Bharathi Cement: భారతి సిమెంటు ఉద్యోగుల ఆందోళన

తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారతి సిమెంటు పరిశ్రమ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు.

Updated : 31 May 2024 03:28 IST

హామీలను యాజమాన్యం విస్మరించిందని మండిపాటు

భారతి సిమెంట్‌ పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

కమలాపురం, న్యూస్‌టుడే : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారతి సిమెంటు పరిశ్రమ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు పరిశ్రమ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేసే సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన ఉద్యోగులకు అయిదు సంవత్సరాలపాటు ఏటా రూ. 10 వేల చొప్పున ఇంక్రిమెంటు ఇవ్వాలన్నారు. పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చేందుకు 2010లో ఎకరాకు రూ.2 లక్షల చొప్పున యాజమాన్యం తమ వద్ద ఉంచుకుందని, ఆ నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోరారు. భూములు కోల్పోయిన ఉద్యోగులకు ప్రతి మూడేళ్లకు పదోన్నతి కల్పించాలని డిమాండు చేశారు. డిగ్రీ, డిప్లొమా కలిగిన వారిని మూడేళ్లు, ఐటీఐ విద్యార్హత కలిగిన వారిని అయిదేళ్ల తర్వాత రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇంటర్, పదో తరగతి అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. పరిశ్రమ ఐఆర్‌పీఆర్‌ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డి, హెచ్‌ఆర్‌ గోపాల్‌రెడ్డి, సీఎంవో సాయిరమేష్‌ అక్కడికి చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని