Andhra Pradesh post poll violence: హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది.

Updated : 17 May 2024 07:05 IST

పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీ బదిలీ
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌
12 మంది పోలీసు అధికారులపైనా కొరడా
హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు
రెండురోజుల్లోపు నివేదిక ఇవ్వాలి
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
ఫలితాలొచ్చిన రెండు వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ  
కేంద్ర హోం శాఖకు ఆదేశం
సీఎస్‌, డీజీపీల సంజాయిషీ అనంతరం చర్యలు  
మీడియాతో మాట్లాడకుండా వెనుక గేట్లోంచి వెళ్లిపోయిన పోలీస్‌, ప్రభుత్వ బాస్‌లు
ఈనాడు - దిల్లీ

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌, అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దర్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, పల్నాడు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌లపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ 16 మందిపైనా శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జిషీట్‌ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి.. తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్‌ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండైన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్‌ స్థానంలో అర్హులైన ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల పేర్లతో జాబితాను 17న ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించారు. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను.. ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

ఈసీ ఎదుట హాజరైన సీఎస్‌, డీజీపీ

పోలింగ్‌ జరిగిన సమయంలో, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం పరిశీలకులు ఇచ్చిన నివేదికలు, మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాలను దిల్లీకి పిలిపించి వివరణ కోరింది. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30కు సీఈసీ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధుల ముందు హాజరయ్యారు. హింసాత్మక ఘటనలను నిలువరించకపోవడాన్ని కారణమేంటి? అందుకు బాధ్యులెవరు? రాష్ట్రంలో 14 సమస్యాత్మక అసెంబ్లీ స్థానాలను గుర్తించినా అక్కడ జరగబోయే ఘటనలను ఊహించడంలో ఎందుకు విఫలమయ్యారు? అల్లర్ల నివారణకు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? అని ఎన్నికల కమిషనర్లు వారిద్దరిని ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తొలి నుంచి అసంతృప్తితో ఉంది. అందుకే డీజీపీ సహా పలువురు ఐపీఎస్‌ అధికారులు, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులనూ బదిలీ చేసింది. ఈసీ ఇంత అప్రమత్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎందుకు హింసాత్మక ఘటనలను నిలువరించలేకపోయారని ఎన్నికల కమిషనర్లు వీరిని ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలోనే చోటుచేసుకున్న ఘటనలపట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశానంతరం ఇద్దరు అధికారులూ మీడియాతో మాట్లాడకుండా కమిషన్‌ భవనం వెనుక గేటు నుంచి బయటికెళ్లిపోయారు.

తీవ్ర అసంతృప్తి.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి

వీరి నుంచి తీసుకున్న వివరణలు, వివరాలను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం రాత్రి 8 గంటలకు ఈ మూడు జిల్లాలకు చెందిన 16 మంది అధికారులపై కొరడా ఝళిపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు సీఎస్‌, డీజీపీలతో సమావేశమైన సందర్భంగా ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలంతా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ అధికారులను కమిషనర్లు గట్టిగా ఆదేశించినట్లు వెల్లడించింది. నిందితులపై సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే ఈ పని పూర్తిచేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఎన్నికల కమిషనర్లకు వివరించే సమయంలో సీఎస్‌, డీజీపీలు ఇద్దరూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జిల్లాల్లో ఏయే అధికారులు నిర్లక్ష్యంగా     వ్యవహరించారు, ఎవరి పర్యవేక్షణ లోపం కారణంగా ఇవి చోటుచేసుకున్నాయో వివరణ ఇచ్చారు. దాని ఆధారంగా ఈసీ ఈ అధికారులపై చర్యలకు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని