Andhra Pradesh News: కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు.. ఎన్నికల వేళ మొరాయింపుపై అనుమానాలు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు.

Updated : 25 May 2024 09:20 IST

పల్నాడు జిల్లాలో 18 చోట్ల సేవలు బంద్‌
రాష్ట్ర వ్యాప్తంగా 340 ఠాణాల్లో ఇదే తీరు

కెమెరాలో దృశ్యాలు హార్డ్‌ డిస్క్‌లో రికార్డు కాకుండా కేబుల్‌ను తొలగించిన తీరు

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్‌ అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై వైకాపా మూకలు మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డాయి. సీసీ కెమెరాల్లో ఆయా దృశ్యాలను చూసిన యావత్‌ రాష్ట్రం నెవ్వెరబోయింది. వైకాపా దాష్టీకాలను వెలుగులోకి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. ఇంతటి కీలకమైన నిఘా నేత్రాలను పలు పోలీస్‌ స్టేషన్లలో పోలీసులే పని చేయకుండా స్తంభింపజేస్తున్నారు. వైకాపా పెద్దల ప్రాపకం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఠాణాల్లో సీసీ కెమెరాలు అమర్చిన ఏజెన్సీలకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. దీంతో గుత్తేదారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం మానేశారు. ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఆపి, ఈ పరిస్థితులు తలెత్తడానికి పూర్వ డీజీపీ తన శక్తిమేర కృషి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రతి స్టేషన్‌కు 12 కెమెరాల వరకు ఏర్పాటు

పోలీసు స్టేషన్లలో విధిగా నిఘా కెమెరాలను బిగించాలని మూడేళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతలో 629 స్టేషన్లు, రెండో దఫా 372 ఠాణాల్లో బిగించారు. ఒక్కో ఠాణాలో 12 కెమెరాల వరకు ఏర్పాటు చేశారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా పలు స్టేషన్లలో కిందిస్థాయి అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేస్తున్నారు. మరోవపు పలువురు పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని స్టేషన్లకు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. అవన్నీ నిఘా నేత్రాల్లో నమోదు కాకుండా వారు చేయని ప్రయత్నం లేదు. కొన్నిచోట్ల కెమెరాల వైర్లను తప్పించారు. షార్ట్‌సర్క్యూట్‌ అయిందని నమ్మించేందుకు కొన్నిచోట్ల వైర్లకు నిప్పు పెట్టారు. మరికొన్ని స్టేషన్లలో హార్డ్‌డిస్క్‌ అనుసంధానాన్ని తొలగించారు. 

సీసీ కెమెరా కేబుల్‌ను కోసేశారిలా…

ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేసిన పూర్వ డీజీపీ?

హింసాత్మక ఘటనలతో రగులుతున్న పల్నాడు జిల్లాలో 13 స్టేషన్లలో సీసీ కెమెరాలు మొరాయించాయి. బెల్లంకొండ, దుర్గి, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, శావల్యాపురం.. తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి సీసీఎస్, దిశ, ఎస్వీ క్యాంపస్, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, రామచంద్రాపురం, తదితర ఠాణాల్లో ఆగిపోయాయి. ఇలా.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు దాదాపు 340 స్టేషన్లలో పని చేయడం లేదు. కెమెరాలు ఆగిపోయిన స్టేషన్లలో అధికంగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నవే కావడం గమనార్హం. 

ఆగిపోయిన వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఏటా వార్షిక నిర్వహణ వ్యయం మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని కెమెరాలను బిగించిన ఏజెన్సీకి మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం వెచ్చించాలి. నిర్వహణ వ్యయం దేవుడెరుగు.. కెమెరాలు బిగించిన బిల్లులు కూడా ఇప్పటికీ గుత్తేదారులకు చెల్లించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇదంతా చేసిందనే విమర్శలున్నాయి. మొదటి దశ బిల్లులు ఇంకా రూ.6 కోట్లు, రెండో విడత బిల్లు రూ.14 కోట్లు చొప్పున మొత్తం రూ.20 కోట్లు విడుదల చేయాలి. దీనిపై గుత్తేదారులు పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆరుసార్లు లేఖలు రాసినా ఆయన స్పందించలేదు. బకాయిలు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ఏజెన్సీలు మరమ్మతులు చేయలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. పలువురు వైకాపా నేతలు పోలీసుల సాయంతో గిట్టని వారిపై బెదిరింపులకు దిగారు. సీసీ కెమెరాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఉంటుంది. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఎన్నికల సమయంలో కీలకమైన అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు పనిచేయకపోతే వీరంతా ఎందుకు మిన్నకుండిపోయారన్నది తేలాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని