శాప్‌లో వివాదాల రచ్చ

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వివాదాలకు వేదికైంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఇప్పటికే విచారణకు ఆదేశించింది.

Published : 08 Feb 2023 02:59 IST

మొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులు
తాజాగా తెరపైకి క్రీడా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు
ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై ముగ్గురు పాలకవర్గ సభ్యుల ఆరోపణలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) వివాదాలకు వేదికైంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఇప్పటికే విచారణకు ఆదేశించింది. తాజాగా మంగళవారం శాప్‌ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం ప్రారంభానికి ముందు ముగ్గురు పాలకవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ క్రీడా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై శాప్‌ ఛైర్మన్‌, ఎండీ మధ్యాహ్నం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ వారు చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ పరిణామాలు క్రీడా సంఘాల్లో, క్రీడాకారుల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఎండీ నియంతలా వ్యవహరిస్తున్నారు

‘మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ క్రీడలకు అన్యాయం చేస్తున్నారు. పాలకవర్గ సభ్యుల సూచనలు, సలహాలు పట్టించుకోవడం లేదు. క్రీడా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అనర్హులకు స్పోర్ట్స్‌ కోటాలో సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కొనుగోళ్లు, లీజులపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయించాలి...’ అని శాప్‌ పాలకవర్గ సభ్యులు కె.నర్శింహులు, డేనియల్‌ ప్రదీప్‌, కె.వరలక్ష్మి డిమాండ్‌ చేశారు. ‘పే అండ్‌ ప్లే విధానాన్ని వ్యతిరేకించినా ఎండీ అమలు చేశారు. అధ్వానంగా ఉన్న ఈతకొలను, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించడం లేదు. సీఎం కప్‌ నిర్వహణలోనూ జాప్యం చేస్తున్నారు...’ అని వివరించారు. క్రీడా పరికరాల కొనుగోళ్లలో, సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు పాలకవర్గ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని శాప్‌ ఛైర్మన్‌ సిద్దార్థరెడ్డి వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి త్వరలో మెగా శిబిరం నిర్వహించబోతున్నామని చెప్పారు. క్రీడా పరికరాల సరఫరాకు ఎక్కువ ధర కోట్‌ చేసిన టెండర్లను రద్దు చేసినప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని ఎండీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. స్పోర్ట్స్‌ కోటా కింద సర్టిఫికెట్ల జారీలో గతంలో కంటే ఇప్పుడు నిబంధనలను కఠినతరం చేశామన్నారు. సీఎం కప్‌ క్రీడా పోటీలు త్వరలో నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు