144 Section In AP: అధికార పార్టీకి 144 సెక్షన్‌ వర్తించదా?

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులనుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు.

Updated : 11 Sep 2023 09:36 IST

రాజమహేంద్రవరం, కావలిలో యథేచ్ఛగా ఉల్లంఘన

రాజమహేంద్రవరం (వి.ఎల్‌.పురం), కావలి, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులనుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. వీరభద్రపురంలో పలువురు ఎంపీ సమక్షంలో వైకాపాలో చేరుతున్న సందర్భంగా నగరంలో ర్యాలీ సాగింది. ఆయా జంక్షన్లలో పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ ర్యాలీ గురించి ప్రశ్నించలేదు. విషయాన్ని సంబంధిత పట్టణ పోలీసు అధికారుల వద్ద ప్రస్తావించగా.. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నట్టు ఎంపీకి తెలియదని, తాము వెళ్లి చెప్పేలోగా ర్యాలీ సాగిపోయిందని చెప్పారు.

కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్భాటంగా గడపగడపకు ప్రభుత్వం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కోసం జనసమీకరణ చేసి ఆదివారం ఆర్భాటంగా నిర్వహించారు. దీన్ని పోలీసులు పట్టించుకోలేదు. ఇదే సమయంలో ఆందోళనకు సిద్ధమైన తెదేపా శ్రేణులను పోలీసులు రెండు రోజులుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే 23 మంది తెదేపా నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఆదివారం తెదేపా తలపెట్టిన దీక్షలకు సైతం పోలీసులు అభ్యంతరం పలికారు. చివరకు వారు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయగా అక్కడ పోలీసులు పహారా కాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనేదే తమ లక్ష్యమని డీఎస్పీ ఎం.వెంకటరమణ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే కార్యక్రమానికి ఇలాంటి పరిస్థితి లేదని సెలవిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు