ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు

 రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు.

Updated : 28 Mar 2023 10:35 IST

ఈనాడు, అమరావతి: డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా ‘ఆయస్కాంత ప్రవణత(అవపాతము)ను నిర్వచించుము?’ అని రాగా, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ డెక్లినేషన్‌?’ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ ఇన్‌క్లినేషన్‌ ఆర్‌ యాంగిల్‌ ఆఫ్‌ డిప్‌?’ అని రావాల్సి ఉంది. దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ నుంచి సందేశాలు పంపించారు. కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా, మరికొన్నిచోట్ల ఆ విషయం వారికి చేరలేదు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నిర్వాహకులు ఈ విషయం చెప్పకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు.

భౌతికశాస్త్రం ప్రశ్నకు 2 మార్కులు

ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది భౌతికశాస్త్రం పరీక్షలో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు రెండు మార్కులను కలపనున్నారు. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని