పథకం ప్రకారమే ఓట్ల జంబ్లింగ్‌!

ఓటర్ల జాబితాను జంబ్లింగ్‌ చేయడం.. ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లోనివారి ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతున్న అంశాలివి.

Updated : 06 Aug 2023 07:22 IST

తప్పులున్నా సరిదిద్దని యంత్రాంగం
బందరులో బట్టబయలైన మంత్రాంగం
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ఈనాడు - అమరావతి

ఓటర్ల జాబితాను జంబ్లింగ్‌ చేయడం.. ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లోనివారి ఓట్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతున్న అంశాలివి. లోతుగా పరిశీలిస్తే ఇదంతా చాలా ప్రణాళికాబద్ధంగా.. పక్కా పథకం ప్రకారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎన్నికల సంఘం నిబంధన (రూల్‌ 6) ప్రకారం ఇంటి నంబర్ల వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. అంటే.. అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తూ.. అనర్హులను చేర్చుతున్నారని అర్థమవుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇలాంటి ఉదంతంపై బందరు వాసి ఇమడాబత్తిని దిలీప్‌కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమం, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ ఇలాగే ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.


ఇదీ ప్రణాళిక..

సాధారణంగా వీధిలో ఇంటి నంబర్లు ఒక వరుసలో ఉంటాయి. ఓటర్ల జాబితాలో కూడా అలాగే ఉండాలి. రూల్‌ 6 కూడా అదే చెబుతోంది. కానీ ప్రస్తుత జాబితాలో చాలా వరకు డోర్‌ నంబరు ఒకటి తర్వాత 40 లేదా 50ఉంటోంది. ఆ నంబరు గురించి 1వ నంబరు ఇంట్లో విచారణ చేస్తే.. తమకు తెలియదని చెబుతారు. దీంతో ఆ ఓట్లను తొలగించేస్తారు.. ఇదీ దొంగ ఓట్ల ఆపరేషన్‌ తీరు.

  • దిలీప్‌కుమార్‌ మొదట ఓటర్ల జాబితాలో అవకతవకలపై 2022 డిసెంబరు 6న నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన ఆర్డీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. మొత్తం 1,140 ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేరోజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  • 2022 డిసెంబరు 8న ఓటర్ల జాబితా ముసాయిదా పూర్తయింది. కానీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తిరిగి ఆయన ఫిబ్రవరి 15న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి కృష్ణా కలెక్టర్‌కు దానిని ఎండార్సు చేశారు.
  • దీనిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్‌ రాజాబాబు ఆర్డీఓ కిశోర్‌ను 2023 మార్చి 8న ఆదేశించారు. అదేవిధంగా అభ్యంతరాలను బల్క్‌గా ఇవ్వడం వల్ల తాము ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేదంటూ దిలీప్‌కు లేఖ రాశారు. ఆయన మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేదు.
  • కలెక్టర్‌, ఆర్డీఓ స్పందించకపోవడంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జూన్‌ 19న కోర్టు దాన్ని స్వీకరించింది. దీంతో అదేరోజు సీఈఓ మీడియా సమావేశం నిర్వహించి తాము ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. వాస్తవానికి జూన్‌ 1 నుంచే ఎస్‌ఎస్‌ఆర్‌ జరుగుతోంది.
  • జూన్‌ 28న హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో మచిలీపట్నంలో 1,140 ఓట్ల విషయంలో తప్పులు జరిగినట్లు ఆర్డీఓ అంగీకరించారు.
  • ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌ రాజాబాబుకు ఆదేశాలు జారీ చేశారు. అయినా చర్యలు లేవు.

అభ్యంతరాలు ఇవీ..

బందరు ఓటర్ల జాబితాలో ఎక్కడా ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేవు. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఉండాల్సిన ఓట్లు వేరే కేంద్రానికి మారాయి. ఇలాంటి ఓట్లు 455 ఉన్నట్లు దిలీప్‌కుమార్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 68 ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నట్లు గుర్తించారు. జాబితాలో ఇచ్చిన చిరునామాలో నివాసం ఉండని వారు 386 మంది ఉన్నారు. రెండుసార్లు నమోదైన ఓట్లు రెండు ఉండగా.. చనిపోయినా 24 మందిని జాబితాలోంచి తొలగించలేదని గుర్తించారు. అయినా బాధ్యులపై చర్యలు లేకపోవడంపై దిలీప్‌కుమార్‌ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు