‘ఆక్వా’ ఆగమాగం

రొయ్యల సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతు.. ధర దక్కక మూడు నెలల నుంచి నష్టాల్లో మునిగి పోతున్నా వారి గోడు సర్కారు చెవికెక్కడం లేదు.

Published : 02 Dec 2022 05:04 IST

నష్టాల్లోకి రైతాంగం.. గోడు పట్టని ప్రభుత్వం
పంట విరామం తప్పదంటున్నా..  ప్రేక్షకపాత్రే

ఈనాడు, అమరావతి: రొయ్యల సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతు.. ధర దక్కక మూడు నెలల నుంచి నష్టాల్లో మునిగి పోతున్నా వారి గోడు సర్కారు చెవికెక్కడం లేదు. రాష్ట్ర జీవీఏ(స్థూల అదనపు విలువ)లో 9.08% ఆక్వా రంగం నుంచే లభిస్తున్నా.. పండించే రైతుకు సర్కారు నుంచి భరోసా కొరవడింది. మత్స్యరంగం నుంచి అత్యధికంగా రూ.67వేల కోట్ల జీవీఏ అందిస్తున్నా.. ఆదుకునే చర్యలు అంతంతమాత్రమే. సాధికార కమిటీ ఏర్పాటు చేసి మొక్కుబడి సమావేశాలతోనే సరిపెడుతోంది. నష్టాలు పెరుగుతున్నాయని, పంట విరామం తప్పదని రైతులు ప్రకటిస్తున్నా.. ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. మద్దతు ధర ప్రకటించి, తర్వాత దాన్ని కుదించడం మినహా మరేం చేయలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకూ కొనడం లేదని రైతులు వాపోతున్నారు. గత నెలలో ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో రైతులు తమ కష్టాలను వెల్లడించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన సమావేశంలోనూ పంటవిరామం తప్పదని స్పష్టం చేశారు. అమెరికా, చైనాలకు ఎగుమతులు ఎంత వరకు మెరుగుపడతాయో ఇప్పుడు చెప్పలేమని, పంట తగ్గించుకోవడమే మార్గమని ఎగుమతి వ్యాపారులు పేర్కొంటున్నారు. అయినా రొయ్యల ఎగుమతుల్ని పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం, భవిష్యత్తు కార్యాచరణ, సాగుపై రైతులకు దిశా నిర్దేశం చేసే చర్యలు ప్రభుత్వం నుంచి కొరవడ్డాయి.

ప్రతికూలంగా అంతర్జాతీయ పరిణామాలు

రొయ్యల ఎగుమతుల్లో చైనా, అమెరికా కీలకం. కొన్నాళ్లుగా ఈ దేశాలకు ఎగుమతులు నిలిచాయి. డిసెంబరు నుంచి ఎగుమతులకు అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్న సమయంలో.. మళ్లీ నల్లమబ్బులు కమ్ముకుంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆర్థికమాంద్యం భయంతో అమెరికాకు ఎగుమతులు అనుకున్నంత మేర ఉండకపోవచ్చని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో కోత, తగ్గుతున్న ఆదాయం నేపథ్యంలో ఆహారంపై ఖర్చు తగ్గించుకోవడం దీనికి కారణంగా చెబుతున్నారు. చైనాలో లాక్‌డౌన్‌ కూడా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుందని వివరిస్తున్నారు. రైతులు పంట తగ్గించుకోవడమే దీనికి మార్గంగా సూచిస్తున్నారు.  

భవిష్యత్తు భయం.. భయం

రొయ్యలసాగుపై రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున రూ.5 లక్షల వరకు సమకూర్చుకోవాలి. పరిస్థితి ప్రతికూలంగా మారితే ఒక్కో రైతు పెద్దఎత్తున నష్టపోయే పరిస్థితి. కొవిడ్‌ సమయంలో రొయ్యల్ని అమ్ముకోలేక కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ ఏడాది జనవరిలో ధరలు బాగున్నా.. రొయ్య చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గడంతో రైతులు కలవరపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది తక్కువ ధరకే అమ్మేశారు. మళ్లీ పంట వేసినా కొనుగోలు చేస్తారో లేదో అనే భయం వెన్నాడుతోంది.

ఎగుమతుల్ని పెంచే చర్యలేవీ?

ప్రధానంగా విదేశీ ఎగుమతులపై ఆధారపడి రొయ్యల సాగు జరుగుతుంది. తేడా వస్తే రైతులు నష్టపోవాల్సిందే. చిన్నదేశమైన ఈక్వెడార్‌లో ఎగుమతులు, సాగుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడి యంత్రాంగం స్పందించి.. విదేశాలతో సంప్రదింపులు నిర్వహించడంతోపాటు అవకాశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని వ్యాపారులు, రైతులు పేర్కొంటున్నారు. రొయ్యల సాగు అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా విధానమే లేదని, కేంద్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని వివరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలపై రైతుల్లో అవగాహన కల్పించడంతోపాటు.. వివిధ దేశాలతో చర్చించి ఎగుమతుల్ని పెంచే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు