Taneti Vanitha: హోంమంత్రిని గంటన్నరపాటు రోడ్డుపైనే నిలబెట్టిన గ్రామస్థులు

దళిత యువకుడు బొంతా మహేంద్ర (23) ఆత్మహత్యతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 17 Nov 2023 07:40 IST

సొంత నియోజకవర్గంలో ఘెరావ్‌ చేసిన దొమ్మేరు వాసులు
మిమ్మల్ని గెలిపించినందుకు చావును బహుమతిగా ఇస్తారా?
ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి బంధువుల నిలదీత
బాధితుల్ని పరామర్శించకుండానే వెనుదిరిగిన తానేటి వనిత
నా చావుకు ఎస్సై, వైకాపా నాయకులే కారణం
దళిత యువకుడు మహేంద్ర మరణ వాంగ్మూలం

ఈనాడు - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - చాగల్లు: దళిత యువకుడు బొంతా మహేంద్ర (23) ఆత్మహత్యతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇవ్వడానికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనితను దొమ్మేరు ఎస్సీ పేట ప్రజలు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్‌ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిలదీశారు. ‘‘ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేస్తే... మాకు చావును బహుమానంగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు... ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీసుస్టేషన్‌కు ఫోన్‌ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా?’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత బుధవారం సాయంత్రం దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని అడ్డుకున్నారు. ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. ‘మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు.

స్థానికుల ఆగ్రహాన్ని చూసి హోం మంత్రి రోడ్డుపైనే ఉండిపోగా.. పోలీసులు ఆమెకు రక్షణగా నిలిచారు. మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన నాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, వైకాపా నాయకుడి తరఫున రూ.10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారు తిరిగొచ్చేవరకూ రోడ్డుపైనే ఉన్న హోం మంత్రి.. వారిద్వారా చర్చల సారాంశం తెలుసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

పోలీసుల గుప్పెట్లో దొమ్మేరు

మహేంద్ర ఆత్మహత్య నేపథ్యంలో దొమ్మేరు గ్రామంలోకి ఎవర్నీ రానీయకుండా వందల సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించారు. ఉదయం నుంచీ దొమ్మేరు మీదుగా వెళ్లే వాహనాలను అడ్డుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దొమ్మేరు వెళ్లేందుకు సిద్ధమైన దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను, కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌ను, ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు.

బలి తీసుకున్న వైకాపా ఆధిపత్య పోరు

వైకాపాలో ఆధిపత్య పోరు మహేంద్ర బలవన్మరణానికి కారణమైంది. దొమ్మేరులో ఈ నెల 6న జరిగిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారంటూ వైకాపా నాయకులు నాగరాజు, సతీష్‌ ఫ్లెక్సీలు పెట్టారు. వారి ముఖాలున్న భాగాలు ఎవరో కత్తిరించటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై... మహేంద్రను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. అందుకే అతను ప్రాణాలు తీసుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు వాపోతున్నారు.

హోం మంత్రికి చెబితే.. ‘పంపించేస్తారు లే’ అన్నారు

‘కొవ్వూరు ఎస్సై భూషణం మా తమ్ముడిని పోలీసుస్టేషన్‌లో తీవ్రంగా హింసించారు. హోం మంత్రి తానేటి వనితకు ఫోన్‌ చేసి చెబితే ‘పంపించేస్తారు లే’ అంటూ తేలిగ్గా సమాధానమిచ్చారు. అవమానం భరించలేకే మహేంద్ర పురుగులమందు తాగాడు. తొలుత ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి చాగల్లుకు తరలించాం. తర్వాత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ 45 నిమిషాలు చికిత్స అందించలేదు. అక్కడి నుంచి పోలీసులు విజయవాడ తరలిస్తుండగా  మహేంద్ర చనిపోయాడు. అంబులెన్స్‌లో ఉన్న మహేంద్ర కుటుంబసభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉంది’ అని మృతుడి సోదరుడు బొంతా రాజేష్‌ చెప్పారు. ‘నా సోదరుడిని పోలీసులు సజీవంగా తీసుకెళ్లి... మృతదేహాన్ని మూటకట్టి తీసుకొచ్చి అప్పగించారు. రేపు (నవంబరు 17న) మహేంద్ర పుట్టినరోజు, వాడే లేకుండా పోయాడు’ అని మరో సోదరుడు బొంతా రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


నా చావుకు ఎస్సై, వైకాపా నాయకులే కారణం

నా చావుకు కొవ్వూరు ఎస్సై భూషణం, వైకాపా నాయకులు ముదునూరి నాగరాజు, బల్లుల సతీష్‌ కారణం. వారిని చట్టపరంగా శిక్షించాలి. ఇదే నా మరణ వాంగ్మూలం. చేనులో పనిచేసుకుంటున్న నన్ను సీఐ రమ్మంటున్నారంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకూ అక్కడ ఉంచేశారు. అసలు ఎందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారో చెప్పలేదు. నన్ను చూసి ఎందుకొచ్చావని సీఐ ప్రశ్నించారు. చివరికి మా బంధువులు వచ్చాక విడిచిపెట్టారు.

 చనిపోయే ముందు దళిత యువకుడు బొంతా మహేంద్ర వాంగ్మూలం


వైకాపా నాయకుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడు

త ఎన్నికల్లో వైకాపా విజయం కోసం కృషి చేసిన మహేంద్రను... ఆ పార్టీ నాయకుల వల్లే కోల్పోయాను. మంత్రి తానేటి వనితను మేమంతా కష్టపడి గెలిపిస్తే ఆమె కనీసం స్పందించలేదు. నేను జడ్పీటీసీ సభ్యురాలినైనా ప్రొటోకాల్‌ పాటించకుండా వివక్ష చూపుతున్నారు. నాకు గౌరవం లేకపోగా.. చివరికి నా కుమారుడిని కోల్పోయాను. కేసుతో సంబంధం లేకపోయినా మహేంద్రను స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నేను హోం మంత్రితో కలిసి గడపగడప కూ కార్యక్రమంలో ఉన్నా. సమస్యను ఆమెకు వివరించినా మాకు న్యాయం జరగలేదు.

 బొంతా వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు, మహేంద్ర చిన్నమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని