Chandrababu: చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Updated : 27 Oct 2023 10:11 IST

నడుం కింది వరకు విస్తరించిన దద్దుర్లు
ప్రభుత్వ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక
కుడి కంటిలో శుక్లానికి శస్త్రచికిత్స చేయాలి
ఎల్‌వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యుల వెల్లడి

ఈనాడు, అమరావతి: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడు పదుల వయసులో ఆయనకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని తెలుస్తోంది. కుడికంటికి సత్వరమే శస్త్రచికిత్స చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ నేత్రవైద్యశాల నిపుణులు సూచించగా.. ఆయనకు వెంటనే వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21న ఒక నివేదికలో వివరించారు. తెదేపా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్రబాబుకు యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా అనే కంటి సమస్య ఉన్నట్టు 2016లో గుర్తించారు. దానికి లేజర్‌ చికిత్స చేశారు. ‘ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌’ను ఎప్పటికప్పుడు.. నిర్దిష్ట కాలావధుల్లో ఆసుపత్రిలో వైద్య నిపుణులు పర్యవేక్షించాలి. అలాగే ఆయనకు కంటిలో శుక్లాలు ఏర్పడినట్లు ఈ ఏడాది మే 23న గుర్తించి, జూన్‌ 21న ఎడమ కంటికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున.. మూడు నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా శస్త్రచికిత్స చేయాలని ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు సూచించారు. అది కూడా ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ను మేనేజ్‌ చేస్తూ, గ్లకోమా వైద్య నిపుణుల పర్యవేక్షణలో, అన్ని వసతులూ ఉన్న ఐ ఇనిస్టిట్యూట్‌లోనే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి..

అలాగే చంద్రబాబు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు బుధవారం ఆయనను పరీక్షించిన ప్రభుత్వ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఆయన వెన్ను కింది భాగంలో నొప్పి, మల ద్వారం వద్ద నొప్పి, అసౌకర్యంతో బాధపడుతున్నారని, ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనకు కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, సీరం ఎలక్ట్రోలైట్స్‌, కోగ్యులేషన్‌ ప్రొఫైల్‌, హెచ్‌బీఏ1సీ, కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌, ఈసీజీ, ఎక్స్‌-రే చెస్ట్‌, 2డీ ఎకో వంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు చల్లటి వాతావరణాన్ని కొనసాగించాలని, శరీరానికి బాగా గాలి తగిలే దుస్తులు ధరించాలి, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవద్దని, సౌకర్యంగా ఉండే కుర్చీని వాడాలని వారు పేర్కొనట్లు తెలిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని