ఐదోవంతే పాస్‌

రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గత నెల 22న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) రాసిన 4,59,182 మంది అభ్యర్థుల్లో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

Published : 06 Feb 2023 04:43 IST

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 20.73% మందికే అర్హత
4,59,182 మంది పరీక్ష రాస్తే ఉత్తీర్ణులైంది 95,209 మందే
వారికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు
ఫలితాలను విడుదల చేసిన పోలీసు నియామక మండలి
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గత నెల 22న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) రాసిన 4,59,182 మంది అభ్యర్థుల్లో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పోలీసు నియామక మండలి ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. వీరు స్టేజ్‌-2 పరీక్షల కోసం ఈ నెల 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని తెలిపింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 3,63,432 మంది పురుషులు పరీక్ష రాయగా వారిలో 21.42 శాతం మంది,  95,750 మంది మహిళలు పరీక్ష రాయగా వారిలో 18.10 శాతం మంది అర్హత సాధించారు.

3 ప్రశ్నలకు సమాధానాల మార్పు

సమాధానాల ‘కీ’కి సంబంధించి మొత్తం 2,261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో  మూడు ప్రశ్నల సమాధానాలను ‘కీ’లో మార్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సందేహాలు ఉంటే 94414 50639, 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.


కటాఫ్‌ మార్కులు తగ్గించాలి

- ఏపీ నిరుద్యోగ ఐకాస

కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్‌ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం కటాఫ్‌ మార్కులు ఎక్కువగా పెట్టటంతో రాత పరీక్షలో లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్దిఖీ ఆరోపించారు. తక్షణమే కటాఫ్‌ మార్కులను తగ్గించాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని