సమర శంఖారావం పాదయాత్రలో ఉద్రిక్తత

సర్పంచుల హక్కులు.. నిధుల సాధనకు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు చేపట్టిన సమర శంఖారావం పాదయాత్ర మంగళవారం ఉద్రిక్తంగా మారింది.

Published : 30 Nov 2022 04:52 IST

అలిపిరిలో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నాయకుల అరెస్టు

తిరుపతి (నేరవిభాగం, నగరం, రామచంద్రాపురం), న్యూస్‌టుడే: సర్పంచుల హక్కులు.. నిధుల సాధనకు పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు చేపట్టిన సమర శంఖారావం పాదయాత్ర మంగళవారం ఉద్రిక్తంగా మారింది. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ గౌరవాధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమైన సర్పంచులు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముందే ఒకరిద్దరు సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తర్వాత మెట్లమార్గం ద్వారా తిరుమల వెళ్లేందుకు వచ్చినవారంతా రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచులు, సంఘం నేతలు, వారితో వచ్చినవారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. రాజేంద్ర ప్రసాద్‌ వద్ద ఉన్న బ్యానర్లు లాక్కుని పక్కన పడేశారు. నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉందని.. పాదయాత్రకు అనుమతి లేదంటూ అరెస్టు చేశారు. ఆయనను వాహనంలో ఎక్కించే క్రమంలో నెట్టేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి తదితరులను అరెస్టు చేశారు. మహిళా నాయకులనూ పోలీసులు వాహనాల్లోకి ఎక్కించారు. ముందుగా కొందరిని అలిపిరి, మరికొందరిని రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. తర్వాత అలిపిరి స్టేషన్‌లో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌, మరికొందరిని రామచంద్రాపురం స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీపీఐ నేతలు వారికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసుల కళ్లుగప్పి 70మంది ప్రజాప్రతినిధులు తిరుమల చేరుకున్నారు. అలిపిరి మెట్లమార్గం వద్ద పోలీసులు ఉన్నా.. వారిని దాటుకుని నడకమార్గంలో వెళ్లారు.

రాష్ట్రంలో అరాచక పాలన: రాజేంద్ర ప్రసాద్‌

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ ఆరోపించారు. శ్రీవారిని దర్శించుకుని బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని హెచ్చరించారు. ‘ఈరోజు అడ్డుకుంటే.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని సర్పంచుల సమస్యలను విన్నవిస్తాం. స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వకుంటే ఆలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగుతాం’ అని హెచ్చరించారు. రామచంద్రాపురం స్టేషన్‌కు తీసుకొచ్చిన సర్పంచులు, నాయకులను సాయంత్రం విడుదల చేశారు. మరోవైపు ముందు జాగ్రత్తగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తదితరులను గృహ నిర్బంధం చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు