బడి బస్సులకు ఏంటీ బెడద?

రాష్ట్రంలో ఎక్కడ సీఎం జగన్‌ సభ జరిగినా.. వందల కొద్దీ విద్యా సంస్థల బస్సులను ప్రజలను తరలించేందుకు మళ్లిస్తున్నారు. బడి బస్సులను కేవలం విద్యార్థులను ఇళ్ల నుంచి బడికి తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు మాత్రమే ఉపయోగించాలి.

Updated : 05 Jul 2023 06:08 IST

వాటిలో జనం తరలింపు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా?
నిబంధనలకు విరుద్ధమని తెలియదా?
చట్టాన్ని ఉల్లంఘిస్తున్న రవాణా శాఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడ సీఎం జగన్‌ సభ జరిగినా.. వందల కొద్దీ విద్యా సంస్థల బస్సులను ప్రజలను తరలించేందుకు మళ్లిస్తున్నారు. బడి బస్సులను కేవలం విద్యార్థులను ఇళ్ల నుంచి బడికి తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే వీటికి స్టేజ్‌ క్యారియర్‌, కాంట్రాక్ట్‌ క్యారియర్‌ బస్సులతో పోలిస్తే.. పన్నులో దాదాపు 98 శాతం రాయితీతో ప్రత్యేకంగా పర్మిట్‌ ఇస్తారు. కానీ సీఎం సభలు విజయవంతమయ్యేలా చేయడానికి విద్యాసంస్థలపై ఒత్తిడి తెచ్చి బస్సులను బలవంతంగా లాక్కుంటున్నారు. ఏ విద్యాసంస్థ యజమాని అయినా అభ్యంతరం చెబితే వెంటనే నిబంధనల అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.

బడిబస్సుల విషయంలో ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు, రవాణాశాఖ మంత్రి విశ్వరూప్‌కి, ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్‌లకు తెలుసు. కానీ వాళ్లు అడ్డు చెప్పడం లేదు. దీంతో రవాణాశాఖ అధికారులు నేతల మెప్పు కోసం ప్రతి జిల్లాలో సీఎం సభలకు భారీగా బడిబస్సులు సమకూర్చడంలో పోటీపడుతున్నారు. చిత్తూరులో మంగళవారం సీఎం జగన్‌ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాల పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, వృత్తి విద్య కళాశాలల నుంచి 250 బస్సులను మళ్లించింది. దీంతో మంగళవారం ఆయా విద్యాసంస్థలు సెలవు ఇచ్చాయి.  

అన్ని జిల్లాల్లోనూ ఇదే తంతు

ఇటీవల సీఎం జగన్‌ వారంలో మూడు, నాలుగు రోజులు ఏదో ఒక జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఏ జిల్లాలో సీఎం సభ పెట్టినా ముందురోజు సాయంత్రానికే బస్సులను తమకు అప్పగించాలని ప్రైవేటు విద్యా సంస్థలకు రవాణాశాఖ హుకుం జారీ చేస్తోంది. సీఎం సభలకే కాదు.. అధికార వైకాపా నిర్వహించే ప్లీనరీ వంటి సమావేశాలకు సైతం వందల సంఖ్యలో విద్యా సంస్థల బస్సులను తీసుకెళుతున్నారు. విద్యార్థులు వచ్చే దారి లేక ప్రైవేటు విద్యాసంస్థలకు అనధికార సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాము బస్సులు ఇవ్వబోమని చెబితే, రవాణాశాఖ అధికారులు ఏదో ఒక నిబంధన పేరు చెప్పి వేధిస్తారనే భయంతో యాజమాన్యాలు సైతం అభ్యంతరం చెప్పడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని