గురు మాత్రమే పూర్తి స్థాయి సిబ్బంది. నెట్‌వర్క్‌ ఇంజినీర్లుగా ప్రతి జిల్లాలో సుమారు 20 నుంచి 30 మందిని కాంట్రాక్టు విధానంలో నియమించారు. వీరే కాక పోల్‌ స్పైసర్లు, కార్యాలయ అవసరాల కోసం ఐదేళ్లలో సుమారు 1,500 మందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు సంస్థ ద్వారా చేపట్టిన సిబ్బంది నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో లెక్కలు చూపి జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. జీతాల విషయంలోనూ నిర్దిష్ట విధానాన్ని పాలించడం లేదు. నేతల సిఫారసు ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రతి నెలా జీతంగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఎంత మంది సిబ్బందిని నియమించారనే లెక్కలు అందుబాటులో లేవు. ఆ లెక్కల కోసం విజయవాడలోని కేంద్ర కార్యాలయాన్ని సీజ్‌ చేసినా.. అందులో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని అధికారులు సూచించారు. జిల్లాల్లోని కార్యాలయాల్లో అక్కడి సిబ్బంది సంతకాలు చేసేలా ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా సంస్థలో పనిచేసే సిబ్బంది ఎంత మంది ఉన్నారో లెక్కలు తేలుస్తామని, ఆ ప్రకారమే ప్రతి నెలా జీతాలు చెల్తిస్తున్నారా అనేది పోల్చి చూస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందిన తర్వాత ఏ మేరకు అక్రమాలు జరిగాయనేది గుర్తిస్తామన్నారు.


వందల కోట్ల రుణాలు.. ఏం చేశారు?

ఎన్నికలకు ముందు ఫైబర్‌నెట్‌ పేరిట రూ.600 కోట్లు రుణాలు తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థ పేరిట రుణాలు తీసుకుని సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణకు అత్యవసరంగా ఖర్చు చేయడంపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తాన్ని గుత్తేదారులకు దోచిపెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు సంస్థ నిర్వహణ కోసం తీసుకున్న రూ.350 కోట్ల రుణాన్ని కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు తెలిసింది. వీటిన్నింటిపై విచారణ చేపడితే భారీ అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆ మేరకు ఉత్తర్వులు వస్తాయని తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఫైబర్‌నెట్‌ వ్యవహారాలపై విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగా సంస్థ ఎండీ మెయిల్, లాగిన్‌లను గత రెండు రోజులుగా ఫ్రీజ్‌ చేశారు. సంస్థ ఇన్‌ఛార్జి ఎండీగా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ శనివారం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని