దేశానికి దిక్సూచి ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

Updated : 31 Jan 2023 07:34 IST

11.43 శాతం వృద్ధి రేటుతో తొలిస్థానం
పల్నాడు జిల్లా వినుకొండ సభలో సీఎం జగన్‌
‘జగనన్న చేదోడు’ మూడో విడత నిధుల విడుదల
రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు రూ.330 కోట్ల సాయం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. జగన్‌ పరిపాలన వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అబద్ధాలాడుతూ విమర్శలు చేసేవారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మూడో విడత రూ.330.15 కోట్ల సాయాన్ని సీఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదలకు మేలుచేసేలా అమలు చేస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మూడేళ్లలో రూ.927 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 43 నెలల కాలంలో వివిధ పథకాల ద్వారా బటన్‌ నొక్కి రూ.1,92,938 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని గుర్తుచేశారు. గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, విద్యాకానుక వంటి పథకాలను కలుపుకొంటే... రూ.3 లక్షల కోట్ల సాయం చేయగలిగామన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్లుగా భావించి... ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాని విధంగా అభివృద్ధి చేస్తున్నాం. గిట్టనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మీరంతా ఆలోచించాలి’ అని ప్రజలను సీఎం కోరారు.

ఈ పోరాటంలో మీ దీవెనలు కావాలి

‘ఇచ్చిన మాటమీద నిలబడే జగన్‌కు.. వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడేవారికి ఈరోజు యుద్ధం జరగబోతోంది. ఈ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలను నమ్ముకున్నాను. మీ చల్లని దీవెనలు కావాలి’ అని సీఎం కోరారు. పొత్తులు లేకుండా, ఎవరిమీదా ఆధారపడకుండా ఒక్కడినే సింహంలా నడుస్తుంటే... తోడేళ్లందరూ కలిసి వస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... గతంలో నాయకుడంటే మోసం... నేడు నాయకుడంటే నమ్మకం అనేలా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేసి జీవితాలకు భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం బటన్‌ నొక్కి జగనన్న చేదోడు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు.


దుకాణాల్లేవు... బస్సులు రావు

వినుకొండ, న్యూస్‌టుడే: సీఎం పర్యటనను పురస్కరించుకొని వినుకొండలో సోమవారం మధ్యాహ్నం వరకు దుకాణాలు మూయించారు. స్తూపం కూడలి నుంచి వెల్లటూరు రోడ్డులోని  సభా ప్రాంగణం దాకా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు అడ్డంగా కట్టారు. తోపుడుబండ్లనూ అనుమతించలేదు. సీఎం వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఈ రహదారిలో వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. బహిరంగ సభా ప్రాంగణం చాలక జనం బయట నిలబడాల్సి వచ్చింది. లోపలున్న పలువురు అసౌకర్యంతో సీఎం ప్రసంగం ముగియక ముందే వెనుదిరిగారు. ప్రవేశ ద్వారాల నుంచి పోలీసులు అనుమతించనప్పటికీ బారికేడ్లు దాటుకొని వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని