సీఐడీ ప్రశ్నలకు లోకేశ్‌ సూటి సమాధానాలు!

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.

Updated : 11 Oct 2023 09:49 IST

50 ప్రశ్నలూ ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబు చెబుతానని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మినహా దాదాపు ఆరు గంటల పాటు డీఎస్పీ విజయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఆయన స్పష్టంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు పదే పదే బయటకు వెళ్లి ఫోన్‌కాల్స్‌ మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం. ఒకానొక దశలో ప్రశ్నలు అడిగేందుకు సీఐడీ అధికారులు తర్జనభర్జన పడగా.. మొత్తం 50 ప్రశ్నలు ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబులు చెబుతానని లోకేశ్‌ వారితో అన్నారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్‌ను సీఐడీ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలు, ఆయన సమాధానాలివీ..

సీఐడీ: తెదేపాలో, ప్రభుత్వంలో ఏయే పదవులు చేపట్టారు? హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఏ బాధ్యతలు నిర్వహించారు?

లోకేశ్‌: తెదేపాలో కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలు చూశాను. కార్యకర్తలు అనారోగ్యం బారిన పడినప్పుడు అండగా ఉండటం, స్వయం ఉపాధికి తోడ్పాటు అందివ్వటం వంటివి చేశాను. తర్వాత తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టా. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా. పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రిగా పనిచేశా. 2008-13 వరకూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా, 2013-17 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించా.

హెరిటేజ్‌ ఫుడ్స్‌లో పనిచేసిన కాలంలో ఆ సంస్థ మీకు ఎంత చెల్లించేది?

ఈడీగా పనిచేసినప్పుడు వేతనంతో పాటు లాభాలపై కమీషన్‌, ఇతర సౌకర్యాలు కల్పించారు. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నప్పుడు.. బోర్డు మీటింగ్‌కు హాజరైనందుకు సిటింగ్‌ ఫీజు చెల్లించేవారు. 2017 మార్చి 31 నుంచి హెరిటేజ్‌లో అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నా. ప్రస్తుతం షేర్‌ హోల్డర్‌ను మాత్రమే.

హెరిటేజ్‌ సంస్థలో వ్యక్తిగతంగా మీకు ఎంత వాటా ఉంది?

సుమారు 10 శాతం.

మంత్రివర్గ ఉపసంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారా? ఉంటే మీతోపాటు సభ్యులుగా ఉన్న ఇతర మంత్రులెవరు?

మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్నాను. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఇతర సభ్యులు.

మీరు నివసించే ఇంటికి సంబంధించిన  వివరాలు చెప్పగలరా?

హైదరాబాద్‌లో మాకు సొంతిల్లు ఉంది. ఉండవల్లిలో ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి మా అమ్మ అద్దె చెల్లిస్తున్నారు.

లింగమనేని సంస్థ స్థలాన్ని తీసుకున్నారా? దానికి చెల్లింపులు చేశారా?

తెదేపా కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆనుకుని లింగమనేని సంస్థకు ఉన్న కొంత స్థలాన్ని వాస్తు అవసరాల కోసం కొన్నాం. దానికి సొమ్ము చెల్లించాం.

హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించి విధాన   నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు?

విధాన నిర్ణయాలన్నీ బోర్డు తీసుకుంటుంది. మేనేజ్‌మెంట్‌ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారాలుండవు.

కంతేరులో హెరిటేజ్‌ సంస్థ కొన్న భూముల వివరాలు చెప్పండి?

2014 మార్చి 21న హెరిటేజ్‌ బోర్డు తీర్మానం మేరకు కంతేరులో ఆ సంస్థ భూమి కొనుగోలు చేసింది. భూమి కొనడానికి రూ.3 కోట్లు కేటాయించాలని ఆ తీర్మానంలోనే నిర్ణయించారు. వ్యాపార విస్తరణ కోసం రాజస్థాన్‌, హరియాణా, అనంతపురం, చిత్తూరు, ఉప్పల్‌, బయ్యవరం, పామర్రు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)ల్లో భూములు కొనాలని బోర్డు తీర్మానించింది. కంతేరులో కొన్న భూమిలో 4.55 ఎకరాలు వివాదంలో ఉందని భావించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విక్రయ దస్తావేజులను రద్దు చేసుకున్నాం. కంతేరులో ప్రస్తుతం హెరిటేజ్‌కు 9.67 ఎకరాలే ఉంది.

జీవో నంబరు 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లేఅవుట్‌ రిజిస్ట్రేషన్‌ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు?

ఆ 99 మంది కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలనే పాటించాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని