Chandrababu: రామోజీరావు తెలుగు జాతి వెలుగు

రామోజీరావు మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీ అస్తమయం.. ఆంధ్రప్రదేశ్‌కే కాదు, యావత్‌ దేశానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.

Updated : 09 Jun 2024 09:06 IST

ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌లను పరామర్శిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు

ఈనాడు డిజిటల్, అమరావతి: రామోజీరావు మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీ అస్తమయం.. ఆంధ్రప్రదేశ్‌కే కాదు, యావత్‌ దేశానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఒక యుగపురుషుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. తనతో నలభై ఏళ్ల అనుబంధాన్ని స్మరించుకున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫిలింసిటీకి చేరుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. భౌతికకాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించి, ఓదార్చారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ‘కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న రామోజీరావు కోలుకుంటారని భావించాం. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. అక్షరయోధుడి మరణం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీరావు తెలుగు జాతి వెలుగు. తెలుగు ప్రజల ఆస్తి. ఆయన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నిద్రలేస్తే ‘ఈనాడు’ పత్రిక చదివితే తప్ప ఇంట్లోంచి బయటకు రాలేం. ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేసేందుకు అనునిత్యం సాధన చేశారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు ఈనాడు, ఈటీవీ శాశ్వతం. చిత్రపరిశ్రమకూ ఎనలేని సేవలందించారు. అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మించారు. నా వల్ల ఈ సిటీకి, రాష్ట్రానికి ఆదాయం రావాలని చెప్పేవారు’ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

ప్రజాపక్షాన ఉంటాననే వారు

‘సమాజ హితానికి అనుక్షణం తపించిన రామోజీరావు కీర్తి అజరామరం. రామోజీ గ్రూపు సంస్థల ద్వారా వేల మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థల్ని నడిపిన రు ఆదర్శనీయం. దశాబ్దాల ప్రయాణంలో నిత్యం ప్రజల మేలు కోసం పనిచేశారు. మంచిని మంచి అని, చెడును చెడు అని చెప్పే తీరు నన్ను ఆయనకు దగ్గర చేసింది. ప్రజలకు మంచి పాలసీలు అందించడంపై రామోజీరావు సూచనలు, సలహాలు తీసుకునేవాడిని. నేనేం చెప్పినా తాను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని స్పష్టంగా చెప్పేవారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ధర్మం పక్షానే నిలిచారు. ప్రజలకు కూడా ఆయనపై అచంచల విశ్వాసం. అందుక్కారణం జీవితాంతం సంపాదించుకున్న విశ్వసనీయత. పనిచేస్తూ, పనిలోనే చనిపోతే ఆనందంగా ఉంటుందనేవారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధేస్తోంది. రామోజీరావు చెప్పిన విషయాలు ఎప్పుడూ నా చెవుల్లో మోగుతుంటాయి. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏపీని అభివృద్ధి చేస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులు, గ్రూపు సంస్థల ఉద్యోగులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని