నిధులొస్తున్నాయి.. చిత్తశుద్ధి చూపుతారా?

గిరిశిఖర గ్రామాలు, దట్టమైన అడవుల్లోని కుగ్రామాల్లో నివసిస్తూ అభివృద్ధి ఛాయలకు ఆమడ దూరంలో ఉన్న ఆదిమ జాతి తెగల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్తర అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ముందుంది.

Published : 02 Feb 2023 04:36 IST

ఆదిమ జాతి తెగల అభివృద్ధికి  రూ.15 వేల కోట్లు వెచ్చించనున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో  కదలితేనే ప్రయోజనం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గిరిశిఖర గ్రామాలు, దట్టమైన అడవుల్లోని కుగ్రామాల్లో నివసిస్తూ అభివృద్ధి ఛాయలకు ఆమడ దూరంలో ఉన్న ఆదిమ జాతి తెగల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మహత్తర అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. కేంద్రం వీరి సామాజిక, ఆర్థికాభివృద్ధికి మూడేళ్లలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆదిమ జాతి తెగ(పీవీటీజీ)ల జనాభాలో 1.76 లక్షల మందితో ఏపీ 5 స్థానంలో(2011 జనాభా లెక్కల ప్రకారం) ఉంది. ప్రస్తుతం వారి సంఖ్య 3,59,957కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదిమ జాతి తెగల అభివృద్ధిపై పక్కా ప్రణాళిక రూపొందించి ముందుకు కదిలితే మూడేళ్లలో కేంద్రం నుంచి రూ.1000 కోట్లైనా తెచ్చుకునే అవకాశముంది. ఈ నిధులతో సంతృప్తికర స్థాయిలో ఇళ్ల నిర్మాణం, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, విద్య, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకునే వీలుంది. రహదారులు, టెలికాం కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావొచ్చు. పోషకాహార లోపాన్ని అధిగమించొచ్చు. యువతకు సుస్థిరాభివృద్ధికి జీవనోపాధి కల్పించొచ్చు.  ఇక కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించడమే.

పట్టుబడితే మరో 20 ఏకలవ్య ఆదర్శ గురుకులాలు

ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకుగాను కేంద్రం గత బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించగా...ఈ దఫా దాన్ని రూ.5,943 కోట్లకు పెంచింది. రానున్న మూడేళ్లకాలంలో 740 ఆదర్శ గురుకులాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28 ఏకలవ్య ఆదర్శ గురుకులాలున్నాయి. ఇక్కడ 7,087 పిల్లలు చదువుతున్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం బ్లాక్‌/తాలుకా లేదా 20వేల ఎస్టీల జనాభా ఆధారంగా ఏకలవ్య గురుకులాలను ఏర్పాటు చేస్తోంది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో నిర్దేశిత ప్రాంతాలకు ఏకలవ్య గురుకులాలు ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాలుకా ఆధారంగా కాకుండా రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికన గురుకులాలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మరో 20 ఏకలవ్య గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై పట్టుబట్టి కేంద్రాన్ని అడిగితేనే ఇది సాధ్యపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని