YSRCP: లక్షల ఎకరాల ఎసైన్డ్‌ భూములు కొట్టేసే కుట్ర

అధికారం నుంచి దిగిపోయినా తాము, తమ తర్వాత కొన్ని తరాలపాటు అనుభవించడానికి వీలుగా ఎసైన్డ్‌ భూములపై వైకాపా ప్రభుత్వం గతేడాది ఓ దురాలోచనకు ఒడిగట్టింది.

Updated : 30 May 2024 07:07 IST

20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్టసవరణ చేసిన వైకాపా సర్కారు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ
సవరణ జీవో అడ్డం పెట్టుకుని.. బరితెగించిన వైకాపా ముఠాలు
రాయలసీమలో పెద్దఎత్తున దోపిడీ.. ఉత్తరాంధ్రనూ ఊడ్చేస్తున్నారు
కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్‌ ఏర్పాటు చేసి విచారించాలి
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం

ధికారం నుంచి దిగిపోయినా తాము, తమ తర్వాత కొన్ని తరాలపాటు అనుభవించడానికి వీలుగా ఎసైన్డ్‌ భూములపై వైకాపా ప్రభుత్వం గతేడాది ఓ దురాలోచనకు ఒడిగట్టింది. 20 ఏళ్లకు ముందు (2003కు ముందు) ఇచ్చిన ఎసైన్డ్‌ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆయా వర్గాల పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ చట్టసవరణ చేసింది. ఈ సవరణ జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల ఎసైన్డ్‌ భూముల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సవరణ ఉత్తర్వును అడ్డం పెట్టుకుని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.లక్షల కోట్ల దోపిడీకి తెరతీసిన అతిపెద్ద భూ కుంభకోణం ఇది. ఒక్క ఉత్తర్వు ద్వారా సుమారు 25 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్‌ భూముల్ని పేదల నుంచి లాగేసుకునే కుట్ర ఇది. వ్యవసాయ యోగ్యం కాని, పట్టణాల్లోకి చేరిన భూముల్ని అమ్ముకుంటే పేద కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. ఆ మంచిని ముసుగుగా చూపించి, వైకాపా నేతలు, వారి అనుయాయులే లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు, వారి బంధువులే ఈ భూముల్ని రాయించుకుంటున్నట్లు తెలిసింది. బినామీ పేర్లతో రాయలసీమ ప్రాంతంలో పెద్దఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని హస్తగతం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం దీనిపై సిట్‌ ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపిస్తే, సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది బయటికి వస్తుంది. 

ఉత్తరాంధ్రలో భారీ ఒప్పందాలు

596 జీవో అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల ఎసైన్డ్‌ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా రూ.వేల కోట్ల విలువైన ఎసైన్డ్‌ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖ పరిధిలోని ఎసైన్డ్‌ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని.. వారి దగ్గర నుంచి సుమారు వెయ్యి ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాలను రూ.10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీవో 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి ఎసైన్డ్‌ భూములు అగ్రిమెంట్‌ చేసుకుని.. సవరణ జీవో వచ్చాక పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి. విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతోపాటు, విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల ఎసైన్డ్‌ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికేట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో సుమారు 2వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఆనందపురం, పద్మనాభం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేస్తూ మరో జాబితా పంపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఇందులో అసలు వ్యక్తులు ఎవరనేది బయటకు వస్తుంది.

సర్కారు లెక్కలన్నీ తప్పుల తడకలే

రాష్ట్రంలో ఎసైన్డ్‌ భూములెంత, వాటిలో 2003కు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబరు 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్‌ భూములు పంపిణీ చేయగా.. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20% భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలే అని.. వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది. 29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలు చెబుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్‌ భూముల్లో యజమానులు/ వారసులు లేరని వివరిస్తోంది. అన్యాకాంత్రమైన భూముల్లో చాలా వరకు ఎసైన్డ్‌ కేటగిరిలోనే లేవు. సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించి భూముల రికార్డుల్లో అనుభవదారు/వారసుల పేర్లు లేవు. మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని గిరిజనుల్లో 50% మంది లబ్ధిదారులు మాత్రమే భూమిని అనుభవిస్తున్నారు.

మూడంచెల విధానాన్ని పక్కనపెట్టి..

ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు మూడంచెల విధానంలో (వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీఓ) పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టప్రకారం ఫ్రీహోల్డ్‌కు అర్హమైన ఎసైన్డ్‌ భూముల పరిశీలనను 100% వీఆర్వోలు, 100% తహశీల్దార్లు, ర్యాండమ్‌గా 10% ఆర్డీఓలు నిర్వహించాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎస్‌ఓ (బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌)ను సవరించాలి. ఈ విధానం సరిగా అమలు కావడం లేదు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా.. ఉన్నట్లు రికార్డులు సృష్టించి, కొందరు వైకాపా నేతలు లబ్ధిపొందుతున్నారు.


వేళ్లన్నీ.. త్రిమూర్తులవైపే!

రవై ఏళ్ల కంటే ముందు ఎసైన్‌ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ.. 2023 జులై 31 నుంచి అమల్లోకి వచ్చేలా చట్టసవరణ చేస్తూ గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని.. ఎసైన్డ్‌ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో, పణమో ముట్టచెప్పి అక్కడి నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటిచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటిచోట్ల 50- 70% వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములదీ ఇదే పరిస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని