మునిరాజమ్మ, ఆమె భర్తపై తొందరపాటు చర్యలొద్దు

తిరుపతి జిల్లా తొట్టంబేడు ఠాణాలో రజక మహిళ మునిరాజమ్మ, ఆమె భర్త మారగంటి వెంకటాద్రిపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో అరెస్టుతోపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Published : 19 Mar 2023 05:13 IST

తొట్టంబేడు పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ఠాణాలో రజక మహిళ మునిరాజమ్మ, ఆమె భర్త మారగంటి వెంకటాద్రిపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో అరెస్టుతోపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు నిర్వహించుకోవచ్చని తెలిపింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో పాల్గొని ప్రభుత్వంతో ఎదురవుతున్న సమస్యలను విన్నవించుకున్నందుకు అధికార పార్టీ నేతలు తమపై కక్షకట్టారని, తొట్టంబేడు ఠాణాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయించారని పేర్కొంటూ శ్రీకాళహస్తి కొండమిట్టకు చెందిన రజక దంపతులు మునిరాజమ్మ, వెంకటాద్రి హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదుచేసిన కేసును కొట్టేయాలని కోరారు. వారి తరఫున న్యాయవాది మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొని అధికారుల తీరువల్ల ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నందుకు మునిరాజమ్మపై ద్వేషం పెంచుకున్నారని తెలిపారు. తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఆమె నిర్వహిస్తున్న టిఫిన్‌ సెంటర్‌ను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని